కనీస సౌకర్యాలు లేని కొత్తూరు సీహెచ్‌సీ
సాక్షి, కొత్తూరు (శ్రీకాకుళం): పాలకుల నిర్లక్ష్యానికి ఆస్పత్రులు అధ్వానంగా తయారయ్యాయి. రోగులకు కనీస సౌకర్యాలు అందక అవస్థలు పడుతున్నారు. కొత్తూరు పీహెచ్‌సీలో ఏళ్లుగా వసతి, వైద్య సిబ్బంది కొరత వేధిస్తుండడంతో ప్రజలు వైద్యం కోసం ఇతర మండలాలు, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. సీహెచ్‌సీ, పీహెచ్‌సీలను అభివృద్ధి చేయడం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తామని చెప్పిన కలమట ఇచ్చిన హామీ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఐదుగురు రెగ్యులర్ వైద్యులు ఉండాల్సిన ఆస్పత్రిలో ఒక్క రెగ్యులర్ వైద్యుడు కూడా లేకపోవడం దారుణం. ముగ్గురు వైద్యులు డెప్యుటేషన్‌పై సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో అరకొరగా మందులు అందుబాటులో ఉండడం, సిబ్బంది లేకపోవడం, వైద్య పరికరాల, వసతి సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు.
కుటుంబ నియంత్రణ అపరేషన్ల కోసం బాలింతలు మండల కేంద్రం నుంచి 13 కిలోమీటర్లు దూరంలో ఉన్న కురిగాం పీహెచ్‌సీకి, లేదా సీతంపేట మండలం మర్రిపాడు పీహెచ్‌సీకి వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. గైనకాలజిస్టు లేక పోవడంతో గర్భిణులు, మహిళలు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌రే మిషన్ పాడై 12 సంవత్సరాలు దాటుతున్నా నేటకీ కొత్తది మంజూరు చేయలేదు. దీంతో ఎముకలకు సంబంధించిన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. పేరుకే 50 పడకల ఆస్పత్రి..కానీ రోగులకు పడకలు లేక వరండాలో చికిత్స పొందాల్సిన పరిస్థితి. తమకు అనారోగ్యం వస్తే విదేశాల్లో చికిత్సలు చేయించుకునే టీడీపీ నేతలు గ్రామీణ ప్రజలకు వైద్య సేవలందించే ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిని గాలికొదిలేశారని పలువురు విమర్శిస్తున్నారు.
ఎక్స్‌రే మిషన్ లేక అవస్థలు
ఆస్పత్రిలో ఉన్న ఎక్స్‌రే మిషన్ పాడై 12 సంవత్సరాలవుతోంది. కొత్త మిషన్ మంజూరు చేయాలని పాలకులకు పలుమార్లు వినతులు అందజేశాం. కానీ ఇంతవరకు మంజూరు చేయలేదు. ఎక్స్‌రే సదుపాయం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకో, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికో పరుగులు తీయాల్సి వస్తోంది. గైనకాలజిస్ట్, ఆర్థోపెడీషియన్ లేకపోవడంతో గర్భిణులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
– లోతుగెడ్డ ఉపేంద్ర, కొత్తూరు
సీహెచ్‌సీ ఉన్నా పీహెచ్‌సీకి పరుగులు
మండల కేంద్రంలో సీహెచ్‌సీ ఉన్నా వైద్యులు, మందులు, వసతి లేకపోవడంతో వైద్యం కోసం సీతంపేట, పాలకొండ పీహెచ్‌సీలకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులు అంత దూరం వెళ్లి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కొత్తూరు సీహెచ్‌సీలో సదుపాయాలు కల్పించాలి.
– పడాల వెంకటకృష్ణ, ఎన్.ఎన్.కాలనీ, కొత్తూరు
Comments
Please login to add a commentAdd a comment