Andhra Pradesh: భారీ రిక్రూట్‌మెంట్‌.. కొలువుల జాతర | CM YS Jagan Approved for massive recruitment medical health department | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: భారీ రిక్రూట్‌మెంట్‌.. కొలువుల జాతర

Published Wed, Oct 20 2021 2:43 AM | Last Updated on Wed, Oct 20 2021 3:27 PM

CM YS Jagan Approved for massive recruitment medical health department - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామ స్థాయిలో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నుంచి మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా, ఏరియా, బోధనాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీ రిక్రూట్‌మెంట్‌కు ఆమోదం తెలిపారు. ఒకేసారి ఏకంగా 11,775 వైద్య పోస్టుల భర్తీకి సీఎం అంగీకారం తెలిపారు.

పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనుందని, ఆ వెంటనే నోటిఫికేషన్‌ ఇస్తామని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ వెల్లడించారు. మరోవైపు వీటికి అదనంగా కొత్త పీహెచ్‌సీల నిర్మాణం  కొనసాగుతున్నందున మరో 3,176 పోస్టులను కూడా తరువాత భర్తీ చేయనున్నట్లు వివరించారు. గత సర్కారు ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోగా రద్దు చేసి ఔట్‌సోర్సింగ్‌కు అవకాశం కల్పించింది. ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించేందుకు డాక్టర్లతో పాటు నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది సహా ఇతర ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు.

ఏటా వేతనాలకు అదనంగా రూ.726.34 కోట్లు
ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఏటా వేతనాల రూపంలో రూ.2,753.79 కోట్లు చెల్లిస్తుండగా కొత్తగా భర్తీ చేసే పోస్టులకు ఏటా అదనంగా రూ.726.34 కోట్ల వ్యయం కానుందని అధికారులు అంచనా వేశారు. 

వైద్య శాఖలో అతి పెద్ద భర్తీ
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీకి సంబంధించి ఇది అతి పెద్ద ప్రక్రియ కావడం విశేషం. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు కోవిడ్‌ సమయంలో మెరుగైన వైద్య సేవలందించేందుకు గతంలోనే 9,700 రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడు అంతకు మించి పోస్టుల భర్తీ చేపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఒకరు చొప్పున దాదాపు 15,000 మంది ఏఎన్‌ఎంలు, 7 వేల మందికిపైగా మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్ల సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం గతంలోనే చర్యలు చేపట్టింది.

గతంలో మండల స్థాయిలో పీహెచ్‌సీల్లో ఏఎన్‌ఎంలు సేవలు అందిస్తుండగా వాటిని గ్రామాలకు విస్తరించారు. సచివాలయాల వ్యవస్థ ప్రవేశపెట్టిన తరువాత గ్రామ, వార్డు సచివాలయాలకు ఒకరు చొప్పున ఏఎన్‌ఎంల సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామీణ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లోనూ బీఎస్సీ నర్సింగ్‌ అర్హతతో మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ను ప్రభుత్వం నియమిస్తోంది. హెల్త్‌ అసిస్టెంట్‌తో పాటు ఆశా వర్కర్లు కూడా క్లినిక్‌లో సేవలందిస్తారు.

క్లినిక్‌లో నిరంతరం ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటూ 12 రకాల వైద్య సేవలు అందిస్తారు. 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 65 రకాల మందులను సమకూర్చడంతోపాటు 57 రకాల బేసిక్‌ మెడికిల్‌ ఎక్విప్‌మెంట్‌లను అందుబాటులో ఉంచుతారు. విలేజ్‌ క్లినిక్స్‌ను పీహెచ్‌సీలు, ల్యాబ్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనుసంధానించడంతోపాటు టెలిమెడిసిన్‌ సదుపాయాలను కల్పించారు. మండలానికి రెండు పీహెచ్‌లను అందుబాటులోకి తేవడమే కాకుండా ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు చొప్పున డాక్టర్లు సేవలందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement