తగ్గిన కొత్త కేసులు.. కోలుకున్న ఏలూరు | Eluru Illness: More People Discharged | Sakshi
Sakshi News home page

కోలుకున్న ఏలూరు

Published Wed, Dec 9 2020 3:21 AM | Last Updated on Wed, Dec 9 2020 7:56 AM

Eluru Illness: More People Discharged - Sakshi

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు

ఏలూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి ప్రతినిధి ఏలూరు: అంతుచిక్కని అనారోగ్యం బారిన పడిన బాధితులకు అత్యున్నత వైద్య చికిత్స అందిస్తూనే కారణాలను గుర్తించేందుకు వివిధ రకాల నమూనాల విశ్లేషణ కొనసాగుతోంది. ఒకే నమూనాను పలు ల్యాబొరేటరీల్లో పరీక్షిస్తున్నారు. ఏలూరులో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నీటిలో పెస్టిసైడ్స్‌ (పురుగు మందులు) ఆనవాళ్లు మోతాదుకు మించి ఉన్నాయని గుర్తించినట్లు సమాచారం. దీనికి గల కారణాలపై విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు.

పెద్ద ఎత్తున ఆక్వా సాగు జరుగుతుండటం, ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జలాలు ఏమైనా కలుషితమయ్యాయా? అనే దిశగా అన్వేషిస్తున్నారు. మరోవైపు బాధితుల రక్తంలో నికెల్, లెడ్‌ లాంటివి ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు గుర్తించడంతో పెస్టిసైడ్స్‌కు వీటితో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనే పరిశోధిస్తున్నారు. దీన్ని నిర్థారించుకునేందుకు మంగళవారం ఉదయం నమూనాలను మరోసారి ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపగా బుధవారం ఫలితాలు వెలువడనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. తాడేపల్లిగూడెం, భీమవరంలో కూడా తాగునీటిని సేకరించి పరిశీలిస్తారు. ఇక ఆస్పత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 
ఏలూరులో బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఎన్‌ఐఎన్‌ బృందం.. పంపుల చెరువులో నీటిని శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలిస్తున్న మంత్రి ఆళ్ల నాని 

ఇ–కొలి లేదు..
తాగునీటిలో ప్రమాదకరమైన ఇ–కొలి బాక్టీరియా ఉందేమోనన్న అనుమానాలు తొలగిపోయాయి. మంగళవారం ఉదయం నివేదికల ఫలితాల్లో బాక్టీరియా లేదని స్పష్టమైంది. సెరబ్రిల్‌ స్పైనల్‌ ఫ్లూయిడ్‌ శాంపిల్‌ నమూనాలను విశ్లేషించగా అవికూడా నార్మల్‌గా ఉన్నట్లు తేలింది.

ఇంటింటికీ తిరిగి నమూనాల సేకరణ
డాక్టర్‌ జేజే బాబు ఆధ్వర్యంలో తొమ్మిది మంది వైద్య సిబ్బందితో కూడిన బృందం ఏలూరులో వ్యాధి ప్రారంభం అయిన దక్షిణపు వీధిలోని జేపీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి బాధితులతో మాట్లాడింది. ఆహార పదార్థాలు, నీటి నమూనాలను సేకరించింది.   

నాలుగో రోజు తగ్గుముఖం
ఏలూరును పీడిస్తున్న అంతుచిక్కని వ్యాధి తీవ్రత నాలుగో రోజు తగ్గినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. మంగళవారం రాత్రి సమయానికి 68 మంది బాధితులు చికిత్స పొందుతుండగా ఇప్పటివరకు 497 మంది డిశ్చార్జి అయినట్లు ఏలూరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ తెలిపారు. బాధితుల్లో 24 మంది విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. చిన్నారులకు పాత ప్రభుత్వాస్పత్రిలోని పీడియాట్రిక్‌ ఐసీయూలో చికిత్స అందిస్తుండగా మిగిలిన వారిని కొత్త ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌కు తరలించి ప్రత్యేక చేసిన ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శివశంకరరావు దగ్గరుండి వీరిని పర్యవేక్షిస్తున్నారు. 


ఐఐసీటీకి వివరాలు..
ఏలూరులో దుకాణదారులు విక్రయిస్తున్న పురుగు మందుల వివరాలను అధికారులు ఆరా తీశారు. నిషేధించిన మందులు ఏవైనా విక్రయిస్తున్నారా? అనే కోణంలోనూ వివరాలు సేకరించి ఐఐసీటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)కి పంపారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 

నిరంతరం పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం 
ఏలూరులో నెలకొన్న పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం పర్యవేక్షిస్తూ ఆరా తీస్తున్నారు. సీఎంవో కార్యాలయం, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్నితోపాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బాధితులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో సమీక్ష జరిపిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని ఆదేశించారు. బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ మూడు రోజులుగా ఏలూరులోనే ఉంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. వైద్య శిబిరాలు, కేంద్ర వైద్య బృందాలను రప్పించడం, వ్యాధి నిర్థారణ పరీక్షలు, నమూనాల సేకరణను పర్యవేక్షిస్తున్నారు.

మోతాదు మించి ఉన్నాయి
‘నీటిలో పెస్టిసైడ్స్‌ మోతాదు ఎక్కువగా ఉంది. వీటిని ఆర్గనో క్లోరిన్స్‌ అంటారు. ఓపీ డీడీటీ, ఓపీ డీడీఈ లాంటి పలు రకాల నిషేధిత ఆర్గనో క్లోరిన్స్‌ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఇంత మోతాదులో ఉన్న నీటిని తాగితే నాడీ వ్యవస్థకు హాని కలిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇవి ఎలా వచ్చాయన్న దానిపై పరిశీలన జరుగుతోంది’
–డాక్టర్‌ బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement