సాక్షి, హైదరాబాద్: బాల్యం చిక్కి శల్యమైపోతోంది. చిన్నారి చేతికండలు ఐస్‌క్రీం పుల్లల్లా చిక్కిపోయాయి. కొందరు పిల్లలు ఎత్తు ఎదగట్లేదు. మరికొందరికి వయసుకు తగ్గ బరువు లేదు. చిరుప్రాయంలోనే మధుమేహం, గుండె జబ్బుల ముప్పును ఎదుర్కొంటున్నారు. కిడ్నీ రోగాల బారినపడుతున్నారు. పౌష్టికాహార లోపంతో రాష్ట్రంలోని బాలల్లో తీవ్ర శారీరక ఎదుగుదల లోపం బయటపడింది. ఐదేళ్ల లోపు బాలల్లో ఏకంగా 29.3 శాతం మంది ఎదుగుదల (ఎత్తుపరంగా) లోపాన్ని కలిగి ఉన్నారు. 8.7 శాతం మంది తీవ్ర ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంత బాలల్లో ఏకంగా 38.2 శాతం మంది ఎదుగుదల లోపం కలిగి ఉన్నారు. 30.8 శాతం మంది వయసుకు తగ్గ బరువు లేరు. మరో 17.9 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేరు. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన సమగ్ర జాతీయ పౌష్టికాహార సర్వే 2016–18 నివేదికలో ఈ విషయాలు వెలుగుచూశాయి.
బక్క చిక్కిన మగపిల్లలు: పాఠశాలకు వెళ్లే 5 నుంచి 9 ఏళ్ల పిల్లల్లో 31.4 శాతం మంది మగపిల్లలు, 24.2 శాతం మంది ఆడపిల్లలు, 10–14 ఏళ్ల పిల్లల్లో 33.2 శాతం మగ, 23.4% ఆడపిల్లలు, 15–19 ఏళ్ల పిల్లల్లో 35.4 శాతం మగ, 21.8 శాతం ఆడపిల్లలు బక్క చిక్కిపోయారు. 5–9 ఏళ్ల పిల్లల్లో 5.5 శాతం మగ, 4.2 శాతం ఆడపిల్లలు ఊబకాయాన్ని కలిగి ఉన్నారు. ప్రధానంగా పట్టణ బాలల్లోనే ఊబకాయం సమస్య అధికంగా ఉంది. 11 శాతం పట్టణ, 1.5 శాతం గ్రామీణ బాలలు ఊబకాయాన్ని కలిగి ఉన్నారు. ఇదే వయసు శ్రేణిలోని 15.6 శాతం మగ, 15.3 శాతం ఆడపిల్లల్లో ఎదుగుదల లోపాన్ని గుర్తించారు.
చిక్కిన చేతి కండలు
వయసుతో పోలిస్తే 6–59 నెలల బాలల్లో 13.2 శాతం మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశిత ప్రమాణం కన్నా తక్కువ చేతికండ చుట్టు కొలత కలిగి ఉన్నారు. 5.2 శాతం మంది 12.5 సె.మీటర్ల లోపు, 0.9 శాతం మంది 11.5 సె.మీ. కన్నా తక్కువ చేతికండ చుట్టు కొలత కలిగి ఉన్నారు.
మూడో వంతు చిన్నారుల్లో రక్తహీనత
రాష్ట్రంలోని కిశోర బాలికలు తీవ్ర రక్త హీతనతో బాధపడుతున్నారు. 10–19 ఏళ్ల బాలికల్లో ఏకంగా 46 శాతం మంది, బాలురల్లో 18.5 శాతం మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 1–4 ఏళ్ల పిల్లల్లో 33.4 శాతం మంది ఇనుము లోపం కలిగి ఉన్నారు. 10–19 ఏళ్ల పిల్లల్లో ఏకంగా 63.7 శాతం మంది బి–విటమిన్ లోపంతో బాధపడుతున్నారు.
మధుమేహం ముప్పు..
రాష్ట్రంలోని 15.4 శాతం మంది 5 నుంచి 9 ఏళ్ల బాలలు, 15.2 శాతం మంది 10–19 ఏళ్ల బాలలు మధుమేహం ముప్పును ఎదుర్కొంటున్నారు. రక్తంలో 5.7 –6.4 శాతం చక్కెర (గైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ కాన్సన్‌ట్రేషన్) కలిగి ప్రీడయాబెటిక్ స్టేజీలో ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక 5–9 ఏళ్ల పిల్లల్లో 1 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 5–9 ఏళ్ల పిల్లల్లో 21.9 శాతం మంది, 10–19 ఏళ్ల పిల్లల్లో 12.4 శాతం మంది తమ రక్తంలో అధిక కొవ్వు కలిగి ఉన్నారు. వీరు గుండె సంబంధిత వ్యాధుల ముప్పు ఎదుర్కొంటున్నారు. 5–9 ఏళ్ల పిల్లల్లో 23.6 శాతం మంది, 10–19 ఏళ్ల పిల్లల్లో 24.3 శాతం మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుండటంతో అధిక ‘క్రియాటిన్’కలిగి ఉన్నారు.
తొలిసారి సమగ్ర సర్వే!
పాఠశాలకు వెళ్లడానికి ముందు వయసు (0–4 ఏళ్లు), పాఠశాల వెళ్లే వయసు (4–9 ఏళ్లు), కిశోర వయసు (10–14 ఏళ్లు) బాలబాలికలను ఇంటర్వ్యూలు చేయడం, శరీర కొలతలు తీయడం, మలమూత్ర, రక్త పరీక్షలు నిర్వహించడం ద్వారా బాలల్లో పౌష్టికాహార స్థితిగతులపై అధ్యయనం జరిపింది. బాలల్లో సూక్ష్మ పౌష్టికాహార లోపం తీవ్రత, స్థాయిలను అంచనా వేయడం, అసంక్రమిత వ్యాధుల బారినపడేందుకు ఉన్న అవకాశాలను గుర్తించేందుకు ప్రామాణిక పద్ధతుల్లో పకడ్బందీగా ఇలాంటి సర్వే నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి. క్షేత్ర స్థాయిలో పౌష్టికాహార లోపం స్థితిగతులను తెలుసుకుని, తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను అభివృద్ధిపరచాలనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహించారు. రాష్ట్రంలో 30 బృందాలు 2016 ఫిబ్రవరి 26 నుంచి జూలై 24 మధ్య కాలంలో 3,600 మంది బాలల శరీర కొలతలు తీసుకోవడంతో పాటు 1,800 బాలల రక్త, మల, మూత్ర పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనం జరిపాయి.
55 శాతం శాఖాహారులే..
జాతీయ స్థాయిలో 0–4 ఏళ్ల వయసున్న 38,060 మంది, 5–9 ఏళ్ల 38,355 మంది, 10–19 ఏళ్ల 35830 మంది బాలబాలికలపై సర్వే నిర్వహించారు. వీరిలో 55 శాతం బాలలు శాఖాహారమే (కోడిగుడ్డు కూడా లేకుండా) తీసుకుంటున్నారు. 36–40 శాతం మంది మాంసాహారం తీసుకుంటుండగా, మిగిలిన వారు శాఖాహారంతో పాటు కోడిగుడ్డు తీసుకుంటున్నారు. 5 నుంచి 9 ఏళ్ల బాలల్లో 91 శాతం మంది, 10–14 ఏళ్ల బాలల్లో 52 శాతం, 15–19 ఏళ్ల బాలల్లో 48 శాతం మంది పాఠశాలకు వెళ్తున్నారు.
42 శాతం మందికి సరిగ్గా దొరకని ఆహారం
6–23 నెలల బాలల్లో 42 శాతం మందికి వారి వయసుకు తగ్గట్టు రోజూ లభించాల్సిన ఆహారం కన్నా తక్కువగా లభిస్తోంది. 21 శాతం మందికి సరిపడా వైవిధ్యమైన ఆహారం దొరుకుతుండగా, 6 శాతం మంది కనీస ఆమోదయోగ్యమైన ఆహారం పొందగలుగుతున్నారు. తెలంగాణలోని 6–23 నెలల బాలల్లో 3.6 శాతం మందికి కనీస ఆమోద్యయోగ్యమైన ఆహారం లభిస్తోంది.
58 శాతం మందికి తల్లిపాలే దిక్కు
6 నెలల లోపు బాలల్లో 58 శాతం మంది కేవలం తల్లిపాలపై ఆధారపడి ఉన్నారు. 12–15 నెలల బాలల్లో 83 శాతం మందికి తల్లిపాలు కొనసాగిస్తున్నారు. 6–8 నెలల బాలల్లో 53 శాతం మందికే పుష్టికరమైన ఆహారం లభిస్తోంది. 0–24 నెలల బాలల్లో 57 శాతం మందికి పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగించడం జరిగింది.
బాల్యం.. బలహీనం..!
Published Tue, Dec 17 2019 1:39 AM | Last Updated on Tue, Dec 17 2019 8:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment