Government Measure
-
అటు సన్నద్ధానికి, ఇటు సహనానికి.. మళ్లీ.. మళ్లీ ‘పరీక్షే’
సాక్షి, హైదరాబాద్: సర్కారు కొలువు సాధించడం ఓ యజ్ఞమే. దీనికోసం ఏళ్ల తరబడి కష్టపడేవారు కొందరు ఉంటున్నారు. అన్నీ వదిలేసి కోచింగ్ తీసుకునేవారు మరికొందరు ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసేవారు, దీర్ఘకాలిక సెలవు పెట్టేవారూ ఉంటారు. అయితే లీకేజీల మకిలీ, పరీక్షల వాయిదా, పరీక్షల రద్దు ఇలా వరుస ఘటనలు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ప్రిపరేషనే ఓ పరీక్ష అయితే...సహనానికీ పరీక్ష పెట్టినట్టుగా ఉందని నిరుద్యోగులు వాపోతున్నారు. 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తెలంగాణస్టేట్ పబ్లిక్‌సర్విస్ కమిషన్ గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత వరుసగా ఇప్పటివరకు 30 ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో ఏకంగా 503 ఉద్యోగాలతో గ్రూప్–1 ప్రకటన వెలువడడంతో నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారిలో ఎంతో ఉత్సాహం నింపింది. ఆ తర్వాత గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, ఇంజనీరింగ్ ఉద్యోగాలతోపాటు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ టీచర్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, లైబ్రేరియన్స్, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్, హార్టీకల్చర్ ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, టౌన్ ప్లానింగ్.. ఇలా దాదాపు 30వేల ఉద్యోగాలకు పైబడి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించింది. రెండో ‘సారీ’ ప్రశ్నపత్రాల లీకేజీతో డీఏఓ, గ్రూప్–1, ఏఈఈ పరీక్షలు రద్దు చేయగా, టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, హార్టికల్చర్ ఆఫీసర్ తదితర పరీక్షలు చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఈ క్రమంలో దాదాపు ఏడున్నర లక్షల మందికిపైగా అభ్యర్థులంతా రెండోసారి పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఇందులో అత్యధికంగా గ్రూప్–1కు 3.80 లక్షల మంది, డీఏఓ పరీక్షకు దాదాపు 1.6లక్షల మంది అభ్యర్థులున్నారు. ఒకసారి పరీక్ష రాశాక, రెండోసారి మళ్లీ పరీక్షకు సన్నద్ధం కావడమనేది మానసికంగా తీవ్రఒత్తిడి కలిగించే విషయమే. ఇక గ్రూప్–1 విషయానికి వస్తే పరీక్ష నిర్వహణలోపాల కారణంగా రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు రెండుసార్లు ఆదేశించింది. గ్రూప్–1 పరీక్ష రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అత్యంత ఉత్తమమైన సర్విసు. రాష్ట్రస్థాయి సివిల్ సర్విసుగా భావించే దీనికి ప్రిపరేషన్ అంత ఈజీ కాదు. రోజుకు 18గంటల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి వారికి తాజాగా హైకోర్టు నిర్ణయం షాక్‌కు గురిచేసింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తే హాజరశాతం గణనీయంగా పడిపోయే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాతే హాజరులో స్పష్టత గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను ప్రకటించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 11వ తేదీ సాయంత్రం టీఎస్పీ ఎస్సీ హాజరైన అభ్యర్థుల ప్రాథమిక సమాచారం పేరిట ప్రకటన విడుదల చేసింది. పరీక్ష కేంద్రాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ గణాంకాలు చెబుతున్నా, ఓఎంఆర్ జవాబుపత్రాలు స్వా«దీనం చేసుకున్న తర్వాత పక్కా గణాంకాలు ఇస్తామని తెలిపింది. సాధారణంగా పరీక్షల హాజరుశాతం గణాంకాలపై స్పష్టత రావాలంటే వెంటనే సాధ్యం కాదు. అన్ని కేంద్రాల నుంచి పక్కా సమాచారం సేకరించడానికి సమయం పడుతుంది. ఈమేరకు టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొన్నా, మరుసటి ప్రకటనలో నెలకొన్న గందరగోళం అభ్యర్థులను కొంత అనుమానాలకు గురిచేసింది. ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసిన తర్వాత టీఎస్పీఎస్సీ చేసిన ప్రకటనలో స్పష్టత ఇచ్చినా, అభ్యర్థులకు మాత్రం అనుమానాలు తొలగలేదు. ఇక బయోమెట్రిక్ హాజరుతీరు పట్ల కూడా అనుమానాలు నెలకొనడంతో న్యాయస్థానాన్ని ఆశ్ర యించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో బయోమెట్రిక్ హాజరులో ఎదుర్కొన్న పలు సమస్యల కారణంగానే, బయోమెట్రిక్ వద్దనుకున్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. అభ్యర్థులకు వారం రోజుల ముందే పంపించిన హాల్‌టికెట్లలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశామని చెబుతున్నాయి. అయి తే రెండోసారి జారీ చేసిన హాల్ టికెట్లలో బయోమెట్రిక్ చెక్ఇన్ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. -
ఆహార ధరలే ఆందోళనకరం
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్ర భుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాల ను ఎదుర్కొనడానికి నిత్యావసర వస్తువుల ధరల కదలికను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఇక్కడ జరిగిన ఒక మీడియా రౌండ్ టేబుల్ సమావేశంలో తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే.. రుతుపవనంలో 30 శాతం లోటు ఉన్నప్పటికీ ఖరీఫ్ పంటపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ► ఎల్‌నినో ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో ఆహార ద్రవ్యోల్బణం అంశాన్ని మనం ఇంకా జాగరూకతతో పరిశీలించాల్సి ఉంటుంది. ► ఇక ఇతర ఉత్పత్తుల విషయానికి వస్తే.. ఖరీఫ్, రబీ పంటలు ఎలా ఉంటాయన్న అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆయా అంశాలపై ఇప్పటికీ అనిశ్చితి నెలకొంది. ► గ్రామీణ డిమాండ్ భవిష్యత్ ఇప్పటికీ ఊహాజనితమైన అంశమే. అయితే వర్షాభావం వల్ల గ్రామీణ రంగం తీవ్రంగా ప్రభావితమైతే, అది డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► ప్రముఖ మ్యాగీ ఇన్స్టంట్ నూడుల్స్, కిట్‌కాట్ చాక్లెట్లు, నెస్కేఫ్ల ఉత్పత్తి దారైన నెస్లే ఇండియా... భారీ ఆఫర్లతో తన గ్రామీణ మార్కెట్‌ను విస్తరించుకోడానికి ప్రయతి్నస్తోంది. గ్రామీణ మార్కెట్ మొత్తం విక్రయాల్లో ఐదవ వంతు స్థానాన్ని సాధించింది. ఇది చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ, గణనీయమైన సానుకూల అంశం. స్థిర పురోగతిని సంస్థ సాధిస్తుందని భావిస్తున్నాం. జూన్ త్రైమాసికంలో సంస్థ మంచి గ్రామీణ డిమాండ్‌ను సంపాదించింది. ► అయితే పరిస్థితులు క్లిష్టంగా మారితే మా గ్రామీ ణ డిమాండ్‌పై సైతం ప్రతికూల ప్రభావం పడుతుంది. ► 2 నుంచి 6వ అంచె పట్టణాల్లో డిమాండ్ ఇప్పటికి సానుకూలంగా ఉంది. తీవ్ర ప్రతికూల పరిస్థితులు కనబడ్డం లేదు. ► సమస్యకు సంబంధించి చూస్తూ కూర్చోవడం ఎంతమాత్రం సమంజసం కాదు. సవాళ్లను ఎదుర్కొనడానికి నిరంతర చర్యలు కొనసాగాలి. డెయిరీపై దీర్ఘకాలిక ప్రభావం... డెయిరీ రంగంలో ధరల విషయాన్ని తీసుకుంటే.. తక్షణం ఏదో జరిగిపోతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయాన్ని, ప్రభావాలను పరిశీలించాలి. భవిష్యత్ ప్రభావాలు, పరిణామాల గురించి అధ్యయనం చేయాలి. సవాళ్లు ఇదే విధంగా కొనసాగితే, తక్షణ ప్రభావం చూపకపోయినా, 2024 నాటికి నిజంగా ఈ రంగంలో తీవ్ర సవాళ్లు ఉంటాయి. డెయిరీ రంగానికి సంబంధించి కోవిడ్ అనంతర ప్రభావాలపై మాట్లాడాలి. చర్మ వ్యాధులుసహా అనేక ఇతర సవాళ్లు ఉన్నాయి. ఈ సమస్యలకు ఇంకా పరిష్కారం కనుగొనాలి. అలాగే ఉత్పత్తి వ్యయం బాగా పెరిగింది. దాణా ధరలో 40 శాతం పెరుగుదల కనబడుతోంది. పరిశ్రమ ఇంతటి క్లిష్ట స్థితిని భవిష్యత్తులో ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది. పాల విషయంలో అనుకూల ప్రతికూల అంశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి నిల్వలు భారీగా అందుబాటులో ఉంటాయి. మరోసారి తగ్గిపోతాయి. ఆయా అంశాలన్నింటిపై అధ్యయనం చేసి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. -
పట్టువదలని పవిత్రన్
♦ పదిహేడేళ్లకే ప్రభుత్వ కొలువు ♦ రెండో ప్రయత్నంలోనే సివిల్స్‌కు.. ♦ సింగరేణి డెరైక్టర్ (పా)గా బాధ్యతలు ♦ జె.పవిత్రన్‌కుమార్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నోడు.. నాన్నతో ఆఫీసుకు వెళ్లి పెద్ద అధికారులను చూసి.. అలా కావాలని ఆనాడే నిర్ణయించుకున్నాడు.. చదువులో ముందుంటూ పదిహేడేళ్లకే ప్రభుత్వ కొలువు దక్కించుకున్నా.. అంతటితో సరిపెట్టుకోలేదు.. పట్టువదలని విక్రమార్కుడిలా విద్యనభ్యసించి అతిపెద్ద సింగరేణి సంస్థ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.. మధ్య తరగతి కుటుంబంలో జన్మించినా.. ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థానానికి ఎదిగి.. సింగరేణి డెరైక్టర్‌గా పనిచేస్తున్న జె.పవిత్రన్‌కుమార్ విజయాలపై ‘సాక్షి’ ఆదివారం ప్రత్యేక కథనం. కొత్తగూడెం : మధ్యతరగతి కుటుంబం కదా.. మనకెందుకులే అనుకోలేదు.. తండ్రి ప్రోత్సాహం.. చదువులో ముందుకు సాగాలనే ఆసక్తి.. సివిల్స్ కొట్టాలని తపన అతడిని మరింత ముందుకు నడిపించాయి.. పదిహేడేళ్లకే ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా.. కసితీరా చదివి రెండో ప్రయత్నంలోనే సివిల్స్ సాధించాడు. 60వేల ఉద్యోగులున్న రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికి డెరైక్టర్ ‘పా’గా విధులు నిర్వహించేలా చేసింది.. 32 ఏళ్లకే సింగరేణి సంస్థ వెల్ఫేర్ అండ్ పర్సనల్ విభాగానికి డెరైక్టర్‌గా పనిచేస్తున్న పవిత్రన్‌కుమార్‌పై ‘సాక్షి’ ఆదివారం ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం ఆర్లి గ్రామానికి చెందిన జె.ఆశన్న, సుశీల దంపతులకు ఐదుగురు సంతానం. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య ఉన్న పవిత్రన్‌కుమార్ అందరికంటే చిన్నవాడు. తండ్రి పోలీస్ శాఖలో ఉద్యోగం చేయగా.. తల్లి గృహణి. తండ్రి కుటుంబంతో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడటం.. పిల్లలతో ఎప్పుడు కలిసి ఉండాలనే ఆకాంక్షతో ఇరవై ఏళ్లపాటు ఆదిలాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఎస్బీ విభాగంలో ఏఎస్సైగా విధులు నిర్వహించాడు. 17 ఏళ్లకే కొలువు.. చిన్నప్పట్నుంచి చదువులో ముందుండే పవిత్రన్‌కుమార్ 1999 మార్చిలో పదో తరగతి చదివే సమయంలో తొలిసారిగా ఆర్ఆర్బీ పరీక్ష రాసి.. అర్హత సాధించాడు. పదో తరగతిలో జిల్లాస్థాయిలో 3వ ర్యాంకు సాధించి.. ప్రతిభ అవార్డు సైతం అందుకున్నాడు. అంత చిన్న వయసులో చదువుకు దూరం కావడం ఇష్టం లేకపోయినా.. అప్పటికే ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండటం.. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో బంధువులు, సన్నిహితులు చెప్పడంతో సికింద్రాబాద్‌లోని థామస్ కాలేజీలో రైల్వే ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి.. 17 ఏళ్లకే రైల్వేలో టీసీగా బాధ్యతలు చేపట్టాడు. అయినప్పటికీ సివిల్స్ సాధించాలనే తపనతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. నెలలో 20 రోజులు రాత్రిపూట విధులు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అప్పటికే రైల్వేలో టీసీగా విధులు నిర్వహిస్తున్న పవిత్రన్‌కుమార్.. నెలలో 20 రోజులపాటు రాత్రిపూట విధులు నిర్వహించేవాడు. ఔరంగాబాద్ చిన్న రైల్వే స్టేషన్ కావడం.. స్టేషన్‌కు వచ్చే రైళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో విధులు నిర్వహిస్తూనే రాత్రంతా చదివేవాడు. అలా జాతీయస్థాయిలో నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో రెండుసార్లు విజయం సాధించానని పేర్కొన్నాడు. ప్రస్తుతం మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రోనాల్డ్‌రోస్, ఏపీలోని విజయవాడ జేసీగా పనిచేస్తున్న చంద్రుడు.. పవిత్రన్‌కుమార్‌కు సీనియర్స్ కావడంతో వారి స్ఫూర్తితో సివిల్స్‌పై మరింత మక్కువ పెంచుకున్నాడు. తొలిసారిగా 2005లో గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యాడు. అయితే మెయిన్స్‌లో విఫలం అయినప్పటికీ ఆ తర్వాత 2006లో సివిల్స్ పరీక్షలకు హాజరయ్యాడు. తొలి ప్రయత్నంలో ఓటమి చెందినప్పటికీ.. 2007లో తిరిగి సివిల్స్ పరీక్షకు హాజరై 312వ ర్యాంకు సాధించి.. ఐఆర్ఎస్కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో డెరైక్టర్ ‘పా’గా విధులు నిర్వహిస్తున్నాడు.