బంకు.. చూస్తే జంకు | Petrol and diesel prices at all time record in Both Telugu States | Sakshi
Sakshi News home page

బంకు.. చూస్తే జంకు

Published Sat, Sep 8 2018 1:28 AM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM

Petrol and diesel prices at all time record in Both Telugu States - Sakshi

ముఖ్య నగరాలలో శుక్రవారం పెట్రోల్, డీజిల్‌ ధరలు (లీటర్‌/ రూ.లలో)

సాక్షి,హైదరాబాద్‌: పెట్రోలు బంకు అంటేనే జనం జంకాల్సిన పరిస్థితి వచ్చింది.  తెలుగు రాష్ట్రాల్లో పెట్రో, డీజిల్‌ ధర పైసా పైసా పెరుగుతూ చుక్కలు చూపిస్తోంది. రోజువారీ ధరల సవరణ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో డీజిల్‌ ధరలు దేశంలోనే రికార్డు సృష్టిస్తుండగా పెట్రోల్‌ ధరలో మాత్రం ముంబై తర్వాత రెండో స్ధానంలో ఆల్‌టైం రికార్డుగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరుగుదల, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం మధ్య వరుసగా గత పన్నెండు రోజుల్లో ఇంధన ధరలు పైకి ఎగబాకుతున్నాయి. ధరల సవరణ విషయంలో మధ్యలో ఒక రోజు విరామం ఇచ్చిన చమురు మార్కెటింగ్‌ సంస్ధలు మళ్లీ విజృంభించాయి. దీంతో ఇప్పటికే ఆల్‌టైమ్‌ హై రికార్డు వద్ద కదలాడుతున్న ధరలు మరింత పెరిగాయి. చమురు సంస్థలు ప్రజలకు నొప్పి తెలియకుండా రోజువారీ ధరల సవరణలతో సైలెంట్‌గా బాదేస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్‌ ధరలను సమీక్షించిన చమురు సంస్థలు.. కిందటేడాది ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు ధరలను నిర్ణయిస్తున్నాయి.  

పన్నుల మోతనే.. 
పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోతే కారణంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ (విలువ ఆధారిత పన్ను) విధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ కింద పెట్రోల్‌పై రూ. 21.48 లు, డీజిల్‌పై రూ.17.33 వసూలు చేస్తోంది. ఆ తర్వాత మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ పన్ను మోత మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాలు పెట్రోల్‌ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్‌ పన్నుల విధింపులో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31శాతం వ్యాట్‌ విధిస్తున్నప్పటికీ ప్రతి లీటర్‌పై రూ.4 అదనపు వ్యాట్‌ వసూలు చేస్తుండటంతో 38.82 శాతానికి చేరింది. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై రూ.4 అదనపు వ్యాట్‌ వసూలు చేస్తుండటంతో 30.71 శాతానికి చేరింది. తెలంగాణలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌ 27 శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి సగటున పెట్రోల్‌పై 57 శాతం. డీజిల్‌పై 44 శాతం పన్నుల భారం పడుతోంది. 

క్రూడాయిల్‌ దూకుడు. 
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర ఎగబాగుతోంది. మార్కెట్‌లో ఇండియన్‌ క్రూడ్‌ బాస్కెట్‌ ధర రూ.4,872లకు చేరింది. ఒక బాస్కెట్‌ (బ్యారెల్‌)లో 159 లీటర్లు చమురు ఉంటుంది. ఈ లెక్కన లీటర్‌ చమురు ధర రూ.30.64. క్రూడాయిల్‌ రీఫైనింగ్, రవాణా ఖర్చులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల మోతతో చమురు ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌ ధరల్లో దాదాపు సగానికిపైగా పన్నుల భారం వినియోగదారుల మీద పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు గతంలో తగ్గినా పెట్రో ధరలు మాత్రం తగ్గలేదు. తాజాగా పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరలకు తోడు పెట్రోల్, డీజిల్‌ ధరల రోజువారీ సవరణ మరింత ఆందోళనకరంగా తయారైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement