సాక్షి, నర్వ: ప్రమాదాలు సంభవించినప్పుడు, అకస్మాత్తుగా గుండెనొప్పో, మరే ఇతర అనారోగ్య కారణాలు ఎదురై అత్యవసర వైద్యం అవసరమైన పరిస్థితుల్లో గుర్తొచ్చేది కుయ్..కుయ్ అంటూ వచ్చే వాహనం 108. ఈ వాహనాలను అత్యవసర చికిత్సల కోసం మెరుగైన వైద్యకోసం తీసుకవెళ్లేందుకు ప్రతి మండల కేంద్రానికి ఒక్కటి వైద్యా ఆరోగ్య శాఖ కేటాయించింది. ఈ నేపథ్యంలో నర్వ మండలానికి మాత్రం 108 సౌకర్యం అందనంత దూరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రక్కనున్న మండలాల నుంచే వాహనం రావల్సిన పరిస్థితిపై ‘సాక్షి ’అందిస్తున్న కథనం.
మండలంలో పరిస్థితి
మండలంలో 15 పంచాయతీలుండగా మరో నాలుగు కొత్తపంచాయతీల ఏర్పాటుతో మొత్తం 19 పంచాయతీలున్నాయి. ఇందులో దాదాపు 35వేలకు పైగా జనాభా ఉంది. ఈ గ్రామాల్లో ప్రమాదవశాత్తు ఏమైన ప్రమాదం సంభవించిన, అనారోగ్య కారణాలతో ఆస్పత్రికి వెళ్లాలన్నా ఇక్కడ 108 వాహనం అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం వెళ్ళాలంటే ఇతర మండలాల నుంచి 108 వాహనం పిలుపించుకోవాలంటే సుమారు 25 కిలోమీటర్ల దూరం నుండి రావల్సిందే. ఈనేపథ్యంలో మండలంలో ఇలాంటి ఇబ్బందులు నిత్యాకృత్యం. గత ఏడాది మండల కేంద్రానికి హైదరాబాద్ నుండి వస్తున్న ఆర్టీసి బస్సు డ్రైవర్‌కు నర్వకు రావడంతో గుండె నొప్పి తీవ్రంగా వచ్చింది. దీంతో ఆయన బస్సును నర్వ చౌరస్తాలో నిలిపి నొప్పితో బాదపడుతుండగా సమయానికి అంబులెన్స్ కాని, 108 అందుబాటులో లేక పోవడంతో అక్కడే నొప్పి భరిస్తూ.. ప్రాణాలు విడిచాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నా పాలకులు, అధికారులు 108 వాహనాన్ని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దాతలు ఇచ్చిన అంబులెన్స్ ఏది..?
ఇలాంటి పరిస్థితులు రాకుడదని దాత లక్ష్మీకాంత్‌రెడ్డి అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసి ఆసుపత్రికి అందజేస్తే డ్రైవర్ పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేక మూలన పడేశారు. దీంతో కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా అందని ద్రాక్షగా మారింది.
దూరంగా శివారు గ్రామాలు
మండలంలోని శివారు గ్రామాలలో కొత్తపల్లి, జక్కన్నపల్లి, లక్కర్‌దొడ్డి, గ్రామాలకు రహదారి సరిగ్గా లేదు. దీంతో పాటు చివరి గ్రామాలకు ఎటు వైపు నుంచి 108 వాహనం రావాలన్నా సుమారు 25 కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో మండల కేంద్రానికి 108 వాహనం కేటాయిస్తే ఇలాంటి ఏ ప్రమాదాలు సంభవించిన వెంటనే మెరుగైన చికిత్స కోసం తీసుకవెళ్ళవచ్చని ఆయా గ్రామాలు ప్రజలు కోరుతున్నారు.
వాహన సదుపాయం కల్పించాలి
మండలంలో 108 వా హనం లేక అత్యవసర స మయంలో అనేక ఇబ్బందులు పడుతున్నాం. అవసరమైనప్పుడు ప్రవేటు వాహనాలలో తీసుకవెళ్లిన అందులో సరైన సౌకర్యాలు లేక పోవడంతో ప్రాణనష్టం సంభవించింది. సకాలంలో వైద్య సేవల అందలంటే 108 వాహనం సరైన పరిస్థితుల్లో అందులో అవసరమైతే అత్యవసర ప్రాథమిక చికిత్సకు అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు మండల కేంద్రానికి ఒక్క 108 వాహనం సమకూర్చాలి.
– అన్సారి, లంకాల్
Comments
Please login to add a commentAdd a comment