
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ, రాజానగరం, కాకినాడలలో మంత్రులు రజిని, చెల్లుబోయిన వేణు, తానేటి వనిత సోమవారం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల భవనాలు, ప్రభుత్వాస్పత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను మంత్రి రజిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్‌లు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాలల్లో మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. వీటిలో 750 సీట్లకు గాను 300 సీట్లకు అనుమతులు మంజూరు కాగా, మిగతా 450 సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు రావాల్సి ఉందన్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళలను చిన్నచూపు చూడటం మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి రజిని సూచించారు.
గోదావరి గట్టుపై జ్యోతిరావుపూలే, అంబేడ్కర్ భవన నిర్మాణానికి మంత్రులు రజిని, చెల్లుబోయిన వేణు, తానేటి వనితలు శంకుస్థాపన చేశారు. రాజానగరం నియోజకవర్గం కోటికేశవరంలో రూ.1.54 కోట్లతో నాడు–నేడులో నిర్మించిన పీహెచ్‌సీ భవనాన్ని మంత్రి రజిని ప్రారంభించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీరంగపట్నం కళాకారులు నలుగురి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన 8 మందికి రూ.లక్ష వంతున సీఎం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని రజిని, వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అందించారు. కాకినాడ జీజీహెచ్‌లో రంగరాయ పూర్వ విద్యార్థులు సమకూర్చిన రూ.50 కోట్లతో మదర్ అండ్ చైల్డ్‌బ్లాక్, గాంధీనగర్‌లో రూ.1.20 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్, ఆర్‌ఎంసీలో మెన్స్ హాస్టల్‌ను మంత్రి రజిని ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి)
Comments
Please login to add a commentAdd a comment