ఐదేళ్లలో రూ.13,093 కోట్ల నష్టం
అండర్ మైన్స్‌లో ఉత్పత్తి అయ్యే టన్ను బొగ్గుకు ఖర్చు రూ.10,394..
విక్రయిస్తే వచ్చేది రూ.4854 మాత్రమే
మరోవైపు భూగర్భ గనుల్లో గణనీయంగా తగ్గిన ఉత్పాదకత.. పెరిగిన వ్యయం
కార్మికులు, యంత్రాల పనిగంటలు పెంచితేనే నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం
దసరా సందర్భంగా కార్మికులకు వివరిస్తున్న సింగరేణి యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనులు సింగరేణి సంస్థకు గుదిబండగా మారాయి. ఈ గనులతో సంస్థ గత ఐదేళ్లలో రికార్డుస్థాయిలో రూ.13,093 కోట్ల నష్టాలను మూటగట్టు కుంది. ఈ గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.10,394 ఖర్చు అవుతుండగా, అమ్మకం ద్వారా రూ.4854 మాత్ర మే ఆదాయం వస్తోంది. భూగర్భ గనుల్లో 2019–20లో 86.65 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగగా, 2023–24లో 59 లక్షల టన్నులకు తగ్గిపోవడం సంస్థను మరింత కుంగదీస్తోంది.
మరోవైపు టన్ను బొగ్గు ఉత్పత్తి వ్యయం 2019–20లో రూ.5413 ఉండగా, 2024–25 నాటికి రూ.10,394కు పెరిగింది. అందులో రూ.7901 ఉద్యోగుల జీతభత్యాల వ్యయమే ఉండటం గమనార్హం. ఇదే కాలంలో అమ్మకం ధర టన్నుకు రూ.3135 నుంచి రూ.4854కు మాత్రమే పెరగడంతో ఏటేటా నష్టాల శాతం పెరిగిపోతోంది. ఉపరితల గనులు, బ్యాంకు డిపాజిట్ల వడ్డీలు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంతో వస్తున్న లాభాలతో భూగర్భ గనుల నష్టాలను పూడ్చుకొని సంస్థ నికర లాభాలను సాధిస్తోంది. డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క ఆదేశాలతో దసరా పండుగ సందర్భంగా సింగరేణివ్యాప్తంగా 40వేల మంది కార్మికులకు గత రెండు రోజులుగా సామూహిక విందు భోజనం ఏర్పాటు చేసి వారికీ ఈ విషయాలను అధికారులు వివరిస్తున్నారు.
ఉజ్వల సింగరేణి–కార్మికుల పాత్ర....
‘ఉజ్వల సింగరేణి–కార్మికుల పాత్ర’అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సింగరేణి ఆర్థిక పరిస్థితి, మార్కెట్‌లో తక్కువ ధరకు బొగ్గు అమ్ముతున్న ఇతర కంపెనీలతో ఎదుర్కొంటున్న సవాళ్లు, సింగరేణిలో ఉత్పత్తి ఖర్చును తగ్గించాల్సిన అవసరం, యంత్రాలను సమర్థంగా వినియోగించాల్సిన బాధ్యత, డ్యూటీ సమయం సద్వినియోగం అనే అంశాలపై గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి గనిలో వివరిస్తున్నారు. సింగరేణి బొగ్గుధర... కోల్ ఇండియా, ఇతర ప్రైవేట్ కంపెనీల కన్నా ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు దూరమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
⇒ మొత్తం 22 భూగర్భ గనులుండగా, 16 గనుల్లో ఎస్‌డీఎల్ యంత్రాలతో ఉత్పత్తి జరుగుతోంది. భూగర్భ గనుల ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఈ 16 గనుల్లోనే ఉంటోంది. భూగర్భ గనుల ఉద్యోగుల్లో 75 శాతం అనగా, 17,286 మంది ఈ గనుల్లోనే పనిచేస్తున్నారు. ఎస్‌డీఎల్ యంత్రాల పనిని రోజుకు 2 గంటలు పెంచితే 30 టన్నుల ఉత్పత్తి పెరిగి మొత్తం రోజువారీ ఉత్పత్తి 132 టన్నులకు చేరుతుంది. దీంతో నెలకు రూ.104 కోట్ల నష్టాలు తగ్గుతాయి.
⇒ 2008–09లో భూగర్భ గనుల్లో అత్యధికంగా రోజుకు 142 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, 2023–24లో 102 టన్నులకు తగ్గింది. కార్మికుల పనిగంటలూ 8.5 నుంచి 6.7కి పడిపోయాయి. ఈ రెండు గంటల ఉత్పత్తిని మళ్లీ పెంచితే రోజుకి 30 టన్నుల ఉత్పత్తి అదనంగా జరిగి మొత్తం రోజువారీ ఉత్పత్తి 132 టన్నులకు పెరుగుతుంది. ఉత్పత్తి కనీసం 20శాతం పెరిగినా నెలకు రూ.155 కోట్ల నష్టాలు తగ్గుతాయి.
⇒ వెస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్), మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(ఎంసీఎల్) విక్రయిస్తున్న బొగ్గు ధరలతో పోల్చితే సింగరేణి బొగ్గు ధరలు రెండింతలు అధికంగా ఉన్నాయి. ఉదాహరణకు టన్ను గ్రేడ్–5 బొగ్గును సింగరేణి రూ.5,685కు విక్రయిస్తుండగా, డబ్ల్యూసీఎల్, ఎంసీఎల్ సంస్థలు కేవలం రూ.2,970కే విక్రయిస్తున్నాయి.
⇒ రాబోయే ఏళ్లలో సింగరేణి సంస్థ కొత్తగా ఒక భూగర్భ గని, 6 భూ ఉపరితల గనులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటి నుంచి ఏటా 21.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీకే, జీడీకే 10, జేకే(రొంపేడు), గోలేటి, ఎంవీకే, పీవీఎన్‌ఆర్(వెంకటాపూర్) అనే ఉపరితల గనులతో పాటు కేటీకే ఓసీ–2 అనే భూగర్భ గని ఇందులో ఉంది. ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో ఈ ఏడాది నుంచే ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment