పట్టువదలని పవిత్రన్
♦ పదిహేడేళ్లకే ప్రభుత్వ కొలువు
♦ రెండో ప్రయత్నంలోనే సివిల్స్‌కు..
♦ సింగరేణి డెరైక్టర్ (పా)గా బాధ్యతలు
♦ జె.పవిత్రన్‌కుమార్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం
ఆ కుటుంబంలో అందరికంటే చిన్నోడు.. నాన్నతో ఆఫీసుకు వెళ్లి పెద్ద అధికారులను చూసి.. అలా కావాలని ఆనాడే నిర్ణయించుకున్నాడు.. చదువులో ముందుంటూ పదిహేడేళ్లకే ప్రభుత్వ కొలువు దక్కించుకున్నా.. అంతటితో సరిపెట్టుకోలేదు.. పట్టువదలని విక్రమార్కుడిలా విద్యనభ్యసించి అతిపెద్ద సింగరేణి సంస్థ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.. మధ్య తరగతి కుటుంబంలో జన్మించినా.. ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థానానికి ఎదిగి.. సింగరేణి డెరైక్టర్‌గా పనిచేస్తున్న జె.పవిత్రన్‌కుమార్ విజయాలపై ‘సాక్షి’ ఆదివారం ప్రత్యేక కథనం.
కొత్తగూడెం : మధ్యతరగతి కుటుంబం కదా.. మనకెందుకులే అనుకోలేదు.. తండ్రి ప్రోత్సాహం.. చదువులో ముందుకు సాగాలనే ఆసక్తి.. సివిల్స్ కొట్టాలని తపన అతడిని మరింత ముందుకు నడిపించాయి.. పదిహేడేళ్లకే ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా.. కసితీరా చదివి రెండో ప్రయత్నంలోనే సివిల్స్ సాధించాడు. 60వేల ఉద్యోగులున్న రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికి డెరైక్టర్ ‘పా’గా విధులు నిర్వహించేలా చేసింది.. 32 ఏళ్లకే సింగరేణి సంస్థ వెల్ఫేర్ అండ్ పర్సనల్ విభాగానికి డెరైక్టర్‌గా పనిచేస్తున్న పవిత్రన్‌కుమార్‌పై ‘సాక్షి’ ఆదివారం ప్రత్యేక కథనం.
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం ఆర్లి గ్రామానికి చెందిన జె.ఆశన్న, సుశీల దంపతులకు ఐదుగురు సంతానం. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య ఉన్న పవిత్రన్‌కుమార్ అందరికంటే చిన్నవాడు. తండ్రి పోలీస్ శాఖలో ఉద్యోగం చేయగా.. తల్లి గృహణి. తండ్రి కుటుంబంతో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడటం.. పిల్లలతో ఎప్పుడు కలిసి ఉండాలనే ఆకాంక్షతో ఇరవై ఏళ్లపాటు ఆదిలాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఎస్‌బీ విభాగంలో ఏఎస్సైగా విధులు నిర్వహించాడు.
17 ఏళ్లకే కొలువు..
చిన్నప్పట్నుంచి చదువులో ముందుండే పవిత్రన్‌కుమార్ 1999 మార్చిలో పదో తరగతి చదివే సమయంలో తొలిసారిగా ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసి.. అర్హత సాధించాడు. పదో తరగతిలో జిల్లాస్థాయిలో 3వ ర్యాంకు సాధించి.. ప్రతిభ అవార్డు సైతం అందుకున్నాడు. అంత చిన్న వయసులో చదువుకు దూరం కావడం ఇష్టం లేకపోయినా.. అప్పటికే ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండటం.. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో బంధువులు, సన్నిహితులు చెప్పడంతో సికింద్రాబాద్‌లోని థామస్ కాలేజీలో రైల్వే ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి.. 17 ఏళ్లకే రైల్వేలో టీసీగా బాధ్యతలు చేపట్టాడు. అయినప్పటికీ సివిల్స్ సాధించాలనే తపనతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.
నెలలో 20 రోజులు రాత్రిపూట విధులు
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అప్పటికే రైల్వేలో టీసీగా విధులు నిర్వహిస్తున్న పవిత్రన్‌కుమార్.. నెలలో 20 రోజులపాటు రాత్రిపూట విధులు నిర్వహించేవాడు. ఔరంగాబాద్ చిన్న రైల్వే స్టేషన్ కావడం.. స్టేషన్‌కు వచ్చే రైళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో విధులు నిర్వహిస్తూనే రాత్రంతా చదివేవాడు. అలా జాతీయస్థాయిలో నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో రెండుసార్లు విజయం సాధించానని పేర్కొన్నాడు. ప్రస్తుతం మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రోనాల్డ్‌రోస్, ఏపీలోని విజయవాడ జేసీగా పనిచేస్తున్న చంద్రుడు.. పవిత్రన్‌కుమార్‌కు సీనియర్స్ కావడంతో వారి స్ఫూర్తితో సివిల్స్‌పై మరింత మక్కువ పెంచుకున్నాడు. తొలిసారిగా 2005లో గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యాడు. అయితే మెయిన్స్‌లో విఫలం అయినప్పటికీ ఆ తర్వాత 2006లో సివిల్స్ పరీక్షలకు హాజరయ్యాడు. తొలి ప్రయత్నంలో ఓటమి చెందినప్పటికీ.. 2007లో తిరిగి సివిల్స్ పరీక్షకు హాజరై 312వ ర్యాంకు సాధించి.. ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో డెరైక్టర్ ‘పా’గా విధులు నిర్వహిస్తున్నాడు.