ట్యాబ్‌లో వివరాలు నమోదు చేస్తున్న ఏఎన్‌ఎం
పాలమూరు: జ్వరం వచ్చినప్పుడు లేదా అస్వస్థతకు గురైనప్పుడు సమీపంలోని ఆస్పత్రికి వెళ్తాం.. వైద్యులను సంప్రదించి వారు రాసిచ్చిన మందులు వాడతాం... జబ్బు తగ్గుముఖం పట్టాక మళ్లీ దైనందిన కార్యకలాపాల్లో నిమగ్నమవుతాం.. కానీ కొన్ని వ్యాధులు పూర్తిగా తగ్గినా.. మరికొన్ని అప్పటి వరకే తగ్గినట్లు కనిపించి కొద్దిరోజులకు తిరగబెడతాయి.. తద్వారా ముంచుకొస్తున్న ముప్పును గుర్తించేలోగానే నష్టం జరిగిపోతుంది... ఇలాంటి పోకడల వల్లే దేశంలో నూటికి 60శాతం మరణాలు సంభవిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీంతో ఆరోగ్యకర సమాజం ఏర్పాటుతో పాటు మరణాల సంఖ్యను తగ్గించడం, వ్యాధులను నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది.
అధిక రక్తపోటు(బీపీ), మధుమేహం(షుగర్), కేన్సర్, శ్యాసకోస వ్యాధులు, గుండె జబ్బులను గుర్తించడానికి అసంక్రమిత వ్యాధుల(నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–ఎన్‌సీడీ) పేరిట సర్వేను ప్రారంభించింది. 30ఏళ్లు దాటిన ప్రతీ మహిళ, పురుషుడి వ్యక్తిగత ఆరోగ్య వివరాలను సేకరించడమే ఈ సర్వే లక్ష్యం. ఈ నేపథ్యంలో అయిదు రకాల వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన మందులు, వైద్యాన్ని ప్రభుత్వమే ఉచితంగా అందించడానికి ఈ పథకాన్ని రూపొందించింది. ఈ మేరకు 1వ తేదీ నుంచి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సర్వే ప్రారంభించారు.
ఆరు నెలల్లో లక్ష్యం పూర్తి చేయాలి
జిల్లా పరిధిలో 28 పీహెచ్‌సీలు 217 సబ్ సెంటర్ల పరిధిలో ఉన్న 5,62,000 మందికి ఆరు నెలల్లో ఎన్‌సీడీ కింద పరీక్షలు పూర్తి చేయాలి. ఈనెల 1వ తేదీన సర్వే ప్రారంభం కాగా.. శుక్రవారం వరకు 15,232మందికి పరీక్షలు చేశారు. ఒక్క సబ్‌సెంటర్ పరిధిలో ఇద్దరు ఏఎన్‌ఎంఎలు, ఆద్దరు ఆశా కార్యకర్తలు కలిసి రోజుకు 30మందిని పరీక్షించాల్సి ఉంటుంది. బీపీ, మధుమేహ పరీక్షలు చేయడమే కాదు బరువు, ఎత్తు, నడుము కొలతలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉంటే మందులు వాడుతున్నారా, లేదా అనే వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఇలా సేకరించిన వివరాలను తొలుత రిజిస్టర్‌లో రాసుకుని ఆ తర్వాత వాటిని ట్యాబ్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఆ తర్వాత సమస్త ఆరోగ్య సమాచారాన్ని కార్డులో పొందుపరిచి వారికి అందజేస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోకుండా అనారోగ్యానికి గురైతే ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందాల్సి వచ్చినప్పుడు ఈ కార్డులోని సమాచారం అక్కడి వైద్యులకు ఉపయోగపడుతుంది. తద్వారా మళ్లీ పరీక్షలు చేయాల్సిన సమయం, ఖర్చు కలిసొస్తుంది. అంతేకాకుండా సకాలంలో చికిత్స మొదలుపెట్టే అవకాశం ఉండడంతో ప్రాణాలు కాపాడుకోవచ్చు.
పీహెచ్‌సీల్లో ప్రత్యేక విభాగం
ప్రతీ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)ల్లో నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్(ఎన్‌సీడీ) క్లినిక్‌ల పేరిట ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం సిబ్బందిని సైతం నియమించనున్నారు. ఎండీ స్థాయి వైద్యుడి ఆధ్వర్యంలో ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులు, నలుగురు హెడ్ నర్సులతో ఈ ప్రత్యేక విభాగం పనిచేయనుంది. ఈ కేంద్రాల్లో రోగ నిర్ధారణ చేయనుండగా కేన్సర్‌ను గుర్తించే పరికరాలు సైతం ఎన్‌సీడీ క్లినిక్‌లకు చేరాయి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సర్వేలో బీపీ, మధుమేహం ఉన్నట్లు తేలిన వారికి ప్రభుత్వమే ఉచితంగా మందులను సరఫరా చేయనుంది. ప్రతీనెల సంబంధిత గ్రామ సబ్ సెంటర్ ఏఎన్‌ఎం వీటిని అందిస్తారు. పరిధి దాటిన దీర్ఘకాలిక వ్యాధులు, కేన్సర్లతో బాధపడుతున్న వారికి చికిత్స అందించడానికి జిల్లా వైద్యశాలల్లో ఎన్‌డీసీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తారు.
ఎన్‌సీడీ అంటే
ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందని వ్యాధులను అసంక్రమిత వ్యాధులు(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) అంటారు. ఇందులో రక్తపోటు, మధుమేహంతో పాటు మహిళల్లో వచ్చే రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్స ర్లు, పొగాకు వినియోగించే వారిలో వచ్చే నోటి, గొం తు కేన్సర్లను ఈ పథకం కిందకు తీసుకొస్తున్నారు.
గుర్తింపు ఇలా
- దీర్ఘకాలిక రోగులను గుర్తించడానికి నాలుగు దశల్లో వడబోత జరుగుతోంది.
- ఆశా కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి 30ఏళ్లు పైబడిన వారితో మాట్లాడి వారికి ఉన్న వ్యాధుల వివరాలను వైద్యాధికారులు రూపొందించిన సీ–బ్యాక్ దరఖాస్తులో పొందుపరుస్తారు.
- వీటిని ఏఎన్‌ఎంలు పరిశీలించి నాలుగు పాయింట్ల కన్నా అధికంగా వచ్చిన వారిని మరోసారి పరీక్షిస్తారు. దీర్ఘకాలిక రోగాల ప్రాథమిక సమాచారాన్ని సంబంధిత హెడ్‌నర్సుకు అందజేస్తారు.
- హెడ్ నర్సు తన వద్ద ఉండే బీపీ, షుగర్ పరీక్షలు చేసే యంత్రాలతో వ్యాధిగ్రçస్తులను మరోసారి పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేస్తారు. కాగా, కేన్సర్లను గుర్తించేందుకు హెడ్ నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
- గర్భాశయ ముఖద్వారా కేన్సరు గుర్తింపు కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. మూడు దశల్లో వ్యాధి ఉన్నట్లు అనుమానమొస్తే వారిని వైద్యాధికారి ప్రత్యేకంగా పరీక్షిస్తారు.
పకడ్బందీగా ఆరోగ్య పరీక్షలు
జిల్లాలో అసంక్రమిత వ్యాధుల గుర్తింపుపై ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో సర్వే పకడ్బందీగా జరుగుతోంది. గ్రామాల వారీగా సేకరించిన వివరాల ఆధారంగా చికిత్స అందజేస్తాం. జిల్లాలో ఆరు నెలల పాటు సర్వే కొనసాగుతుంది. రోగ నిర్ధారణ జరిగాక ఒక కార్డు ఇస్తాం. ఇందులో వారి ఆరోగా>్యనికి సంబంధించిన సమగ్ర వివరాలను పొందు పరుస్తాం. వివరాలు సేకరించేందుకు ఇళ్లకు వచ్చే ఆశా కార్యకర్తలకు ప్రజలు సహకరించాలి. పూర్తి ఆరోగ్య వివరాలను దాచుకోకుండా తెలియజేయాలి. అప్పుడే పథకం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది. – డాక్టర్ రజిని, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment