న్యూఢిల్లీ: ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్ర భుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాల ను ఎదుర్కొనడానికి నిత్యావసర వస్తువుల ధరల కదలికను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఇక్కడ జరిగిన ఒక మీడియా రౌండ్ టేబుల్ సమావేశంలో తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
► బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే.. రుతుపవనంలో 30 శాతం లోటు ఉన్నప్పటికీ ఖరీఫ్ పంటపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
► ఎల్‌నినో ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో ఆహార ద్రవ్యోల్బణం అంశాన్ని మనం ఇంకా జాగరూకతతో పరిశీలించాల్సి ఉంటుంది.
► ఇక ఇతర ఉత్పత్తుల విషయానికి వస్తే.. ఖరీఫ్, రబీ పంటలు ఎలా ఉంటాయన్న అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆయా అంశాలపై ఇప్పటికీ అనిశ్చితి నెలకొంది.
► గ్రామీణ డిమాండ్ భవిష్యత్ ఇప్పటికీ ఊహాజనితమైన అంశమే. అయితే వర్షాభావం వల్ల గ్రామీణ రంగం తీవ్రంగా ప్రభావితమైతే, అది డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
► ప్రముఖ మ్యాగీ ఇన్‌స్టంట్ నూడుల్స్, కిట్‌కాట్ చాక్లెట్‌లు, నెస్‌కేఫ్‌ల ఉత్పత్తి దారైన నెస్లే ఇండియా... భారీ ఆఫర్‌లతో తన గ్రామీణ మార్కెట్‌ను విస్తరించుకోడానికి ప్రయతి్నస్తోంది. గ్రామీణ మార్కెట్ మొత్తం విక్రయాల్లో ఐదవ వంతు స్థానాన్ని సాధించింది. ఇది చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ, గణనీయమైన సానుకూల అంశం. స్థిర పురోగతిని సంస్థ సాధిస్తుందని భావిస్తున్నాం. జూన్ త్రైమాసికంలో సంస్థ మంచి గ్రామీణ డిమాండ్‌ను సంపాదించింది.
► అయితే పరిస్థితులు క్లిష్టంగా మారితే మా గ్రామీ ణ డిమాండ్‌పై సైతం ప్రతికూల ప్రభావం పడుతుంది.
► 2 నుంచి 6వ అంచె పట్టణాల్లో డిమాండ్ ఇప్పటికి సానుకూలంగా ఉంది. తీవ్ర ప్రతికూల పరిస్థితులు కనబడ్డం లేదు.
► సమస్యకు సంబంధించి చూస్తూ కూర్చోవడం ఎంతమాత్రం సమంజసం కాదు. సవాళ్లను ఎదుర్కొనడానికి నిరంతర చర్యలు కొనసాగాలి.
డెయిరీపై దీర్ఘకాలిక ప్రభావం...
డెయిరీ రంగంలో ధరల విషయాన్ని తీసుకుంటే.. తక్షణం ఏదో జరిగిపోతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయాన్ని, ప్రభావాలను పరిశీలించాలి. భవిష్యత్ ప్రభావాలు, పరిణామాల గురించి అధ్యయనం చేయాలి. సవాళ్లు ఇదే విధంగా కొనసాగితే, తక్షణ ప్రభావం చూపకపోయినా, 2024 నాటికి నిజంగా ఈ రంగంలో తీవ్ర సవాళ్లు ఉంటాయి. డెయిరీ రంగానికి సంబంధించి కోవిడ్ అనంతర ప్రభావాలపై మాట్లాడాలి.
చర్మ వ్యాధులుసహా అనేక ఇతర సవాళ్లు ఉన్నాయి. ఈ సమస్యలకు ఇంకా పరిష్కారం కనుగొనాలి. అలాగే ఉత్పత్తి వ్యయం బాగా పెరిగింది. దాణా ధరలో 40 శాతం పెరుగుదల కనబడుతోంది. పరిశ్రమ ఇంతటి క్లిష్ట స్థితిని భవిష్యత్తులో ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది. పాల విషయంలో అనుకూల ప్రతికూల అంశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి నిల్వలు భారీగా అందుబాటులో ఉంటాయి. మరోసారి తగ్గిపోతాయి. ఆయా అంశాలన్నింటిపై అధ్యయనం చేసి తగిన నిర్ణయాలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment