
సాక్షి, అమరావతి: పెట్రోల్ ధర సెంచరీ కొట్టడమే కాదు.. వంద దాటేసింది. డీజిల్ ధర కూడా దానివెంటే పరుగులు పెడుతూ రూ.వందకు చేరువైంది. విజయవాడలో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.101.11కి, డీజిల్ ధర రూ.95.34కి చేరాయి. గతేడాది జూన్ 1న విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.74.21, డీజిల్ రూ.68.15 ధర ఉండేవి. నాటి ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఏడాదిలో పెట్రోల్ లీటరుపై రూ.26.90, డీజిల్‌పై రూ.27.19 ధర పెరిగాయి. దీంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. ఇది నిత్యావసర సరుకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్రో ధరలపై 2017లో కేంద్రం నియంత్రణ ఎత్తేసింది. దాంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రో ఉత్పత్తి సంస్థలు ఏ రోజుకారోజు సమీక్షించి.. పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తున్నాయి.
రిఫైనరీ నుంచి ప్రాంతాల దూరాన్ని బట్టి.. రవాణా ఖర్చులను కలిపి ఆయా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఉత్పత్తి సంస్థలు ఖరారు చేస్తాయి. అయితే, ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నాటికి రాష్ట్రంలో వైఎస్సార్, ప్రకాశం విశాఖపట్నం జిల్లాలు మినహా పది జిల్లాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. డీజిల్ ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లోనే డీజిల్ ధర కూడా రూ.వంద దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పెట్రో డీలర్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment