National Nutrition
-
బక్క చిక్కిన బాల్యం..!
సాక్షి, హైదరాబాద్: బాల్యం చిక్కి శల్యమైపోతోంది. చిన్నారి చేతికండలు ఐస్‌క్రీం పుల్లల్లా చిక్కిపోయాయి. కొందరు పిల్లలు ఎత్తు ఎదగట్లేదు. మరికొందరికి వయసుకు తగ్గ బరువు లేదు. చిరుప్రాయంలోనే మధుమేహం, గుండె జబ్బుల ముప్పును ఎదుర్కొంటున్నారు. కిడ్నీ రోగాల బారినపడుతున్నారు. పౌష్టికాహార లోపంతో రాష్ట్రంలోని బాలల్లో తీవ్ర శారీరక ఎదుగుదల లోపం బయటపడింది. ఐదేళ్ల లోపు బాలల్లో ఏకంగా 29.3 శాతం మంది ఎదుగుదల (ఎత్తుపరంగా) లోపాన్ని కలిగి ఉన్నారు. 8.7 శాతం మంది తీవ్ర ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంత బాలల్లో ఏకంగా 38.2 శాతం మంది ఎదుగుదల లోపం కలిగి ఉన్నారు. 30.8 శాతం మంది వయసుకు తగ్గ బరువు లేరు. మరో 17.9 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేరు. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన సమగ్ర జాతీయ పౌష్టికాహార సర్వే 2016–18 నివేదికలో ఈ విషయాలు వెలుగుచూశాయి. బక్క చిక్కిన మగపిల్లలు: పాఠశాలకు వెళ్లే 5 నుంచి 9 ఏళ్ల పిల్లల్లో 31.4 శాతం మంది మగపిల్లలు, 24.2 శాతం మంది ఆడపిల్లలు, 10–14 ఏళ్ల పిల్లల్లో 33.2 శాతం మగ, 23.4% ఆడపిల్లలు, 15–19 ఏళ్ల పిల్లల్లో 35.4 శాతం మగ, 21.8 శాతం ఆడపిల్లలు బక్క చిక్కిపోయారు. 5–9 ఏళ్ల పిల్లల్లో 5.5 శాతం మగ, 4.2 శాతం ఆడపిల్లలు ఊబకాయాన్ని కలిగి ఉన్నారు. ప్రధానంగా పట్టణ బాలల్లోనే ఊబకాయం సమస్య అధికంగా ఉంది. 11 శాతం పట్టణ, 1.5 శాతం గ్రామీణ బాలలు ఊబకాయాన్ని కలిగి ఉన్నారు. ఇదే వయసు శ్రేణిలోని 15.6 శాతం మగ, 15.3 శాతం ఆడపిల్లల్లో ఎదుగుదల లోపాన్ని గుర్తించారు. చిక్కిన చేతి కండలు వయసుతో పోలిస్తే 6–59 నెలల బాలల్లో 13.2 శాతం మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశిత ప్రమాణం కన్నా తక్కువ చేతికండ చుట్టు కొలత కలిగి ఉన్నారు. 5.2 శాతం మంది 12.5 సె.మీటర్ల లోపు, 0.9 శాతం మంది 11.5 సె.మీ. కన్నా తక్కువ చేతికండ చుట్టు కొలత కలిగి ఉన్నారు. మూడో వంతు చిన్నారుల్లో రక్తహీనత రాష్ట్రంలోని కిశోర బాలికలు తీవ్ర రక్త హీతనతో బాధపడుతున్నారు. 10–19 ఏళ్ల బాలికల్లో ఏకంగా 46 శాతం మంది, బాలురల్లో 18.5 శాతం మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 1–4 ఏళ్ల పిల్లల్లో 33.4 శాతం మంది ఇనుము లోపం కలిగి ఉన్నారు. 10–19 ఏళ్ల పిల్లల్లో ఏకంగా 63.7 శాతం మంది బి–విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. మధుమేహం ముప్పు.. రాష్ట్రంలోని 15.4 శాతం మంది 5 నుంచి 9 ఏళ్ల బాలలు, 15.2 శాతం మంది 10–19 ఏళ్ల బాలలు మధుమేహం ముప్పును ఎదుర్కొంటున్నారు. రక్తంలో 5.7 –6.4 శాతం చక్కెర (గైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్) కలిగి ప్రీడయాబెటిక్ స్టేజీలో ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక 5–9 ఏళ్ల పిల్లల్లో 1 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 5–9 ఏళ్ల పిల్లల్లో 21.9 శాతం మంది, 10–19 ఏళ్ల పిల్లల్లో 12.4 శాతం మంది తమ రక్తంలో అధిక కొవ్వు కలిగి ఉన్నారు. వీరు గుండె సంబంధిత వ్యాధుల ముప్పు ఎదుర్కొంటున్నారు. 5–9 ఏళ్ల పిల్లల్లో 23.6 శాతం మంది, 10–19 ఏళ్ల పిల్లల్లో 24.3 శాతం మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుండటంతో అధిక ‘క్రియాటిన్’కలిగి ఉన్నారు. తొలిసారి సమగ్ర సర్వే! పాఠశాలకు వెళ్లడానికి ముందు వయసు (0–4 ఏళ్లు), పాఠశాల వెళ్లే వయసు (4–9 ఏళ్లు), కిశోర వయసు (10–14 ఏళ్లు) బాలబాలికలను ఇంటర్వ్యూలు చేయడం, శరీర కొలతలు తీయడం, మలమూత్ర, రక్త పరీక్షలు నిర్వహించడం ద్వారా బాలల్లో పౌష్టికాహార స్థితిగతులపై అధ్యయనం జరిపింది. బాలల్లో సూక్ష్మ పౌష్టికాహార లోపం తీవ్రత, స్థాయిలను అంచనా వేయడం, అసంక్రమిత వ్యాధుల బారినపడేందుకు ఉన్న అవకాశాలను గుర్తించేందుకు ప్రామాణిక పద్ధతుల్లో పకడ్బందీగా ఇలాంటి సర్వే నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి. క్షేత్ర స్థాయిలో పౌష్టికాహార లోపం స్థితిగతులను తెలుసుకుని, తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను అభివృద్ధిపరచాలనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహించారు. రాష్ట్రంలో 30 బృందాలు 2016 ఫిబ్రవరి 26 నుంచి జూలై 24 మధ్య కాలంలో 3,600 మంది బాలల శరీర కొలతలు తీసుకోవడంతో పాటు 1,800 బాలల రక్త, మల, మూత్ర పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనం జరిపాయి. 55 శాతం శాఖాహారులే.. జాతీయ స్థాయిలో 0–4 ఏళ్ల వయసున్న 38,060 మంది, 5–9 ఏళ్ల 38,355 మంది, 10–19 ఏళ్ల 35830 మంది బాలబాలికలపై సర్వే నిర్వహించారు. వీరిలో 55 శాతం బాలలు శాఖాహారమే (కోడిగుడ్డు కూడా లేకుండా) తీసుకుంటున్నారు. 36–40 శాతం మంది మాంసాహారం తీసుకుంటుండగా, మిగిలిన వారు శాఖాహారంతో పాటు కోడిగుడ్డు తీసుకుంటున్నారు. 5 నుంచి 9 ఏళ్ల బాలల్లో 91 శాతం మంది, 10–14 ఏళ్ల బాలల్లో 52 శాతం, 15–19 ఏళ్ల బాలల్లో 48 శాతం మంది పాఠశాలకు వెళ్తున్నారు. 42 శాతం మందికి సరిగ్గా దొరకని ఆహారం 6–23 నెలల బాలల్లో 42 శాతం మందికి వారి వయసుకు తగ్గట్టు రోజూ లభించాల్సిన ఆహారం కన్నా తక్కువగా లభిస్తోంది. 21 శాతం మందికి సరిపడా వైవిధ్యమైన ఆహారం దొరుకుతుండగా, 6 శాతం మంది కనీస ఆమోదయోగ్యమైన ఆహారం పొందగలుగుతున్నారు. తెలంగాణలోని 6–23 నెలల బాలల్లో 3.6 శాతం మందికి కనీస ఆమోద్యయోగ్యమైన ఆహారం లభిస్తోంది. 58 శాతం మందికి తల్లిపాలే దిక్కు 6 నెలల లోపు బాలల్లో 58 శాతం మంది కేవలం తల్లిపాలపై ఆధారపడి ఉన్నారు. 12–15 నెలల బాలల్లో 83 శాతం మందికి తల్లిపాలు కొనసాగిస్తున్నారు. 6–8 నెలల బాలల్లో 53 శాతం మందికే పుష్టికరమైన ఆహారం లభిస్తోంది. 0–24 నెలల బాలల్లో 57 శాతం మందికి పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగించడం జరిగింది. -
పిల్లలకు పెద్దల జబ్బులు!
సాక్షి, హైదరాబాద్: పెద్దలకే పరిమితమైన జీవన శైలి వ్యాధులు, ఇప్పుడు పిల్లలపైనా పంజా విసురుతున్నాయి. డయాబెటిక్, బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో పిల్లలు సతమతమవుతున్నారు. ఇదే విషయంపై కేంద్ర ఆరోగ, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, 19 ఏళ్లలోపు పిల్లల్లో ఒక్క శాతం మందికి డయాబెటిక్ సోకిందని స్పష్టం చేసింది. అదే వయసు వారిలో ప్రతి 10 మందిలో ఒకరు ప్రీ డయాబెటిక్ (డయాబెటిక్ ముందస్తు స్థితి) ఉన్నట్లు పేర్కొంది. 7 శాతం మంది కిడ్నీ వ్యాధులతో, 5 శాతం మంది బీపీతో బాధపడుతున్నారని వెల్లడించింది. పాఠశాలకు వెళ్లే వారిలో 3 శాతం, 10 నుంచి 19 ఏళ్ల వారిలో 4 శాతం మంది తీవ్రమైన కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేసింది. ఈ పరిస్థితులకు అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, పర్యావరణ సమస్యలు, అనారోగ్యకరమైన జీవనశైలి ప్రధాన కారణాలని తెలిపింది. యునిసెఫ్ సహకారంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్‌ఎన్‌ఎస్) జరిగింది. దేశవ్యాప్తంగా 2016 నుంచి 2018 వరకు జరిగిన ఈ భారీ సర్వే వివరాలను కేంద్రం తాజాగా వెల్లడించింది. మన రాష్ట్రంపై బీపీ, షుగర్ పంజా.. సర్వే ప్రకారం దేశంలో 10–19 ఏళ్ల మధ్య పిల్లల్లో 5 శాతం మంది బీపీతో బాధపడుతుండగా, తెలంగాణలో ఏకంగా 6.7 శాతం ఉండటం ఆందోళనకరం. ఢిల్లీలో 10.1 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 8.6 శాతం, మణిపూర్‌లో 8.3 శాతం ఉండటం గమనార్హం. కేరళలో అత్యంత తక్కువగా 0.5 శాతం మందికే బీపీ ఉంది. అదే వయసు పిల్లల్లో డయాబెటిస్తో బాధపడేవారు దేశంలో 0.6 శాతం మంది ఉండగా, తెలంగాణలో 1.1 శాతం మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో అత్యధికంగా త్రిపురలో 4.9 శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. తెలంగాణ బీపీ విషయంలో 5వ స్థానం, డయాబెటిస్‌లో 9వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో 8.6 శాతం మంది ప్రీ డయాబెటిస్తో బాధపడుతున్నారని తేల్చింది. రాష్ట్రంలో 5–9 ఏళ్ల పిల్లల్లో ఎవరికీ డయాబెటిస్ లేదని తేలింది. అయితే ప్రీ డయాబెటిస్ స్థితిలో ఉన్న పిల్లలు 8 శాతం ఉన్నారని పేర్కొంది. 30.8 శాతం తక్కువ బరువు.. తెలంగాణలో 0–4 ఏళ్లలోపు పిల్లల్లో 30.8 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 33.4 శాతం పిల్లలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. 5–9 ఏళ్ల పిల్లల్లో 22.7 శాతం మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఇక 10–19 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 26 శాతం మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఇదే వయసు వారిలో 5.7 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. విటమిన్ ‘ఏ’తో బాధపడేవారిలో తెలంగాణ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచి ఉంది. మాంసంలో మన పిల్లల స్థానం.. 4 దేశంలో చికెన్ సహా మాంసం తినే వారిలో మన రాష్ట్ర పిల్లలు నాలుగో స్థానం వరకు ఉన్నారు. 5–9 ఏళ్లలోపు పిల్లలు మాంసం లేదా చికెన్ తినేవారు (62.1 శాతం) దేశంలోనే రెండో స్థానంలో ఉన్నారు. ఇదే వయసు వారిలో గుడ్లు తినేవారు 75.3 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. చేపలు తినేవారు మాత్రం 19.3 శాతం ఉన్నారు. 10–19 ఏళ్ల మధ్య పిల్లల్లో 63.5 శాతం మంది మాంసం తింటూ దేశంలోనే నాలుగో స్థానంలో నిలవగా, గుడ్లు తినడంలో 72.4 శాతంతో 5వ స్థానంలో నిలిచారు. చేపలు తినేవారు 18.8 శాతమే ఉన్నారు. అయితే 2 నుంచి 4 ఏళ్ల పిల్లలు 20.7 శాతం మాత్రమే గుడ్లు తింటున్నారు. -
కేలరీ యాప్‌లా.. కాస్త కేర్‌ఫుల్!
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. బోలెడన్ని పనులు చేసేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఈ జాబితాలో ఒకటి. తినే ఆహారంలో ఎన్ని కేలరీలున్నాయో? లెక్కకట్టి చెప్పేందుకు గూగుల్ ప్లేస్టోర్‌లో ఎన్నో అప్లికేషన్లు ఉన్నాయి. మరి ఇలాంటి అప్లికేషన్ల ద్వారా మనకందే సమాచారం సరైందేనా? మరీ ముఖ్యంగా ఎక్కడో పాశ్చాత్యదేశాల జనాభాకు అనుగుణమైన కేలరీల లెక్క మనకూ సరిపోతుందా? దైనందిన కార్యకలాపాల ద్వారా ఎన్ని కేలరీలు కోల్పోతున్నామో ఇవి కచ్చితంగా లెక్కకట్టగలవా? ఆసక్తికరమైన ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేసింది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పౌష్టికాహార సంస్థ! ఒక్కోటి ఒక్కో సమాచారం ఈ అధ్యయనంలో భాగంగా వారు గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న 20 అప్లికేషన్లను ఎంపిక చేసుకున్నారు. అంతర్జాతీయంగా శాస్త్రీయంగా అమల్లో ఉన్న ప్రమాణాలను మన జనాభాకు తగ్గట్టుగా మార్పులు చేసి 55 పాయింట్ల స్కేల్‌తో అప్లికేషన్లను బేరీజు వేశారు. 70 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన అప్లికేషన్లను నాణ్యమైనవిగా గుర్తించారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అధ్యయనంలో భాగంగా పరిశీలించిన 20 అప్లికేషన్లలో 13 ఈ నాణ్యతకు దిగువన ఉన్నాయి. చాలా అప్లికేషన్లు వాడిన సమాచారం శాస్త్రీయ ప్రమాణాలకు నిలబడేవి కానేకావని తేలింది. వ్యక్తుల శారీరక శ్రమను పరిగణలోకి తీసుకోకుండా కేలరీ అవసరాలను లెక్కకట్టిన అప్లికేషన్లు ఈ జాబితాలో ఉన్నట్లు స్పష్టమైంది. ‘ఒకవేళ మీరు ఈ 20 అప్లికేషన్లను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుని వాడితే.. ఒక్కోటి ఒక్కో రకమైన అంకెలను చూపిస్తుంది’అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఎం.గవరవరపు సుబ్బారావు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒక ఉదాహరణ ఇస్తూ.. ‘పెద్దగా శారీరక శ్రమ చేయని 22 ఏళ్ల మహిళను ఉదాహరణగా తీసుకుందాం. దాదాపు 66 కిలోల బరువున్న ఈ మహిళ వారానికి అర కిలో బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. ఈ 20 అప్లికేషన్లు సూచించే కేలరీల సంఖ్య 1191 నుంచి 1955 కిలోకేలరీ వరకూ ఉంటుంది’అని వివరించారు. కాయగూరలు, పండ్లు ఎక్కువగా తినడం, సంతృప్త కొవ్వుల మోతాదును పరిమితంగా ఉంచుకోవడం, తినే పండ్లలో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కేవలం 40 శాతం అప్లికేషన్లు మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని సుబ్బారావు తెలిపారు. అంతేకాకుండా.. మంచి ఆరోగ్యానికి రోజూ వ్యాయామం చేయాలన్న సూచన చేసే అప్లికేషన్లు కూడా సగమేనని, ఈ అప్లికేషన్లు అన్నీ బరువు తగ్గడాన్ని నమోదు చేస్తున్నా.. నడుము చుట్టుకొలత గురించి పట్టించుకునేవి అతితక్కువగా ఉన్నాయని చెప్పారు. లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నా.. మంచి స్టార్ రేటింగ్ ఉన్న అప్లికేషన్లు కూడా నాణ్యత విషయానికొచ్చేసరికి అంతంత మాత్రంగానే ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని సుబ్బారావు తెలిపారు. చాలా అప్లికేషన్లు భారతీయ భోజనానికి సంబంధించిన కేలరీల లెక్కలు తప్పుగా చూపుతున్నాయని చెప్పారు. ‘కేలరీలు లెక్కవేసే అప్లికేషన్లలో ఉన్న లోపాలను సరిచేసే ఉద్దేశంతోనే తాము ‘న్యూట్రిఫై ఇండియా నౌ’ను అభివృద్ధి చేశామని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. -
రూ.9వేల కోట్లతో జాతీయ న్యూట్రిషన్ మిషన్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ న్యూట్రిషన్ మిషన్ (ఎన్ఎన్ఎం) కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2017-18 నాటికి మూడు సంవత్సరాలకు రూ. 9,046.17 కోట్లు బడ్జెట్‌ను కేటాయించినట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ప్రకటించారు. రక్తహీనత, తక్కువ బరువున్న పిల్లల జననాలు తదితర పోషకాహార సంబంధింత అంశాలపై ఎన్ఎన్ఎం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. పిల్లలు, మహిళల్లో రక్తహీనత, తక్కువ బరువున్న పిల్లల జననాలు తదితర పోషకాహార సంబంధింత అంశాలపై ఎన్ఎన్ఎం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల ద్వారా 2020 నాటికి పోషకాహార సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్టు జైట్లీ వెల్లడించారు. ఒక అపెక్స్ బాడీ, ఎన్ఎన్ఎం పర్యవేక్షణలో పరిశీలన, లక్ష్యాలు, పోషకాహార సంబంధిత అంశాలపై ఆయా మంత్రిత్వ శాఖలలోమార్గనిర్దేశనం చేస్తుంది. దీంతోపాటు తక్కువ పోషకాహారం, రక్తహీనత, తక్కువ బరువు గల పిల్లలు జననం లాంటి అంశాలను తగ్గించడానికి కృషి చేస్తుంది. మెరుగైన పర్యవేక్షణకు, సకాలంలో చర్యల కోసం హెచ్చరికలను జారీ చేస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకునే ఎన్ఎన్ఎం వ్యవహరిస్తుంది. అలాగే లక్ష్యాల సాధనలో మంత్రిత్వశాఖలతో పాటు గైడ్ చేస్తుంది. అవసరమైన పోషణ సంబంధిత సమస్యల గురించి కూడా హెచ్చరిస్తుంది. #Cabinet approves setting up of National Nutrition Mission pic.twitter.com/XxOsmu8Xeh — Frank Noronha (@DG_PIB) December 1, 2017 -
అర్ధాకలితో గ్రామీణ భారతం..
గ్రామీణ ప్రజలు తినే ఆహారం తగ్గిపోతోంది - 40 ఏళ్ల క్రితం నాటి కంటే తక్కువ తింటున్న భారతీయులు - 83 కోట్ల మందికి పోషకాహారం అందడం లేదు - నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయిపోయింది. 1990 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి రేటు సాధిస్తోంది. 2008లో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడినా.. మనదేశం తట్టుకుని నిలబడగలిగింది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి మరోవైపు చూస్తే.. గ్రామీణ భారతంలో ప్రజలు తినే ఆహారం బాగా తగ్గిపోయిందట. గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న 83 కోట్ల మందికి సరైన పోషకాహారం లభించడం లేదట. ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన ఆహారం కంటే గ్రామీణ భారతీయులు తక్కువగా తింటున్నారట. ఈ విషయాలన్నీ 2012 నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో(ఎన్‌ఎన్‌ఎంబీ) సర్వే వెల్లడించింది. 1975-79 నాటి సరాసరితో పోల్చి చూస్తే ఇప్పుడు గ్రామీణ భారతీయులు 550 క్యాలరీలు తక్కువగా తీసుకుంటున్నారు. ప్రొటీన్లు 13 గ్రాములు, ఐరన్ 5 మిల్లీగ్రాములు, కాల్షియం 250 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ 500 మిల్లీగ్రామలు తక్కువగా తీసుకుంటున్నట్టు తేలింది. ఇక మూడేళ్లలోపు పిల్లలు ప్రతి రోజు 300 మిల్లీలీటర్ల పాలు తాగాల్సి ఉండగా.. ప్రస్తుతం సగటున ప్రతి చిన్నారికీ అందుతున్న పాలు 80 మిల్లీ లీటర్లే. పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం.. సాధారణంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటే.. ప్రజల కంచాల్లో ఆహారం కూడా పెరగాలి. కానీ నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు అందుతున్న పోషకాహారం బాగా తగ్గింది. గత నలభై ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని వారి సంఖ్య 30 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో భూ యజమానులు, వ్యవసాయదారుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. ఇదే సమయంలో సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. సాధారణ ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉంటే.. ఆహార ద్రవ్యోల్బణం 10 శాతానికి పెరిగింది. దీంతో పప్పులు, నూనెలు, తృణధాన్యాలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా కొందరు మాత్రమే వీటిని కొనుగోలు చేయగలుగుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సరిపడా ఆహార పదార్థాలు కొనుగోలు చేయలేకపోతున్నారు. కడుపు నిండా అన్నం తినలేకపోతున్నారు. ఈ సర్వే ప్రకారం 35 శాతం మంది గ్రామీణ పురుషులు, స్త్రీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారట. 42 శాతం మంది బాలలు నిర్దేశిత బరువుకంటే తక్కువ ఉంటున్నారట. పేదలు ఎక్కువగా నివసించే పల్లెలు, బస్తీలు, మురికివాడల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.