అర్ధాకలితో గ్రామీణ భారతం.. | Rural India with half meal | Sakshi
Sakshi News home page

అర్ధాకలితో గ్రామీణ భారతం..

Published Mon, Aug 29 2016 4:02 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

అర్ధాకలితో గ్రామీణ భారతం..

అర్ధాకలితో గ్రామీణ భారతం..

 గ్రామీణ ప్రజలు తినే ఆహారం తగ్గిపోతోంది
- 40 ఏళ్ల క్రితం నాటి కంటే తక్కువ తింటున్న భారతీయులు
- 83 కోట్ల మందికి పోషకాహారం అందడం లేదు
- నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో సర్వేలో వెల్లడి
 
 న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయిపోయింది. 1990 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి రేటు సాధిస్తోంది. 2008లో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడినా.. మనదేశం తట్టుకుని నిలబడగలిగింది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి మరోవైపు చూస్తే.. గ్రామీణ భారతంలో ప్రజలు తినే ఆహారం బాగా తగ్గిపోయిందట. గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న 83 కోట్ల మందికి సరైన పోషకాహారం లభించడం లేదట.

ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన ఆహారం కంటే గ్రామీణ భారతీయులు తక్కువగా తింటున్నారట. ఈ విషయాలన్నీ 2012 నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో(ఎన్‌ఎన్‌ఎంబీ) సర్వే వెల్లడించింది. 1975-79 నాటి సరాసరితో పోల్చి చూస్తే ఇప్పుడు గ్రామీణ భారతీయులు 550 క్యాలరీలు తక్కువగా తీసుకుంటున్నారు. ప్రొటీన్లు 13 గ్రాములు, ఐరన్ 5 మిల్లీగ్రాములు, కాల్షియం 250 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ 500 మిల్లీగ్రామలు తక్కువగా తీసుకుంటున్నట్టు తేలింది. ఇక మూడేళ్లలోపు పిల్లలు ప్రతి రోజు 300 మిల్లీలీటర్ల పాలు తాగాల్సి ఉండగా.. ప్రస్తుతం సగటున ప్రతి చిన్నారికీ అందుతున్న పాలు 80 మిల్లీ లీటర్లే.

 పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం..
 సాధారణంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటే.. ప్రజల కంచాల్లో ఆహారం కూడా పెరగాలి. కానీ నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు అందుతున్న పోషకాహారం బాగా తగ్గింది. గత నలభై ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని వారి సంఖ్య 30 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో భూ యజమానులు, వ్యవసాయదారుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. ఇదే సమయంలో సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. సాధారణ ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉంటే.. ఆహార ద్రవ్యోల్బణం 10 శాతానికి పెరిగింది. దీంతో పప్పులు, నూనెలు, తృణధాన్యాలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

ఫలితంగా కొందరు మాత్రమే వీటిని కొనుగోలు చేయగలుగుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సరిపడా ఆహార పదార్థాలు కొనుగోలు చేయలేకపోతున్నారు. కడుపు నిండా అన్నం తినలేకపోతున్నారు. ఈ సర్వే ప్రకారం 35 శాతం మంది గ్రామీణ పురుషులు, స్త్రీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారట. 42 శాతం మంది బాలలు నిర్దేశిత బరువుకంటే తక్కువ ఉంటున్నారట. పేదలు ఎక్కువగా నివసించే పల్లెలు, బస్తీలు, మురికివాడల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement