విజయవాడ : ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలులో వెనకబడిన అధికారులపై కలెక్టర్ కొరడా ఝళిపించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ పెన్షన్లు, పౌరసరఫరాలు తదితర అంశాలపై ఎంపీడీవోలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ పెన్షన్ల పంపిణీపై సమీక్షిస్తూ ఏకకాలంలో పింఛన్లు పంపిణీ చేయమని చెప్పినా రెండు మూడు ప్రదేశాలకు ఒక్కరే వ్యక్తి ద్వారా పంపిణీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పింఛన్ పంపిణీలో వెనుకబడిన తిరువూరు, నందివాడ, గుడివాడ అర్బన్, మచిలీపట్నం అర్బన్ ఎంపీడీవోలకు ఇంక్రిమెంట్ కట్ చేసి, క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని కలెక్టర్ జెడ్పీ సీఈవోను ఆదేశించారు. పెదపారుపూడి, కైకలూరు, ఘంటసాల తదితర ఆరు మండలాల్లో మధ్యాహ్నం 2 గంటలకే 20 శాతం పంపిణీ చేసినందుకు అభినందించారు. నిత్యావసర సరుకులు 10వ తేదీలోగా పూర్తిగా అందించాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు.
వైద్యశాఖలో బయో మెట్రిక్ విధానం అమలు చేయాలని, ఆరోగ్య ఉప కేంద్రాలను తనిఖీ చేసి నివేదికలు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. కొందరు వైద్యులు ఎందుకు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయడం లేదని డీఎంహెచ్‌వోను ప్రశ్నించారు. హాస్పటల్స్‌కు గత పని తీరు ఆధారంగా జిల్లాకు రూ.4 కోట్లు నిధులు విడుదల చేశామని, మీలో ఎంతమందికి వాటి గురించి తెలుసునని డాక్టర్లను ప్రశ్నించారు. జిల్లాలో తొలగించిన 203 మంది ఆశా వర్కర్ల వివరాలను కలెక్టర్ అడిగారు. తాగునీటి సరఫరా, వ్యసా యం, ఈ-ఆఫీస్ అంశాలను సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, విజయవాడ సబ్-కలెక్టర్ జి.సృజన పాల్గొన్నారు.