దోపిడీకి ‘108’ దారులు
అంబులెన్స్ నిర్వాహకుల కక్కుర్తి
ఇంధనం కొరత, లైన్ల బిజీ పేరుతో దగా...
అంబులెన్స్‌లు తిప్పకుండా సర్కారు సొమ్ము డ్రా
‘సాక్షి’కి చిక్కిన ఆధారాలు
ఏటా రూ. 15 కోట్లు
ఉద్యోగుల జీతాల్లోనూ కోత
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అత్యవసర సమయాల్లో అపరసంజీవిగా పేరొందిన 108 అంబులెన్స్ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇంధనం కొరత, లైన్ల బిజీ పేరుతో అంబులెన్సులను నడపకుండా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారు. వాహనాలను నడపకుండా ఏటా దాదాపు రూ.15 కోట్లకు పైగా దండుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. వీటికి సంబంధించిన ఆధారాలు ‘సాక్షి’కి అందాయి. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం తెలంగాణలో 336 వాహనాలుండాలి.
ప్రతిరోజూ 90 శాతం వాహనాలు(305) క్రమం తప్పకుండా ఎమర్జెన్సీ సేవలందించాలి. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో వాహనానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,20,265 రూపాయలు చొప్పున చెల్లిస్తోంది. అలాగే, ఒక్కో అంబులెన్సుకు సగటున ఐదుగురు ఉద్యోగులు షిఫ్ట్‌ల వారీగా సేవలందించాలి. ఇందుకోసం ఐదుగురు ఉద్యోగులకు కలిపి జీతభత్యాల రూపేణా 70,799 రూపాయలు చెల్లించాలి.
ఒక్కో అంబులెన్సుకు ప్రతినెలా 24,888 రూపాయలు విలువ చేసే (ఆయిల్‌తో కలిపి) డీజిల్‌ను ఖర్చు చేయాలి. వీటితోపాటు వాహన నిర్వహణకు 9,160 (రిపేర్, టైర్లు, ఇతర ఖర్చులు సహా), సమాచార మార్పిడికి 1,736, మందులకు 2,663 రూపాయలు చెల్లిస్తోంది. ఇవికాకుండా ప్రింటింగ్, స్టేషనరీ, కొరియర్, ఆడిట్, లీగల్, మీటింగ్, మార్కెటింగ్, ట్రైనింగ్, హౌస్‌కీపింగ్, స్టాఫ్ వెల్ఫేర్, టీఏ, భద్రత, ఆఫీస్ నిర్వహణ, కరెంటు, వాటర్ వంటి ఖర్చుల పేరిట ప్రతినెలా ఒక్కో వాహనానికి 11,019 రూపాయలు చెల్లిస్తోంది.
అక్రమాల చిట్టా...
108 నిర్వాహకులు సాకులు చెబుతూ ఎమర్జెన్సీ సేవలను నిలిపివేసి డబ్బులు దండుకుంటున్నారు. గడిచిన అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలకు సంబంధించి కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 48 ప్రాంతాలకు సంబంధించి అంబులెన్సులకు ఖర్చు చేసిన డీజిల్ వివరాలు, సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ, ఇతరత్రా ఖర్చుల వివరాలను ‘సాక్షి’ సేకరించింది. ప్రతి నెలా ఒక్కో వాహనానికి 24,888 రూపాయల మేరకు ఇంధనం ఖర్చు చేయాల్సి ఉండగా, సగటున రూ. 18 వేలలోపే ఖర్చు చేసినట్లు వెల్లడైంది.
ఈ నాలుగు నెలల్లో 48 అంబులెన్సులకు ఇంధనం, జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులన్నీ కలిపి 2 కోట్ల 30 లక్షల 90 వేల 880 రూపాయలు ప్రభుత్వం చెల్లించగా, అందులో దాదాపు 75 లక్షల రూపాయలు మిగిలించుకున్నట్లు తేలింది. ఈ లెక్కన ఈ జిల్లాల్లోని మిగిలిన వాహనాలతో కలిపి గడిచిన నాలుగు నెలల్లోనే సుమారు 5 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ సొమ్మును దారి మళ్లించినట్లు తెలుస్తోంది. అంటే తెలంగాణలోని 336 అంబులెన్సులకు సంబంధించిన లెక్కలను పరిశీలిస్తే.. దాదాపు 15 కోట్ల రూపాయలకుపైగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సిబ్బంది జీతభత్యాల్లోనూ కోతలు విధిస్తున్నట్లు సమాచారం.
ఒక్కో వాహనానికి 2:5 నిష్పత్తి చొప్పున రెండు షిఫ్టులకు కలిపి ఐదుగురు సిబ్బంది పనిచేయాల్సి ఉండగా, 10 శాతం వరకు ఖాళీలుగా చూపుతున్నారు. ఐదుగురు ఉద్యోగులకు కలిపి ప్రతినెలా రూ. 70,799లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, అందుకు భిన్నంగా రూ.50 వేలలోపే చెల్లిస్తున్నారు. ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా 1,536 ఎమర్జెన్సీ కేసులను తీసుకెళ్లాల్సి ఉన్నప్పటికీ అందులో సగం కూడా తీసుకెళ్లడం లేదని తెలుస్తోంది.
సాకులు చెబుతూ...
పట్టణాల్లో అయితే ఫోన్ చేసిన 20 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోనైతే 25 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే 30 నిమిషాల్లో ప్రమాద స్థలానికి 108 అంబులెన్సులు రావాలి. కానీ, నేడు గంటల తరబడి వేచి చూసినా అంబులెన్సులు రాని పరిస్థితి నెల కొంది. 108 సర్వీసులకు ఫోన్ చేస్తే బిజీ అని సమాధానం ఇస్తున్నారు. వాస్తవానికి ఒక ప్రాంతంలో అంబులెన్సు బిజీగా ఉంటే పొరుగు మండలంలో ఖాళీగా ఉన్న అంబులెన్సును రప్పించాలి. అక్కడ కూడా బిజీగా ఉంటే మరొక ప్రాంతంలో ఉన్న అంబులెన్సును పంపించి క్షతగాత్రులను, రోగుల ప్రాణాలను కాపాడేందుకు యత్నించాలి. ఆచరణలో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఇంధనం కొరత ఉందని, బ్రేక్ డౌన్ అయ్యిందని, నిర్వాహకులు అనుమతి ఇవ్వడం లేదనే సాకులతో అంబులెన్సులను పంపడం లేదు.
సీఎం ఆదేశాలూ బేఖాతర్
తెలంగాణ ఏర్పాటైన కొత్తలో నిధుల విడుదల కాలేదని 108 నిర్వాహకులు జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో రోజూ వందకుపైగా అంబులెన్సులను నిలిపివేశారు. దీంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని సంస్థ నిర్వాహకులకు క్లాస్ తీసుకున్నారు. అంబులెన్సు సేవల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతోపాటు ఇకపై డీజిల్ కొరత, ఇతరత్రా కుంటిసాకులతో ఎమర్జెన్సీ సేవలను నిలిపివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశానంతరం అక్టోబర్ 6న సీఎం కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 108 సంస్థ ప్రతినిధులు సైతం మీడియా మందుకొచ్చి ఇకపై అన్ని వాహనాలను రోడ్డెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ‘సాక్షి’కి అందిన వివరాల ప్రకారం... ప్రతిరోజూ సగటున 50కిపైగా వాహనాలను నడపకుండా పక్కన పెడుతున్నట్లు తెలిసింది.
అధిపతులంతా ఆంధ్రావారే...
108 సేవలకు సంబంధించి మొత్తం ఏడు విభాగాలుండగా, అందులో ఒక్కరు కూడా తెలంగాణకు చెందిన వాళ్లు లేరని చెబుతున్నారు. ఏడుగురు అధిపతుల్లో ఆరుగురు ఆంధ్రాకు చెందిన వారుకాగా, మిగిలిన ఒకరు ఉత్తరాది వ్యక్తి అని పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన జరిగినా ఇప్పటి వరకు 108 సర్వీసుల కాల్ సెంటర్ విభజన జరగలేదని సిబ్బంది వాపోతున్నారు.
అంతా పారదర్శకం: రఫీ, ఆర్‌ఎం
108 సేవలకు సంబంధించి పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని సంస్థ రీజనల్ మేనేజర్ రఫీ పేర్కొన్నారు. ‘సంస్థ పెడుతున్న ఖర్చుకు సంబంధించి ప్రతి ఒక్క రూపాయికి అంతర్గతంగా ఆడిటింగ్ జరుగుతోంది. పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. నిధులను దారి మళ్లిస్తున్నారనడం సరికాదు’ అని పేర్కొన్నారు. 108 సర్వీసులకు ఫోన్ చేస్తే ఇంధనం కొరత, ఇతరత్రా సాకులతో వాహనాన్ని పంపడం లేదని వస్తున్న ఆరోపణలనూ కొట్టిపారేశారు.