తలపడనున్న ఆరు జట్లు ∙నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
ఈసారి యువ కార్మికులకు అవకాశం
గోదావరిఖని: సింగరేణి 53వ జోనల్‌స్థాయి పోటీలకు మైన్స్ రెస్క్యూ పోటీలకు సర్వం సిద్ధ మైంది. గోదావరిఖనిలోని సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్‌లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో సింగరేణి సంస్థవ్యాప్తంగా ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఈ నెల 16, 17వ తేదీల్లో ఈ జట్ల మధ్య పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు ఈసారి యువ కార్మికులను ఎంపిక చేశారు.
ఆర్జీవన్, ఆర్జీ–2, 3, ఏఎల్పీ, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు జట్లు పోటీల్లో పాల్గొంటాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16 మందిని ఎంపిక చేసి డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు రెండు జట్లుగా పంపించనున్నారు. కాగా, ఈ పోటీలకు సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, డీజీఎంఎస్ భూషణ్‌ప్రసాద్‌సింగ్, డీడీఎంఎస్ ఉమేశ్ ఎం.సావర్కర్ తదితరులు హాజరుకానున్నారు.
పోటీలు ఇవే..
రెండురోజుల పాటు ఆరు జట్ల మధ్య ప్రథమ చికిత్స, డ్రిల్ అండ్ పరేడ్, రెస్క్యూ రిలే ఈవెంట్, స్టాట్యూటరీ, థియరీలో పోటీలు ఉంటాయి. జీడీకే–7ఎల్‌ఈపీ భూగర్భ గనిలో రెస్క్యూ రికవరీ, మైన్స్ రెస్క్యూస్టేషన్‌లో మిగతా పోటీలు జరగనున్నాయి.
విజయవంతం చేయాలి
ఆపదకాలంలో మేమున్నామంటూ అండగా నిలిచే రెస్క్యూ జట్ల మధ్య నిర్వహించే ఈ పోటీలకు కార్మిక కుటుంబాలు హాజరై ఈ పోటీలను విజయవంతం చేయాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, ఆర్జీ–2 జీఎం ఎల్‌వీ సూర్యనారాయణ, రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి కోరారు.
స్థానిక రెస్క్యూ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 16న రెస్క్యూపరేడ్‌తో ప్రారంభమయ్యే పోటీలు ఈ నెల 17 న బహుమతి ప్రదానంతో ముగుస్తాయని తెలిపారు. సమావేశంలో అధికారులు నెహ్రూ, అనిల్‌కుమార్, మాధవరావు, ఎర్రన్న, మురళీకృష్ణ, ధనుంజయ్, విజయ్‌కుమార్, డాక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment