పీహెచ్‌సీల్లో స్పెషాలిటీ వైద్యసేవలు | Specialty medical services in PHCs | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీల్లో స్పెషాలిటీ వైద్యసేవలు

Published Sat, Jan 2 2021 4:41 AM | Last Updated on Sat, Jan 2 2021 4:41 AM

Specialty medical services in PHCs - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య ముఖచిత్రం మారిపోనుంది. ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం మరింత చేరువ కానుంది. అర్ధరాత్రో అపరాత్రో పేషెంటు వెళితే ఎవరూ అందుబాటులో లేరన్న విమర్శలకు ఇక తావుండదు. పేద రోగులకు నూతన సంవత్సర కానుకగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఈనెల నుంచి 24 గంటలూ పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిపై రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు జారీచేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఔట్‌పేషెంటు సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వస్తే డాక్టర్‌కు ఫోన్‌ చేస్తే పది నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకుంటారు. దీనికితోడు ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ప్రాధాన్యం సంతరించుకోనుంది. ప్రతి రెండువేల కుటుంబాలకు ఒక వైద్యుడు బాధ్యుడుగా ఉంటారు. కేరళ, తమిళనాడు తరహాలో ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేసే దిశగా చర్యలు పూర్తయ్యాయి. 

ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు
రాష్ట్రంలో ప్రస్తుతం 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ప్రతి పీహెచ్‌సీలోను ఇద్దరు వైద్యులు ఉండేలా నియామకాలు పూర్తయ్యాయి. వైద్యసేవలతో పాటు రక్తపరీక్షలు కూడా అక్కడే చేసి వైద్యం చేస్తారు. రాత్రిపూట వైద్యానికి వస్తే డాక్టర్‌కు ఫోన్‌ చేస్తే వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఫార్మసిస్ట్, ల్యాబ్‌టెక్నీషియన్, స్టాఫ్‌ నర్సులు అందుబాటులో ఉంటారు. ప్రాథమిక వైద్యానికి సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి షుగరు, బీపీకి
ఇకమీదట ఆదివారం మినహా మిగిలిన ఆరురోజులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అసాంక్రమిక వ్యాధులకు ఔట్‌పేషెంటు సేవలు అందుబాటులో ఉంటాయి. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌ వ్యాధులకు ఈ క్లినిక్‌లు పనిచేస్తాయి. వ్యాధి తీవ్రతను బట్టి రిఫరల్‌ విధానం అంటే పెద్దాస్పత్రులకు పంపించే ఏర్పాట్లు జరుగుతాయి. ఈ వ్యాధులకు మందులన్నీ రోగులకు ఉచితంగా ఇస్తారు. 

ఆరురోజులు స్పెషలిస్టుల సేవలు
ఇప్పటివరకు పీహెచ్‌సీల్లో ప్రాథమిక వైద్యమే (ఎంబీబీఎస్‌ డాక్టరు చేసే వైద్యమే) లభించేది. ఇకమీదట ఆరురకాల స్పెషాలిటీ వైద్యసేవలు అందించనున్నారు. ఈఎన్‌టీ, డెంటల్, కంటిజబ్బులు, మెంటల్‌ హెల్త్, గేరియాట్రిక్, గైనకాలజీ సేవలు అందిస్తారు. ఒక్కో స్పెషాలిటీకి ఒక్కోరోజు చొప్పున ఆరురోజులు ఆరుగురు స్పెషాలిస్టు డాక్టర్లు ఔట్‌పేషెంటు సేవలు అందిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి ఈ డాక్టరే పెద్దాస్పత్రికి రిఫర్‌ చేస్తారు. ప్రతి స్పెషలిస్టు డాక్టరు ఉదయం, మధ్యాహ్నం వేర్వేరు పీహెచ్‌సీల వంతున వారంలో 12 పీహెచ్‌సీల్లో వైద్యసేవలు అందించాలి. 

నిరంతరం అందుబాటులో ఫ్యామిలీ డాక్టరు 
పీహెచ్‌సీలో వైద్యుడికి రెండువేల కుటుంబాల ఆరోగ్య బాధ్యతలు అప్పగించారు. ఆ రెండువేల కుటుంబాలకు అతడు ఫ్యామిలీ డాక్టరుగా ఉంటారు. వారికి ఆరోగ్యపరంగా ఎప్పుడు అవసరమైనా ఆ వైద్యుడు సంబంధిత సమాచారాన్ని విశ్లేషించి తగిన చికిత్స అందిస్తారు. అవసరమైతే పెద్దాస్పత్రికి రిఫర్‌ చేస్తారు.

అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం
పీహెచ్‌సీలన్నిటినీ 24 గంటలు పనిచేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. స్పెషలిస్టు డాక్టర్లను కూడా ఏర్పాటు చేశాం. అన్ని పీహెచ్‌సీల్లో డబుల్‌ డాక్టర్‌ ఉంటారు. డాక్టరు లేడు, మందులు లేవు అన్న మాట వినిపించదు.
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement