సర్కారు ఆస్పత్రుల్లో నిరంతర వైద్యం  | Continuous healing in Andhra Pradesh government hospitals | Sakshi
Sakshi News home page

సర్కారు ఆస్పత్రుల్లో నిరంతర వైద్యం 

Published Tue, May 10 2022 4:39 AM | Last Updated on Tue, May 10 2022 4:39 AM

Continuous healing in Andhra Pradesh government hospitals - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అడ్డన్నదే ఉండదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడంలో వెనకడుగే వేయడంలేదు. ఇందుకు ఉదాహరణే ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (పీహెచ్‌సీ)లు. గ్రామీణ, పేద ప్రజలకు అందుబాటులో ఉండే పీహెచ్‌సీలు నాణ్యమైన సేవలందించడం చరిత్రలో ఇదే తొలిసారి. అదీ ఇరవై నాలుగ్గంటలూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి పేదలకు సేవలందిస్తున్నారు. ఇది గతానికి భిన్నం. గతంలో పీహెచ్‌సీ అంటే గ్రామీణ, పేద ప్రజలకు చేరువలో ఉన్నవైనప్పటికీ, సేవల్లో మాత్రం నాసిరకం. వైద్యులు, సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండే వారు కాదు.

ఆసుపత్రి పరిసరాలు కాసేపు నిలబడటానికి కూడా దుర్లభంగా ఉండే పరిస్థితి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిలో పెద్ద మార్పే తెచ్చింది. మంచి వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఆసుపత్రిలో మంచి వాతావరణం కల్పించింది. ఇరవై నాలుగ్గంటలూ ప్రజలకు వైద్య సేవలందిస్తోంది. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలలో మారిన ఈ దృశ్యాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ‘రూరల్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్‌(ఆర్‌హెచ్‌ఎస్‌) 2020–21’ కళ్లకు కట్టింది. మరో రెండు చిన్న రాష్ట్రాలు మినహా దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఈ విధమైన సేవలు అందడంలేదని వెల్లడించింది. ఆ నివేదిక సారాంశమిదీ..


ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 1,142 పీహెచ్‌సీలు వంద శాతం 24/7 పని చేస్తున్నాయి. 99.3 శాతం పీహెచ్‌సీల్లో లేబర్‌ రూమ్‌ సౌకర్యం ఉంది. 98.9 శాతం పీహెచ్‌సీల్లో ఆపరేషన్‌ థియేటర్‌ ఉంది. కనీసం 4 పడకలున్నవి 98.1%. వీటిలో వసతులకూ కొరత లేదు. 2021 మార్చి నాటికి సిక్కిం, అండమాన్‌ నికోబార్‌ వంటి చిన్న రాష్ట్రాల్లో మాత్రమే వంద శాతం పీహెచ్‌సీలు 24/7 పనిచేస్తున్నాయి.

దక్షిణాదిలోని తెలంగాణలో 49.4%, కర్ణాటకలో 41.1, తమిళనాడులో 92.5%, కేరళలో 81.7% పీహెచ్‌సీలు మాత్రమే 24/7 సేవలు అందిస్తున్నాయి. పీహెచ్‌సీల్లో వంద శాతం కంప్యూటర్‌ సౌకర్యం కల్పించిన జాబితాలో ఏపీ, గోవా, సిక్కిం, రాజస్తాన్, తెలంగాణ ఉన్నాయి.  అదే విధంగా రాష్ట్రంలోని 141 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో (సీహెచ్‌సీలలో) కనీసం 30 పడకలు, లేబొరేటరీ, వినియోగంలో ఉన్న ఆపరేషన్‌ థియేటర్లు, లేబర్‌ రూమ్, న్యూ బార్న్‌ కేర్‌ యూనిట్, రెఫరల్‌ ట్రాన్స్‌పోర్ట్, సాధారణ అనారోగ్యాలకు అల్లోపతిక్‌ మందులు ఉన్నాయి. అన్ని సీహెచ్‌సీ, పీహెచ్‌సీలలో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్ల సౌకర్యం ఉంది.

పెరిగిన వైద్యులు, వైద్య సిబ్బంది 
2019–20తో పోలిస్తే పీహెచ్‌సీలలో వైద్యుల సంఖ్యా పెరిగింది. 1,142 పీహెచ్‌సీల్లో 2019–20లో 1,798 మంది వైద్యులు ఉండగా.. 2020–21లో వైద్యుల సంఖ్య 2,001కి పెరిగింది. అదే విధంగా 141 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లలో 2020లో స్పెషలిస్ట్‌ వైద్యులు 315 మంది ఉండగా 2021లో 322కు చేరారు.

గిరిజన ప్రాంతాల్లోనూ వైద్య సేవలు
గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రాథమిక వైద్య సేవలు నిరంతరం అందుతున్నాయి. రాష్ట్రంలో గిరిజన జనాభా 22.58 లక్షలుగా ఉంది. వీరి కోసం గిరిజన ప్రాంతాల్లో 752 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ అవసరం కాగా 822 ఉన్నాయి. 112 పీహెచ్‌సీలు ఉండాలి. కానీ అంతకంటే ఎక్కువగా 159 ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 1,593 మంది ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీల్లో 278 మంది పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

దేశ సగటుకన్నా తక్కువ
మాత, శిశు మరణాల కట్టడికి సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌)లో దేశ సగటుకన్నా రాష్ట్ర సగటు తక్కువగా ఉంది. జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యి జననాలకు సగటున 30 శిశు మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 25 మరణాలు ఉంటున్నాయి. జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 34 మరణాలు ఉండగా రాష్ట్రంలో 28గా ఉంది. జాతీయ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో 20గా ఉండగా రాష్ట్రంలో 19గా ఆ నివేదిక పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement