నాడి పట్టే నాథుడేడి? | No Doctors In PHCs In Telangana | Sakshi
Sakshi News home page

పల్లెల్లో అలంకారప్రాయంగా పీహెచ్‌సీలు.. డాక్టర్లు రారు.. వచ్చినా చూడరు

Published Thu, Jul 26 2018 1:16 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

No Doctors In PHCs In Telangana - Sakshi

ఈదగోని రాజలింగం.. వరంగల్‌ జిల్లా మరిపెడ.. కూలి పనులతో పొట్టబోసుకుంటాడు.. ఇటీవల వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మధ్యాహ్నం పూట స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు.. అక్కడ డాక్టర్‌ లేడు.. ఇతర వైద్య సిబ్బంది కూడా లేరు.. చేసేది లేక ప్రైవేట్‌ క్లినిక్‌కు వెళ్తే రూ.2,500 ఖర్చయింది!
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడుకు చెందిన కుంభం నాగార్జున (12)కు గత సోమవారం తీవ్రంగా జ్వరమొచ్చింది. చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తే డాక్టర్‌ లేరు. ఉదయం 10 గం. దాటినా ఎవరూ రాలేదు. దీంతో 15 కి.మీ. దూరంలోని మల్లేపల్లికి వెళ్లి ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు!!

సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్‌  : ..ఇది ఈ ఇద్దరి వ్యథ మాత్రమే కాదు. రాష్ట్రంలోని అనేక పల్లెల్లో పీహెచ్‌సీ దుస్థితిS ఇలాగే ఉంది. మామూలు రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట దాటితే వైద్యులు పత్తా లేకుండా పోతున్నారు. సెలవు తర్వాత డాక్టర్లు, నర్సులు మధ్యాహ్నం దాటినా అందుబాటులో ఉండటం లేదు. సోమవారం మధ్యాహ్నం 12 దాకా అసలు ఆస్పత్రుల ముఖమే చూడటం లేదు. రాష్ట్రంలోని పది పాత జిల్లాల్లో 675 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) ఉండగా.. వాటిలో పనిచేస్తున్న డాక్టర్లలో అత్యధికులు  స్థానికంగా ఉండటం లేదు. సమీప పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటూ మొక్కుబడిగా పీహెచ్‌సీకి వెళ్తున్నవారు 90 శాతం దాకా ఉంటారని వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

నల్లగొండ, యాదాద్రి, జనగామ, నాగర్‌కర్నూలు, వికారాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే డాక్టర్లలో 80 శాతం (ఓ డీఎంఅండ్‌హెచ్‌వో అంచనా ప్రకారం) మంది హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మిగిలిన 20 శాతం మంది పాత జిల్లాలు నల్లగొండ, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి వెళ్తున్నారు. దీంతో  చాలాచోట్ల డాక్టర్లు అనధికారికంగా ఐదు రోజుల పని దినాలు పాటిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. కొన్నిచోట్ల అయితే వారంలో నాలుగు రోజులు కూడా డాక్టర్లు విధులకు వెళ్లడం లేదని, నర్సులే పీహెచ్‌సీలకు పెద్ద దిక్కు అని వైద్యారోగ్య శాఖ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. శనివారం చాలా చోట్ల డాక్టర్లు విధుల్లో ఉండటం లేదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నల్లగొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు గతంలో ఆయా జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. అయితే నాలుగు రోజులు హడావుడి చేయడమే తప్ప దీనికి పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతున్నామని ఓ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. 

పలుకుబడి ముందు బలాదూర్‌ 
హైదరాబాద్‌కు సమీపంలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పోస్టింగ్‌లు వేయించుకున్న నలుగురు వైద్యులు వారం అంతకంటే ఎక్కువ రోజులు గైర్హాజరు కావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వారిపై చర్యలకు సిద్ధమయ్యే లోపే తమకు సంబంధించిన వారని, చూసీ చూడనట్లు వెళ్లమని సంబంధిత అధికారులకు ఉన్నతస్థాయి నుంచి ఆదేశాయి అందాయి. ఈ నలుగురు వైద్యుల్లో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల తనయులు కావడం గమనార్హం. మరొకరు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి కూతురు. వీరు పని చేస్తున్న చోట నర్సులే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తుంటారు. మామూలుగా జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఈ కేంద్రాలకు వచ్చేవారే అధికం.

డాక్టర్లు లేకపోయినా నర్సులు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. మరీ సీరియస్‌ కేసు అయితే స్థానికంగా ఉండే లేదా సమీప పట్టణాలకు తీసుకువెళ్లమని సూచిస్తారు. మామూలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం నాలుగు గంటల దాకా పని చేయాలి. కానీ ఏ రోజూ సగటున మూడు గంటలకు మించి ఇవి పని చేయడం లేదని సెస్‌ గతంలో ఓ నివేదికలో స్పష్టంచేసింది. ‘‘ఆస్పత్రికి వెళ్తే డాక్టర్, ఇతర సిబ్బంది ఎవరూ ఉండటం లేదంటూ వచ్చే ఫిర్యాదులు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగాయి. ఇవి సగటున రోజు ప్రతి జిల్లాలో వంద దాకా వస్తుంటాయి. కలెక్టరేట్‌ల నుంచి వచ్చే ఆ ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవడానికి మా వద్ద సరైన యంత్రాంగం కూడా లేదు’’ అని వైద్య శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 

డాక్టర్లు, సిబ్బంది కొరత 
గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేందుకు అటు డాక్టర్లు, ఇటు పారామెడికల్‌ సిబ్బంది ఆసక్తి చూపకపోవడం కూడా పీహెచ్‌సీల పరిస్థితి దారుణంగా మారడానికి ఓ కారణం. ఏదో మొక్కుబడిగా వారు పనిచేస్తారని, ఒత్తిడి తెచ్చి వారిని ఇబ్బంది పెద్దవద్దంటూ ఇటీవల ఓ ఉన్నతాధికారి ఒక జిల్లా వైద్యాధికారిని మందలించారు. ఇదిలా ఉంటే పీహెచ్‌సీల్లో ఉండాల్సిన మేరకు సిబ్బంది లేకపోవడం వల్ల తెలంగాణలోని 675 పీహెచ్‌సీలు, 264 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఉండాల్సిన మేరకు సిబ్బంది లేరు. ఒక్కో పీహెచ్‌సీలో ఒక మెడికల్‌ ఆఫీసర్‌ (ఎంబీబీఎస్‌)తో పాటు ఒక ఫార్మాసిస్ట్, ఒక స్టాఫ్‌ నర్స్, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక బ్లాక్‌ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేటర్‌తో పాటు ఒకరు చొప్పున మగ, ఆడ హెల్త్‌ అసిస్టెంట్‌లు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉండాలి. మొత్తం 675 పీహెచ్‌సీలలో 40 శాతం అంటే 270 చోట్ల నిర్దేశిత మొత్తంలో సిబ్బంది ఉన్నారు. 200 కేంద్రాల్లో డాక్టర్‌ ఉన్నా తగిన సంఖ్యలో ఇతర సిబ్బంది లేరు. మరో 205 కేంద్రాల్లో 25 నుంచి 30 శాతం మాత్రమే సిబ్బంది ఉన్నారు. డాక్టర్లు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్ని అన్న స్పష్టమైన వివరాలు లేవని అధికారులు చెపుతున్నారు. పీహెచ్‌సీకి వచ్చిన వారు ఏ రకమైన జ్వరంతో బాధపడుతున్నారో తెలుసుకోవడానికి అవకాశం లేని పీహెచ్‌సీలు 50 శాతం కంటే ఎక్కువ ఉన్నాయి. ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత వల్ల మామూలు రక్త పరీక్షలకు కూడా పేద ప్రజలు నోచుకోవడం లేదు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement