ప్రజల్లో మార్పు తీసుకురాకపోతే.. మీకెందుకు జీతాలు? | collector dhanunjay fired on doctors | Sakshi
Sakshi News home page

ప్రజల్లో మార్పు తీసుకురాకపోతే.. మీకెందుకు జీతాలు?

Published Fri, Feb 2 2018 10:06 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

collector dhanunjay fired on doctors  - Sakshi

వైద్యులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌ ధనంజయరెడ్డి

శ్రీకాకుళం, అరసవల్లి: ‘‘సార్‌ జిల్లాలో సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు ఎక్కువ. గర్భం దశను కూడా కొంతమంది బయటకు చెప్పరు.
డెలివరీలకు ప్రభుత్వ ఆస్పత్రులకు రారు.. వస్తున్నవారు ముహూర్తాలంటూ సిజేరియన్‌ చేయమంటుంటారు.  
చాలా మండలాలు ఒడిశా బోర్టర్‌లో ఉన్నాయి సార్‌.. ఇక్కడ ఇలాంటి సంప్రదాయ పరిస్థితులతో ఇబ్బందులు తప్పడం లేదు..
చాలా పీహెచ్‌సీల్లో స్టాప్‌ లేరు...ఓపీ ఎక్కువగా ఉంటోంది. 

అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్పత్రుల కు వెళ్లిపోతున్నారు’’ గురువారం జిల్లా పరిషత్‌ సమావే శ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ సమీక్షను నిర్వహిం చిన జిల్లా కలెక్టర్‌ ధనంజయరెడ్డికి హాజరైన వైద్యులు, అధికారులు దాదాపుగా చెప్పిన సమాధానాలివి..! ఏ విభాగంలో ప్రగతి అంశాన్ని అడిగినా, వైద్యుల నుంచి ఇవే సమాధానాలు వస్తుండడంతో కలెక్టర్‌కు కోపమోచ్చింది. ‘‘ ఎందుకిలా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు?. 20 ఏళ్ల నాటి పాత కారణాలు పదేపదే చెబుతుంటే వినడానికి నేను సిద్ధంగా లేను.. వెనుకబడిన జిల్లా కాబట్టే ఇన్ని గంటలపాటు సమీక్షలు చేయాల్సి వస్తోంది..అయినా మీరు పనిచేస్తున్న ప్రాంతాల ప్రజల్లో మార్పులు తేలేకపోతే మీకెందుకు జీతాలు..? ప్రజలు మారడం లేదా...లేదా మీరు హ్యాపీగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్‌ చేస్తున్నారా..! ఎందరు గ్రామాల్లో ఉన్నారో..ఇంకెందరు పట్టణాల్లో ఉన్నారో ..నాకు తెలియదనుకున్నారా...! అంటూ కలెక్టర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో సమావేశం సీరియస్‌గా మారిపోయింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలపై నమ్మకం పెరగాలి
గ్రామీణ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై నమ్మకం కలిగించేలా విధులు నిర్వహించా లని కలెక్టర్‌ వైద్యులకు సూచించారు. 24 గంటల ఆస్పత్రుల్లో తప్పనిసరిగా సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఖాళీగా ఉన్న వైద్యయేతర పోస్టులను ఈ నెల 20వ తేదీలోగా అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేయాలని డీఎంహెచ్‌వో తిరుపతిరావును ఆదేశించా రు. ఇటీవల తాను ఓ ప్రభుత్వ పాఠశాలలో 238 మంది విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేశానని.. అయితే అక్కడ అమ్మాయిలకు చూపు సామర్ధ్యం –6, –4 కూడా ఉండడం బాధించిందన్నారు. ఇక మీదట జిల్లాలో విద్యార్థులందరికీ నేత్ర పరీక్షలు చేయాలని, అవసరమైతే చికిత్సలు కచ్చితంగా జరగాలన్నారు. ఈ ప్రక్రియను వైద్యులు ఉద్యమంలా చేయాలని.. ఇందుకోసం రూ.50 లక్షలైనా నిధులు ఇస్తానని ప్రకటించారు. దీనికోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

‘తల్లీబిడ్డ’ ఎక్స్‌ప్రెస్‌పై అనుమానాలు
 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల వినియోగంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కలెక్టర్‌ అన్నా రు. జిల్లాలో 2016–17లో 20 వేలకు పైగా డెలివరీలు అయితే 11,205 మంది మాత్రమే ఈ వాహన సేవలను వినియోగిచుకున్నారన్నారు. అలాగే 2017–18లో డెలివరీలు 16,082 కాగా, వాహనాలను విని యోగించుకున్నవారు కేవలం 9,785 మంది మాత్రమే నమోదయ్యావన్నారు.

ఓడీఎఫ్‌ ఉద్యమంలో కీలకంగా వ్యవహారించాలి
జిల్లాను ఈ ఏడాది మార్చి 31 నాటికి ఓడీఎఫ్‌ జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో ఉద్యమంగా పనిచేస్తున్నామని, ఇందులో ప్రతి వైద్యుడు భాగస్వామ్యం కావాలని కలెక్టర్‌ కోరారు. మీ వద్దకు వచ్చే రోగులతో అదనంగా రెండు నిమిషాలు మాట్లాడి వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఉపాధ్యాయుడు, వైద్యుడికి చాలా గౌరవం ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాల్లో వీరి భాగస్వామ్యం కీలకమన్నారు. ఉద్దానంలోని 8 మండలాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని కోరారు. కిడ్నీ వ్యాధుల నిర్ధారణకు కొందరు సోషల్‌ సిగ్మాతో వెనకంజ వేస్తున్నారని, దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు వైద్యం కోసం వేలాది రూపాయాలు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ఈ ప్రాంతంలో వైద్య పరీక్షలు అందరికీ జరిగేలా వైద్య ఆరోగ్య శాఖ మాత్రమే చేయగలదని తాను విశ్వసిస్తున్నానన్నారు. ఏజెన్సీలో రక్తహీనత (హెచ్‌బీ) 11కి మించి పెరిగేలా చర్యలు చేపట్టాలని, అందుకు తగ్గ సూచనలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. 

పీహెచ్‌సీల్లో పనితీరుపై అసంతృప్తి
పీహెచ్‌సీలో ఆంటీనాటల్‌ చెకింగ్‌ (ఏఎన్‌సీ), ఎర్లీ ఆంటీనాటల్‌ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని తాడివలస, గోవిందపురం, బూరాడ, బొరివంక, తొగరాం, సారవకోట, కొర్లాం, కంచిలి, వెంకటాపురం, బూరగాం, కె.సైరిగాం, దండుగోపాలపురం, కింతలి తదితర సీహెచ్‌సీల్లో పనితీరు, ప్రగతి రిపోర్టులు బాగాలేవని, దీనిపై వైద్యుల నుంచి వచ్చిన సమాధానాలపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలు డాక్టర్లుగా ఉన్నచోట కూడా డెలివరీలు జరగకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాత్రమే మేం మాట్లాడతాం..బయట వారిని ఏఎన్‌ఎంలు చూసుకుంటారులే అని వైద్యులు భావిస్తే సహించనని హెచ్చరించారు. మీరంతా అసలు ఆస్పత్రుల్లో ఉంటున్నారా? ప్రైవేటు ప్రాక్టీస్‌ చేసుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పీహెచ్‌సీల్లో వెంటనే విచారణ చేపట్టి, వైద్యులు చెబుతున్న కారణాలు నిజమో కాదో నివేదిక అందజేయాలని డీఎంహెచ్‌వో తిరుపతిరావు కలెక్టర్‌ ఆదేశించారు. నిజంగా మీకు గుర్తింపు రావాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేయాలని, ఇక ఇలాంటి కారణాలు, నిర్లక్ష్యం మళ్లీ కనిపిస్తే చర్యలు తప్పవన్నా రు. సమావేశం అనంతరం ఐసీడీఎస్‌ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించా రు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ఈ రెండు శాఖలు సమన్వయంగా పనిచేయాల్సి ఉందని సూచించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి బొడ్డేపల్లి సూర్యారావు, డీఐవో బగాది జగన్నాథరా వు, అడిషినల్‌ డీఎంహెచ్‌వో మెండ ప్రవీణ్, వై.వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్‌ పీడీ లీలావతి, పీవో పక్కి చంద్రకళ, నోడల్‌ అధికారిణి సీహెచ్‌. ఝాన్సీ, మాస్‌ మీడియా ప్రచార అధికారి పాలవలస విశ్వనాథం పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement