Essential commodities prices
-
ఆహార ధరలే ఆందోళనకరం
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్ర భుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాల ను ఎదుర్కొనడానికి నిత్యావసర వస్తువుల ధరల కదలికను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఇక్కడ జరిగిన ఒక మీడియా రౌండ్ టేబుల్ సమావేశంలో తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే.. రుతుపవనంలో 30 శాతం లోటు ఉన్నప్పటికీ ఖరీఫ్ పంటపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ► ఎల్‌నినో ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో ఆహార ద్రవ్యోల్బణం అంశాన్ని మనం ఇంకా జాగరూకతతో పరిశీలించాల్సి ఉంటుంది. ► ఇక ఇతర ఉత్పత్తుల విషయానికి వస్తే.. ఖరీఫ్, రబీ పంటలు ఎలా ఉంటాయన్న అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆయా అంశాలపై ఇప్పటికీ అనిశ్చితి నెలకొంది. ► గ్రామీణ డిమాండ్ భవిష్యత్ ఇప్పటికీ ఊహాజనితమైన అంశమే. అయితే వర్షాభావం వల్ల గ్రామీణ రంగం తీవ్రంగా ప్రభావితమైతే, అది డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► ప్రముఖ మ్యాగీ ఇన్స్టంట్ నూడుల్స్, కిట్‌కాట్ చాక్లెట్లు, నెస్కేఫ్ల ఉత్పత్తి దారైన నెస్లే ఇండియా... భారీ ఆఫర్లతో తన గ్రామీణ మార్కెట్‌ను విస్తరించుకోడానికి ప్రయతి్నస్తోంది. గ్రామీణ మార్కెట్ మొత్తం విక్రయాల్లో ఐదవ వంతు స్థానాన్ని సాధించింది. ఇది చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ, గణనీయమైన సానుకూల అంశం. స్థిర పురోగతిని సంస్థ సాధిస్తుందని భావిస్తున్నాం. జూన్ త్రైమాసికంలో సంస్థ మంచి గ్రామీణ డిమాండ్‌ను సంపాదించింది. ► అయితే పరిస్థితులు క్లిష్టంగా మారితే మా గ్రామీ ణ డిమాండ్‌పై సైతం ప్రతికూల ప్రభావం పడుతుంది. ► 2 నుంచి 6వ అంచె పట్టణాల్లో డిమాండ్ ఇప్పటికి సానుకూలంగా ఉంది. తీవ్ర ప్రతికూల పరిస్థితులు కనబడ్డం లేదు. ► సమస్యకు సంబంధించి చూస్తూ కూర్చోవడం ఎంతమాత్రం సమంజసం కాదు. సవాళ్లను ఎదుర్కొనడానికి నిరంతర చర్యలు కొనసాగాలి. డెయిరీపై దీర్ఘకాలిక ప్రభావం... డెయిరీ రంగంలో ధరల విషయాన్ని తీసుకుంటే.. తక్షణం ఏదో జరిగిపోతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయాన్ని, ప్రభావాలను పరిశీలించాలి. భవిష్యత్ ప్రభావాలు, పరిణామాల గురించి అధ్యయనం చేయాలి. సవాళ్లు ఇదే విధంగా కొనసాగితే, తక్షణ ప్రభావం చూపకపోయినా, 2024 నాటికి నిజంగా ఈ రంగంలో తీవ్ర సవాళ్లు ఉంటాయి. డెయిరీ రంగానికి సంబంధించి కోవిడ్ అనంతర ప్రభావాలపై మాట్లాడాలి. చర్మ వ్యాధులుసహా అనేక ఇతర సవాళ్లు ఉన్నాయి. ఈ సమస్యలకు ఇంకా పరిష్కారం కనుగొనాలి. అలాగే ఉత్పత్తి వ్యయం బాగా పెరిగింది. దాణా ధరలో 40 శాతం పెరుగుదల కనబడుతోంది. పరిశ్రమ ఇంతటి క్లిష్ట స్థితిని భవిష్యత్తులో ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది. పాల విషయంలో అనుకూల ప్రతికూల అంశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి నిల్వలు భారీగా అందుబాటులో ఉంటాయి. మరోసారి తగ్గిపోతాయి. ఆయా అంశాలన్నింటిపై అధ్యయనం చేసి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. -
Pakistan economic crisis: నిత్యావసరాలకూ కటకట
లాహోర్: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. ఏమీ కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదు, కొందామన్నా ఏమీ దొరికేటట్టు లేదు అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. తినే తిండికి కూడా కొరత ఏర్పడుతోంది. ప్రజలకు ప్రధాన ఆహారమైన గోధుమ పిండి లాహోర్‌లో దొరకడం లేదు. దీంతో ప్రజలు ఎనలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశీ నిల్వలు తరిగిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పంచదార, నూనె, నెయ్యి వంటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. 15 కేజీల గోధుమ పిండి బ్యాగ్ ఖరీదు రూ.2,050గా ఉంది. దేశవ్యాప్తంగా గోధుమపిండి, పంచదార, నెయ్యి, ధరలు 25 నుంచి 62 శాతం పెరిగాయి. నిత్యావసరాలపై సబ్సిడీలన్నీ ఎత్తేయడంతో ప్రజలపై ధరల పిడుగు పడింది. ద్రవ్యోల్బణం రేటు వారానికి 1.09 % చొప్పున పెరుగుతోంది! పాకిస్తానీలు వినియోగించే వంటనూనెలో 90 శాతం దిగుమతుల ద్వారా లభిస్తోంది. విదేశీ మారక నిల్వలు కేవలం మూడు వారాలకు సరిపడా మాత్రమే ఉండటంతో వంటనూనెను అత్యవసరాల జాబితా నుంచి తొలగించారు. మార్చిలో రంజాన్ మాసం ప్రారంభమవుతున్నందున నెయ్యి, నూనెల సరఫరాను చక్కదిద్దాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పడిపోతున్న రూపాయి విలువ అప్పుల కుప్పగా మారిపోయిన పాకిస్తాన్లో రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి 227కు పడిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 550 కోట్ల డాలర్లకు పరిమితమై ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి చేరాయి. పరిస్థితి ఆందోళనకరమేనని ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అంగీకరించారు. ఒక రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడిన ఆయన ‘‘పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థికంగా చాలా సంక్షోభంలో ఉంది. 2016లో ప్రభుత్వం మాకు అప్పగించినప్పడు విదేశీ ద్రవ్య నిల్వలు 2,400 బిలియన్ డాలర్లు ఉండేవి. ఇప్పుడు అవి కూడా మా దగ్గర లేవు. కానీ ఈ తప్పు నాది కాదు. వ్యవస్థది’’ అని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3 శాతం కంటే తక్కువగా వృద్ధి రేటు ఉంటుందనే అంచనాలున్నాయి. -
సెంచరీ దాటేసిన పెట్రోల్ ధర
సాక్షి, అమరావతి: పెట్రోల్ ధర సెంచరీ కొట్టడమే కాదు.. వంద దాటేసింది. డీజిల్ ధర కూడా దానివెంటే పరుగులు పెడుతూ రూ.వందకు చేరువైంది. విజయవాడలో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.101.11కి, డీజిల్ ధర రూ.95.34కి చేరాయి. గతేడాది జూన్ 1న విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.74.21, డీజిల్ రూ.68.15 ధర ఉండేవి. నాటి ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఏడాదిలో పెట్రోల్ లీటరుపై రూ.26.90, డీజిల్‌పై రూ.27.19 ధర పెరిగాయి. దీంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. ఇది నిత్యావసర సరుకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్రో ధరలపై 2017లో కేంద్రం నియంత్రణ ఎత్తేసింది. దాంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రో ఉత్పత్తి సంస్థలు ఏ రోజుకారోజు సమీక్షించి.. పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తున్నాయి. రిఫైనరీ నుంచి ప్రాంతాల దూరాన్ని బట్టి.. రవాణా ఖర్చులను కలిపి ఆయా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఉత్పత్తి సంస్థలు ఖరారు చేస్తాయి. అయితే, ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నాటికి రాష్ట్రంలో వైఎస్సార్, ప్రకాశం విశాఖపట్నం జిల్లాలు మినహా పది జిల్లాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. డీజిల్ ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లోనే డీజిల్ ధర కూడా రూ.వంద దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పెట్రో డీలర్లు చెబుతున్నారు. -
బడ్జెట్ 2020 : ధరలకు చెక్ పెడతారిలా..!
సాక్షి, న్యూఢిల్లీ : ఉల్లిగడ్డలు, టమాట వంటి ధరలు కొండెక్కడంతో పాటు నిత్యావసరాల ధరలు నింగినంటుతూ ద్రవ్యోల్బణం చుక్కలు చూపుతున్న వేళ వీటిని కిందికి దించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో పలు చర్యలు ప్రకటించారు. ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటుతో పాటు ఆయా పంటల దిగుబడులను పెద్ద ఎత్తున చేపట్టేలా ప్రభుత్వం ప్రోత్సాహక చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ధరలను నియంత్రించేలా ఆహారోత్పత్తులను పెంచేందుకు ఉత్పాదకత మెరుగయ్యేలా రైతులకు కనీస మద్దతు ధర వంటి రాయితీలను ప్రకటించామని చెప్పారు. ఉద్యానవన పంటల మిషన్ (ఎంఐడీహెచ్), ఆయిల్‌సీడ్స్ జాతీయ మిషన్ (ఎన్‌ఎంఓఓపీ) వంటి ప్రత్యేక చర్యల ద్వారా నిత్యావసరాలు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిని పెంపొందిస్తామని తెలిపారు. చదవండి : పాత విధానమా? కొత్త విధానమా? మీ ఇష్టం! -
సామాన్యులకు ధరాఘాతం
సాక్షి, అమరావతి: కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్న వినియోగదారులకు వాటి ధరలు చూసి గుండెల్లో దడ పుడుతోంది. భారీగా పెరిగిన ధరలతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే వణికిపోతున్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, దీనికి తోడు కూరగాయల ధరలపై నియంత్రణ కూడా లేకపోవడంతో వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. మరోవైపు ఏటా వేసవిలో కూరగాయల ధరలు పెరగడం పరిపాటేనంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అయితే, ఆ మేరకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. కూరగాయల రవాణా చార్జీలు, దళారుల కమీషన్లు కలిపి మార్కెట్లో అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తూ సామాన్యుల నడ్డి విరగ్గొడుతున్నారు. రాయితీ ధరలకు అందించాల్సి ఉన్నా.. సాధారణంగా కూరగాయలు వంటి నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం రైతుబజార్లలోప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రాయితీ ధరలకు అందించేలా ఏర్పాట్లు చేయాలి. అయితే, విజయవాడ హైస్కూలు రోడ్డులో ఉన్న రైతుబజార్లో పట్టికలో తక్కువ ధర చూపుతూ ఎక్కువ ధర వసూలు చేస్తుండటం గమనార్హం. రైతుబజార్లలో రైతులకు బదులుగా ఎక్కువ మంది వ్యాపారులే తిష్టవేసి ఉంటున్నారు. టమోట, పచ్చి మిర్చి తదితరాలను రైతుబజార్లో విక్రయించకుండా అక్కడే బయట రోడ్డు పక్కన అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. వినియోగదారులు ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే.. ‘అవసరమైతే తీసుకోండి.. లేకపోతే పోండి’ అంటూ అక్కడి వ్యాపారులు కసిరికొడుతున్నారు. టమోట, పచ్చి మిర్చి, చిక్కుడు, బీన్స్, క్యాప్సికం ఇలా ఒకటేమిటి దాదాపు అన్ని కూరగాయలు వినియోగదారులను హడలెత్తిస్తున్నాయి. 10 రోజుల కిందట విజయవాడ రైతుబజార్లో కిలో రూ.15 ఉన్న టమోట ప్రస్తుతం రూ.32కు, పచ్చి మిర్చి రూ.20 నుంచి రూ.40కు, క్యారెట్ రూ.12 నుంచి రూ.34కు పెరిగింది. ఇలా ఏ కూరగాయలు ముట్టుకున్నా రెట్టింపు ధర పలుకుతూ షాక్ కొడుతున్నాయి. అధికారుల వాదన ఇలా.. అధికారుల వాదన మరోలా ఉంది. స్థానికంగా కాకుండా సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండటం వల్లే ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. రైతుబజార్ ధరల కంటే కనీసంగా కిలోకు రూ.15 నుంచి రూ.20 ఎక్కువగా బయట మార్కెట్లో, చిల్లర దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ వన్‌టౌన్ కూరగాయల మార్కెట్‌కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు టన్నుల్లో కూరగాయలు తెస్తుంటారు. ఇక్కడ రైతుబజార్ లేదు. దీంతో బహిరంగ మార్కెట్లోని ధరలకు కొనుగోలు చేయాల్సి రావడంతో సామాన్యులు కూరగాయలు కొనలేక, పచ్చడి మెతుకులు తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నలుగురు ఉండే కుటుంబం నాలుగు రకాల కూరగాయలను కొనుగోలు చేయాలంటే వారానికి రూ.300పైనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దండుకుంటున్న దళారులు, వ్యాపారులు దళారులు, వ్యాపారులు భారీగా దండుకుంటున్నా పండించిన రైతుకు మాత్రం కనీస ధర కూడా లభించడం లేదు. వేసవి నేపథ్యంలో భూగర్భ జలాలు ఎండిపోయినా ఎన్నో తిప్పలు పడి సాగు చేసిన రైతుకు రిక్తహస్తమే ఎదురవుతోంది. అయితే, సాగునీటి సమస్యతో చాలా మంది రైతులు కూరగాయలను సాగు చేయడం లేదని, దీంతో ఏటా వేసవిలో ధరలు పెరుగుతున్నాయని రైతుబజార్‌లోని కయదారులు అంటున్నారు. కూరగాయల ధరలు పెరగడంతో రోజూ కూలికి పోతేగాని పూట గడవనివారు 15 రోజులుగా మార్కెట్‌కు వెళ్లడమే మానేశారని నారాయణమ్మ అనే మహిళ వెల్లడించింది. రైతుబజార్లలో ఉన్న ధరల పట్టికల్లో చూపుతున్న ధరలకు, విక్రయిస్తున్న ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని పలువురు వినియోగదారులు పేర్కొన్నారు. -
ఉద్యోగుల కనీస వేతనం రూ. 9,880
సాక్షి, హైదరాబాద్: తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఉద్యోగి నెలవారీ (26 పనిదినాలకు) కనీస వేతనం రూ. 9,880గా ఉండాలని జాతీయ కనీస వేతన నిపుణుల కమిటీ నిర్ధారించింది. దేశంలో ఉద్యోగుల కనీస వేతన ఖరారుపై కేంద్ర కార్మికశాఖ గతంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటించిన నిపుణుల కమిటీ... జాతీయ స్థాయిలో ఐదు రీజియన్లను గుర్తించగా తెలుగు రాష్ట్రాలను రెండో రీజియన్‌లో చేర్చింది. జూలై 2018 నాటి స్థానిక పరిస్థితులు, ధరల సూచీలు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకున్న నిపుణుల కమిటీ కనీస వేతనాన్ని నిర్ధారించింది. 2012 కంటే ముందు జాతీయ స్థాయిలో ఉద్యోగి కనీస వేతనం రూ. 4,570గా ఉండేది. గత ఏడేళ్లలో జీవన వ్యయంలో భారీ మార్పులు వచ్చాయి. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో వేతన సవరణ చేయాలని నిర్ణయించిన కేంద్రం ఆ మేరకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి కనీస వేతన మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ఈ మేరకు పూర్తిస్థాయి నివేదికను ఇటీవల కేంద్ర కార్మిక శాఖకు అందజేసింది. కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రం కనీస వేతన విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. తక్కువ వేతనం ఉండొద్దు... జాతీయ కనీసవేతన నిపుణుల కమిటీ సూచన ప్రకారం ఉద్యోగికి నిర్దేశిత వేతనం కంటే తక్కువగా ఉండొద్దు. తక్కువ వేతనమున్న ఉద్యోగులకు సదరు కంపెనీ యాజమాన్యం నిర్దేశిత వేతనాన్ని ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల నిర్దేశిత వేతనం కంటే ఎక్కువగా చెల్లిస్తే మాత్రం వేతన పెంపు యాజమాన్య నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. -
మధ్య 'ధర' గతి
సాక్షి, అమరావతి: కూరగాయల ధరాఘాతానికి పేదలు, మధ్యతరగతి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. చుక్కల్లోంచి దిగిరాని ధరలను చూసి కలవరపడుతున్నారు. మొన్నటి వరకూ అయిదారు రూపాయలున్న కొత్తి మీర కట్ట నేడు రూ.40కి ఎగసింది. రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల్లో కిలో క్యారెట్ రూ.60, టమాట రూ. 50, చిక్కుడు రూ.75, బీన్స్ రూ.80 పలుకుతున్నాయి. కిలో రూ.40 – 45 పెట్టినా నాణ్యమైన ఉల్లిపాయలు దొరకడం లేదు. కూరగాయల ధరలు వింటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయని అల్పాదాయ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. నెల కిందట కిలో రూ.10 ఉన్న ఉల్లి నేడు రూ.40 – 45 పలుకుతోంది. బెండ రూ.15 – 20 నుంచి రూ.40కి ఎగబాకింది. కిలో రూ. 15 – 20 ఉన్న టమాటా ధర నేడు ఏకంగా రూ.50కి చేరింది. ప్రాంతాన్ని, కాయల నాణ్యతను బట్టి ధరల్లో కొంత వ్యత్యాసం ఉంది. మొన్నటి వరకూ రూ.5కు ఇచ్చిన తోటకూర కట్ట ఇప్పుడు రూ.10 నుంచి 15కు పెరిగింది. వర్షాకాలంలో ధరలు తగ్గాలి కానీ.. సాధారణంగా వర్షాకాలంలో కూరగాయలు, ఆకుకూరల ధరలు చౌకగా ఉంటాయి. ప్రస్తుతం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇరవై రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు తదితర జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగైన టమాటా తోటల్లోని కాయలు ఎడతెరపిలేని వర్షాలకు రాలిపోయాయి.. కుళ్లిపోయాయి. మిరప, బెండ, వంగ తదితర తోటలు కూడా వర్షాలకు దెబ్బతిన్నాయి. క్యారెట్, బీన్స్ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వస్తున్నాయి. అక్కడ కూడా వర్షాల కారణంగా తోటలు పాడై దిగుబడి పడిపోయింది. కార్తీక మాసం రాకతో చాలామంది అయ్యప్ప, శివమాలలు ధరించారు. వీరంతా శాఖాహారమే తీసుకుంటున్నారు. దీంతో కూరగాయలు, ఆకు కూరలకు గిరాకీ మరింత పెరిగింది. ఉల్లి ధర.. రెండు రెట్లు పెరుగుదల మన రాష్ట్రానికి మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది. రాష్ట్రంలోని కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో కూడా ఉల్లి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. సెప్టెంబర్‌తో ముగిసిన ఖరీఫ్ సీజన్లో మొదట వర్షాభావం వల్ల తక్కువ విస్తీర్ణంలోనే ఉల్లి సాగైంది. ఈ కొద్దిపాటి పంట కోత దశకు వచ్చిన సమయంలో గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాడైంది. ఉల్లి గడ్డలు పొలాల్లోనే కుళ్లిపోయాయి. మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. దీంతో 20 రోజుల కిందట ఉన్న ధరలతో పోల్చితే ఉల్లి ధర రెండు రెట్లు పెరిగింది. డిమాండ్, సప్లయిల మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడటంవల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయల ధరలు ఇంకా పెరుగుతాయంటున్నారు. డిమాండ్‌ను, కొరతను సాకుగాచూపి వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచారనే విమర్శలూ ఉన్నాయి. పట్టించుకోని సర్కార్ సాధారణంగా కూరగాయలు వంటి నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి రాయితీ ధరలకు కూరగాయలను అందించే ఏర్పాట్లు చేయాలి. ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధిని వినియోగించాలి. రైతుల నుంచి మార్కెట్ రేటుకు ప్రభుత్వం కూరగాయలు కొనుగోలు చేసి సబ్సిడీ ధరలతో వినియోగదారులకు అందించే ఏర్పాట్లు చేయాలి అయితే ప్రస్తుతం కూరగాయల ధరలు మండుతున్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై పేద మధ్యతరగతి వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నాయి. కిలో దొండకాయలు 40 రూపాయలు.. వీటి రేటు ఎక్కువగా ఉంది కదాని వంకాయలు కొందామనుకుంటే దొండకాయని మించిపోయి రూ.60 పలుకుతోంది. ఆకు కూరల ధరలూ అందేలా లేవు. ఉల్లి ధరైతే ఉరుకులు పరుగులు పెడుతోంది. చుక్కలనంటి దిగిరానంటోంది.. నెల కిందట కిలో పట్టుమని పది రూపాయలు కూడా లేని ఉల్లి.. నేడు 40 రూపాయలకు చేరింది. ఇక టమాటాదీ అదే బాట.. -
అర్ధాకలి..
♦ ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు.. ♦ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై ప్రభావం ♦ వసతి గృహాల మెనూ భారమే.. ♦ కడుపుమాడ్చుకుంటున్న విద్యార్థులు సత్తెనపల్లి/క్రోసూరు : పప్పుల రేట్లు పైపైకి ఎగబాకుతున్నాయి. ఉల్లి కొనబోతే ఉసూరనిపిస్తోంది. కోడిగుడ్డు ధర అమాంత పెరిగింది. ఈ ధరాభారం పరోక్షంగా విద్యార్థులపై పడుతోంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ కష్టంగా మారుతోంది. మరోవైపు సంక్షేమ హాస్టళ్లలో చాలీచాలని తిండితో పిల్లలు కడుపుమాడ్చుకుంటున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణకు పాఠశాలలో భోజనం చేసే ప్రతి విద్యార్థికి మొత్తాన్ని లెక్క కట్టి నిధులు విడుదల చేస్తారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థికి రూ.4.60, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.6.38తో పాటు అదనంగా బియ్యం ఇస్తారు. ప్రాథమిక పాఠశాలలో ప్రతి విద్యార్థికి 100 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 150 గ్రాములు బియ్యం అందిస్తారు. పప్పులు రూ.100కుపైగా, ఉల్లిపాయలు కిలో రూ.60 నుంచి రూ.80, కోడిగుడ్డు రూ.5 ధర పలుకుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం ఒక టీకి రూ.6 ధర ఉండగా.. విద్యార్థి భోజనానికి ఇచ్చే రూ.4.60 ఏం సరిపోతుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. హాస్టళ్లలో దారుణం.. నిత్యావసర సరుకులు ధరలు అన్నీ ఆకాశంలో ఉన్నా ప్రభుత్వం సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు చెల్లించే అరకొర భత్యంలోనే భోజనాలు పెడుతున్నారు. హాస్టల్ విద్యార్థుల కోసం 3వ తరగతి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థికి నెలకు రూ.750, ఎనిమిది నుండి పదో తరగతి వరకు రూ.850 ఇస్తారు. అంటే రోజుకు విద్యార్థికి రూ.25, రూ.28 ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంట్లో ఉదయం పూట అల్పాహారం, రాత్రి భోజనం పెడుతున్నారు. మధ్యాహ్న భోజనం పాఠశాలలో ఉంటుంది. ఉదయం పూట రాగిజావ, వారంలో ఐదురోజులుపాటు కోడిగుడ్లు, గుగ్గిళ్లు, వేరుశనగ ముద్దలు, అరటిపండు వారంలో ఒకటి, రెండుసార్లు అందించాలి. ఈ లెక్కన చూస్తే విదార్థికి కనీసంగా, అత్యల్పంగా రోజుకి రూ.50 తక్కువ ఖర్చుకాదు. హాస్టల్ వార్డెన్లు మాత్రం అన్నీ పెడుతున్నామని చెబుతున్నారు. కోడిగ్రుడ్డు ధర హోల్‌సేల్‌గా రూ.4 పలుకుతుండగా, అరటికాయ 2.50 ఖర్చుఅవుతుంది. ప్రస్తుతం ధరలు నింగినంటుతుంటే ప్రభుత్వం సంక్షేమవసతి గృహవిద్యార్థుల భోజనాల కోసం చాలా తక్కువ చెల్లించి సరిపెడుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సరైన పోషకాలు లేకుంటే విద్యార్థుల ఆరోగ్యాలు పాడవుతాయని వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం పేద, వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు. -
కొండెక్కిన నిత్యావసరాల ధరలు