సామాన్యుడికి నిత్యావసరాల భారం
న్యూఢిల్లీ: అటు టోకుగా చూసినా, ఇటు రిటైల్‌గా చూసినా ధరల భారం తీవ్రంగా ఉంది. సెప్టెంబర్‌లో సామాన్యునికి నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపించాయి.
డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం...
- ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ సెప్టెంబర్‌లో 6.46 శాతంగా నమోదయ్యింది. అంటే 2012 సెప్టెంబర్‌తో పోల్చితే 2013 సెప్టెంబర్‌లో వార్షికంగా టోకు ధరలు 6.46 శాతం పెరిగాయన్నమాట. ఆగస్టులో ఈ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం రేటు 6.10 శాతం.
- మొత్తం సూచీలో ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలను టోకుగా చూస్తే సెప్టెంబర్‌లో (వెయిటేజ్ 14.34 శాతం) వార్షిక ప్రాతిపదికన 18.18 శాతం పెరిగాయి. ఆగస్టులో పెరుగుదల రేటు 11.91 శాతం. వార్షిక ప్రాతిపదికన ఆహార ఉత్పత్తులను వేర్వేరుగా చూస్తే- ఉల్లిపాయల ధరలు భారీగా 323 శాతం ఎగశాయి. కూరగాయలు 89.37 శాతం పెరిగాయి. బియ్యం ధరలు 18.06 శాతం ప్రియమయ్యాయి. పండ్ల ధరలు 13.54 శాతం ఎగిశాయి. ప్రోటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 13.37 శాతం ఎగశాయి. తృణ ధాన్యాల ధరలు 13.05 శాతం పైకి లేచాయి. గోధుమల ధరలు 5.90 శాతం పెరిగాయి. పాల ధరలు 5.77 శాతం ఎగశాయి. కాగా పప్పు దినుసులు (13.42 శాతం), బంగాళా దుంపల ధరలు (13.10 శాతం) మాత్రం తగ్గాయి.
- కీలక కోర్ గ్రూప్ (తయారీ) ద్రవ్యోల్బణం 2.03 శాతం పెరిగింది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం సూచీ 13.54 శాతం ఎగిసింది. ఆహారేతర ఉత్పత్తుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 5.17 శాతం ఎగసింది. ఇక ఇంధనం అండ్ లైట్ విభాగం ద్రవ్యోల్బణం స్పీడ్ 10.08 శాతంగా ఉంది.
రిటైల్ ద్రవ్యోల్బణం ఇలా...
ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ధరల విషయానికి వస్తే- ఆగస్టులో 9.52 శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్‌లో 9.84 శాతానికి చేరింది. ఇందులో మూడు ప్రధాన విభాగాలను తీసుకుంటే- ఆహారం, పానియాల విభాగం ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్‌లో 11.44 శాతం పెరిగింది. ఇంధనం, లైట్ విభాగం ద్రవ్యోల్బణం 7.67 శాతం ఎగసింది. క్లాతింగ్, బెడ్డింగ్, పాదరక్షల ధరలు 9.28 శాతం ఎగిశాయి. వార్షిక ప్రాతిపదికన ఒక్క చక్కెర (-4.46 శాతం) ధర మాత్రం తగ్గింది.
రెపో రేటు మరింత పెరగొచ్చు...!
ఆహార ద్రవ్యోల్బణం సామాన్యునికి భారంగా ఉన్న నేపథ్యంలో- అక్టోబర్ 29 పాలసీ సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చిన రుణాలపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు)ను మరో పావు శాతం పెంచే అవకాశం ఉందని నిపుణులు కొందరు భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం 7.5 శాతంగా ఉన్న ఈ రేటు 7.75 శాతానికి చేరుతుంది. అయితే వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యతా (లిక్విడిటీ) సమస్యా తలెత్తకుండా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు పావు శాతం తగ్గించే (9 శాతం నుంచి 8.75 శాతానికి) అవకాశం ఉందని కూడా నిపుణుల అంచనా. రెపో మార్గం ద్వారా రుణ పరిమితి దాటితే- ఎంఎస్‌ఎఫ్ రూట్‌ను బ్యాంకులు (ఆర్‌బీఐ నుంచి రుణాలకు) ఆశ్రయిస్తాయి. కాగా వ్యవస్థలో డిమాండ్ పెంపునకు రెపో రేటు తగ్గించాల్సిందేనని పారిశ్రామిక సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కోర్ గ్రూప్ ద్రవ్యోల్బణం రేటు కేవలం 2.03 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని ఆయా సంస్థలు ప్రస్తావిస్తున్నాయి. ఖరీఫ్ పంట దిగుబడులు, రూపాయి మారకపు విలువల స్థిరీకరణ ధోరణి రానున్న కాలంలో ద్రవ్యోల్బణాన్ని గాడికి తెస్తాయని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ విశ్లేషించారు.