‘మానవ మనుగడ పైన వైరస్ క్రిములదే ఆఖరి మాట’ అని ఏనాడో హెచ్చరించాడు లూయీ పాశ్చర్. ప్రపంచవ్యాపితంగా ప్రబలమై ఉన్న 300 రకాల వైరస్ క్రిముల్ని శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టారు. పెను ఉప్పెన వచ్చి పచ్చని చేలనూ, పంటలనూ ఊడ్చిపెట్టినట్టే, వైరస్ క్రిములూ మానవ జీవితాల్ని నాశనం చేస్తాయని చెబుతూనే ఉన్నారు. అయినా వీటికి పరిష్కారం ఇప్పటిదాకా ఎందుకు దొరకలేదు? ఎందుకంటే, ఈ భయం అధికారాన్ని స్థిరపరచడానికి పనికొస్తుంది. ఇంకాముఖ్యంగా ఫార్మా కంపెనీలకు సిరులు కురిపిస్తుంది. కరోనా సాధారణ ‘ఫ్లూ’ లాంటిదేననీ, దాన్ని నివారించడానికి ‘ఫ్లూ’ సంబంధిత సాధారణ నివారణ చర్యలు సరిపోతాయనీ ఎందరు మొత్తుకున్నా వైద్యరంగాన్ని శాసించడానికి అలవాటుపడిన మందుల కంపెనీల ఒత్తిళ్లకు అమెరికా పాలకులు లొంగిపోయారు. ఆ బాటే ప్రపంచమూ అనుసరిస్తోంది.
‘‘అంటువ్యాధుల, మహమ్మారుల యుగం వెనక బలమైన రాజకీయాల ప్రభావం కూడా ఉంటుంది. ఈ వ్యాధుల నివారణకు రాజ్య వ్యవస్థగానీ, లేదా ప్రభుత్వంగానీ తన పౌరులకు ఏ మేరకు బాధ్యత వహిస్తోంది అన్నది, ఏ మేరకు ప్రజల ప్రతిఘటన ఉందన్నదాన్ని బట్టి తెలిసిపోతుంది. ఎందుకంటే, ఎప్పటి కప్పుడు రానున్న ఎన్నికల తేదీని బట్టి పాలకుల నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అలాగే మహమ్మారి రోగాల నివారణకు ప్రజలు ఎంత వరకు శ్రద్ధ వహించాలని ప్రభుత్వం కోరుకుంటోందన్న దానిపై ఆధార పడి కూడా వ్యాధి ఫలితం ఆధారపడి ఉంటుంది. అంటే ఎన్నికల్లో రాజకీయ లబ్ధిపై ఆధారపడి మహమ్మారి వ్యాధిని అదుపు చేయడానికి పాలకులు ప్రయత్నిస్తారన్నమాట.’’
(చిన్మయ్ తుంబే రాసిన ‘ఏజ్ ఆఫ్ పాండెమిక్స్(1817–1920): హౌ దే షేప్డ్ ఇండియా అండ్ ద వరల్డ్’. 2020)
దేశంలో ‘కరోనా’ కేసులు, వాటికి అనుబంధంగా ‘చిలవలు పలవలు’గా పుట్టుకొస్తున్న రకరకాల అనుబంధ వ్యాధులు – దేశం లోనూ, ప్రపంచ వ్యాపితంగానూ కోటానుకోట్ల ప్రజలను ఆందోళన పరుస్తున్నప్పటికీ ప్రపంచంలోని పెక్కుమంది పాలకులకు పరి ష్కారం దొరక్కపోవడానికి కారణం ఏమిటి? ప్రభుత్వాల నియం త్రణ వ్యవస్థ లోపమా? లేక, మందుల వ్యాపారులకూ, పాలక వర్గాలకూ మధ్య లాభసాటి బేరసారాల ఫలితమా?
‘కోవిడ్’కు ముందు గత 500 సంవత్సరాల క్రితమే ప్రపంచ వ్యాపితంగా ప్రబలమై ఉన్న 300 రకాల వైరస్ క్రిముల్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వీటిలో ఎన్నిరకాల అంటువ్యాధులకు మానవ శరీరమే గాక, మానవేతర ప్రకృతిలోని పశుపక్ష్యాదుల శరీరాలు కూడా దోహదం చేస్తూ వచ్చాయో జీవశాస్త్రవేత్తలు పలువురు విపులంగా చర్చించారు. ఆ మాటకొస్తే నూరేళ్ల నాటి స్పానిష్ ఫ్లూ నుంచి నేటి ‘కోవిడ్–19’ మహమ్మారి దాకా నడిచిన మానవ–మానవేతర కల్లోల ప్రపంచాన్ని గురించి మార్క్ హోనిగ్స్‌బామ్ తన తాజా గ్రంథంలో పూసగుచ్చినట్టు వివరించారు. యుద్ధాల వల్ల, మానవ సంచారం ద్వారా వివిధ ఖండాలలో వ్యాపిస్తూ వచ్చిన రకరకాల వైరస్‌ల గురించి శాస్త్రవేత్తలు చర్చించారు.
కోవిడ్–19 వైరస్‌కు ముందు హెచ్‌ఐవీ, సార్స్ వైరల్ వ్యాధులు ప్రపంచానికి ముందస్తు హెచ్చరికలు. వాటిని ధృవపరుస్తూ తర్వాత ప్రపంచం మీదికి వచ్చి మానవాళిని కకావికలు చేసినవి ఎబోలా, జైకా, కోవిడ్–19. ఈ పరిణామాన్ని వివరిస్తూ 2016లోనే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఒక హెచ్చరిక విడుదల చేసింది – ‘‘వైద్య శాస్త్రం అమోఘమైన అసాధారణ పురోగతిని సాధించినప్పటికీ, అంటువ్యాధుల ప్రమాదం గురించి మనం ఉదాసీన వైఖరితో ఉండరాదు.
ఎందుకంటే నానాటికీ అంటువ్యాధుల వ్యాప్తి పెరిగి పోతున్నట్టు కన్పిస్తోంది’’. ఈ వ్యాప్తిని గురించి 1880లలోనే తొలిసారిగా ప్రపంచానికి వెల్లడించి, శాస్త్రబద్ధంగా వివరించిన మహ నీయుడు లూయీ పాశ్చర్. ‘‘మానవ మనుగడ పైన వైరస్ క్రిములదే ఆఖరి మాట’’ (ఇటీజ్ ది మైక్రోబ్స్ దట్ విల్ హావ్ ద లాస్ట్ వర్డ్) అని హెచ్చరించాడు పాశ్చర్.
అంతటితో ఆగకుండా మానవ జీవితం అంటేనే క్రిమి, క్రిమి అంటేనే జీవితం – పెను ఉప్పెన వచ్చి పచ్చని చేలనూ, పంటలనూ ఊడ్చిపెట్టినట్టే, వైరస్ క్రిములూ మానవ జీవితాల్ని నాశనం చేస్తాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. అమె రికా యుద్ధోన్మాదుల చర్యల ఫలితంగా ఆఫ్రికా ఖండానికేగాక, యావత్ ప్రపంచానికే మొదటిసారిగా ఎయిడ్స్ మహమ్మారి వ్యాధి పాకిపోయి కోట్లాదిమంది జీవితాలను బుగ్గిపాలు చేసింది.
ఇంతకు ముందు వచ్చిన వ్యాక్సిన్‌లతో ఫార్మా కంపెనీలు సాధారణ వ్యాపారం చేసినా, మానవ జీవితాలతో చెలగాటమాడే స్థితికి చేరుకోలేదు. ఎప్పుడయితే కరోనా–19 బయటపడిందో పరిస్థితి మారిపోయింది.
అది సాధారణ ‘ఫ్లూ’ వ్యాధికి సంబంధించినదేగానీ మరొకటి కాదనీ, ఆ రోగ నిరోధానికి ‘ఫ్లూ’ సంబంధిత సాధారణ నివారణ చర్యలు సరిపోతాయనీ అమెరికా వైద్య శాస్త్ర పరిశోధకులూ, ఇతర నిపుణులూ మొత్తుకున్నారు. అయినా అక్కడి వైద్యరంగాన్ని శాసించడానికి అలవాటుపడిన మందుల వ్యాపార కంపెనీల ఒత్తిళ్లకు అమెరికా పాలకులు లొంగిపోయారు. అంతేకాదు, ప్రపంచవ్యాపితంగా అమె రికా ఫార్మా కంపెనీల తాఖీదులకు ‘జీ హుకుం’ అనేట్టు చేశారు.
అమెరికా ఉద్దండ వైద్య శాస్త్ర నిపుణులు కోవిడ్–19 వైరస్‌కు సాధారణ ‘ఫ్లూ’కు వాడే మందులు వాడితే చాలునని పదేపదే హెచ్చరించినా అక్కడి ఫార్మా గుత్త కంపెనీలు మాత్రం మానవ రక్తం పీల్చుకోవడానికి అలవాటుపడి ప్రభుత్వం చేతులు కట్టివేశాయి.
ఈలోగా ‘ఫ్లూ’ వ్యాధి నివారణకు మనం వాడుకునే ‘ఆరుకోట్ల వయల్స్’ను అమెరికాకు కారుచౌకగా మన పాలకులు ధారాదత్తం చేసి, ఆ వయల్స్ దేశ ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని మరచిపోరాదు. ఇక అమెరికా విద్యే మనకూ అలవాటయింది.
అమెరికా ఫార్మా గుత్త కంపెనీలే ఇక్కడి పాలకులకూ అనుసరణీ యమయ్యాయి. చివరికి దేశీయ కంపెనీలు అనుకున్న భారత్ బయోటెక్ లాంటి సంస్థలు కోవిడ్–19 నిరోధానికి తయారు చేశామని చెప్పిన వ్యాక్సిన్‌లను విడుదల చేసేముందు ‘మూడు దశల పరీక్షల ఫలితాలను మా ముందు ఉంచం’డని శాస్త్రవేత్తలు కోరినా ఈరోజుదాకా ఆ మూడు పరీక్షల అంతిమ ఫలితాలను కంపెనీ సమ ర్పించకపోవడం వైద్య పరిశోధనా రంగంలో ఒక శాశ్వత మచ్చగా నిలిచిపోయింది.
అయినా దేశ పాలకులు ఏ కారణం చేతనో ఆ అసమగ్ర పరిశోధననే అందలమెక్కించి దేశ, విదేశాలకు ఆ కంపెనీ మందుల్నే ఎగుమతి చేస్తున్నారు. ఈ దశలో బయోటెక్ కంపెనీ మోసం చేసిందన్న ఆరోపణపై కొనుగోళ్లు నిల్పివేసి, బ్రెజిల్ ప్రభుత్వం దావాలకు దిగడం మరో అవమానకర ఘట్టం.
బయటేమో మన భాగోతం అలా ఉంది. దేశంలోనేమో గుజ రాత్‌లో కూడా కోవిడ్ మరణాల సంఖ్య తక్కువేమీ లేదు. అయినా ప్రతిపక్షాల ప్రభుత్వాలున్న మూడు దక్షిణాది రాష్ట్రాలు, ఒక ఢిల్లీ (కేజ్రీవాల్) ప్రభుత్వాన్ని మాత్రమే కోవిడ్ విజృంభణ, కోవిడ్ మరణాలు పెరుగుతున్నాయన్న పేరిట కేంద్ర పాలకులు ‘యాగీ’కి దిగడం ఆశ్చర్యకరం! ఏతావాతా ప్రస్తుతం కరోనా ఆధారిత ‘గుంపు చింపుల’న్నీ చిత్రమైన దశకు చేరుకున్నాయి. ఎటూ నిర్ధాణగా తేల్చలేని ‘కోవిడ్–19’ ప్రభావం గురించీ, రోజుకో కొత్త కోవిడ్ వేరియంట్ బయటపడుతోందని ఫార్మా కంపెనీలు చెప్పే మాటలు... వైద్యుల్నేగాదు, ప్రజలనూ తీవ్ర గందరగోళంలోకి నెడుతున్నాయి.
ఫలితంగా గొప్పగొప్ప వైద్యులు సహితం నిర్దిష్ట సలహాలు ఇవ్వగల స్థితిలో లేక ‘మాస్కు’లు పెట్టుకుని తిరగమని సలహా ఇవ్వడానికి మించి నిర్దిష్ట దృక్పథానికి ఇప్పటికీ రాలేకపోతున్నారు. ఈ ధోరణి సామాన్య ప్రజలను మింగలేని కక్కలేని పరిస్థితుల్లోకి నెడుతోంది.
చివరికి ఈ రకరకాల ‘వేరియంట్లు’ స్వరూప స్వభావాలను కూడా చివరికి వివరించి చెబుతున్నది డాక్టర్లుగానీ, వైద్య నిపుణులు గానీ కాదు. లాభసాటి వ్యాపారంలో ఉన్న బడా ఫార్మా కంపెనీలు, వారి కాంటాక్టులో ఉన్న కొందరు వైద్యులూ, ఏజెంట్లూ మాత్రమేనని అనుమానాలు తీవ్రతరమవుతున్నాయి. ఇంతకూ అసలు ‘కరోనా’, దాని తాలూకూ వేరియంట్ల కథ ‘కంచి’కి ఎప్పుడు చేరుతుంది? వైద్యులు, రోగులు ‘ఇళ్ల’కెప్పుడు చేరతారు?!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment