సాక్షి, అమరావతి: కూరగాయల ధరాఘాతానికి పేదలు, మధ్యతరగతి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. చుక్కల్లోంచి దిగిరాని ధరలను చూసి కలవరపడుతున్నారు. మొన్నటి వరకూ అయిదారు రూపాయలున్న కొత్తి మీర కట్ట నేడు రూ.40కి ఎగసింది. రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల్లో కిలో క్యారెట్ రూ.60, టమాట రూ. 50, చిక్కుడు రూ.75, బీన్స్ రూ.80 పలుకుతున్నాయి. కిలో రూ.40 – 45 పెట్టినా నాణ్యమైన ఉల్లిపాయలు దొరకడం లేదు. కూరగాయల ధరలు వింటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయని అల్పాదాయ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. నెల కిందట కిలో రూ.10 ఉన్న ఉల్లి నేడు రూ.40 – 45 పలుకుతోంది. బెండ రూ.15 – 20 నుంచి రూ.40కి ఎగబాకింది. కిలో రూ. 15 – 20 ఉన్న టమాటా ధర నేడు ఏకంగా రూ.50కి చేరింది. ప్రాంతాన్ని, కాయల నాణ్యతను బట్టి ధరల్లో కొంత వ్యత్యాసం ఉంది. మొన్నటి వరకూ రూ.5కు ఇచ్చిన తోటకూర కట్ట ఇప్పుడు రూ.10 నుంచి 15కు పెరిగింది.
వర్షాకాలంలో ధరలు తగ్గాలి కానీ..
సాధారణంగా వర్షాకాలంలో కూరగాయలు, ఆకుకూరల ధరలు చౌకగా ఉంటాయి. ప్రస్తుతం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇరవై రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు తదితర జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగైన టమాటా తోటల్లోని కాయలు ఎడతెరపిలేని వర్షాలకు రాలిపోయాయి.. కుళ్లిపోయాయి. మిరప, బెండ, వంగ తదితర తోటలు కూడా వర్షాలకు దెబ్బతిన్నాయి. క్యారెట్, బీన్స్ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వస్తున్నాయి. అక్కడ కూడా వర్షాల కారణంగా తోటలు పాడై దిగుబడి పడిపోయింది. కార్తీక మాసం రాకతో చాలామంది అయ్యప్ప, శివమాలలు ధరించారు. వీరంతా శాఖాహారమే తీసుకుంటున్నారు. దీంతో కూరగాయలు, ఆకు కూరలకు గిరాకీ మరింత పెరిగింది.
ఉల్లి ధర.. రెండు రెట్లు పెరుగుదల
మన రాష్ట్రానికి మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది. రాష్ట్రంలోని కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో కూడా ఉల్లి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. సెప్టెంబర్‌తో ముగిసిన ఖరీఫ్ సీజన్‌లో మొదట వర్షాభావం వల్ల తక్కువ విస్తీర్ణంలోనే ఉల్లి సాగైంది. ఈ కొద్దిపాటి పంట కోత దశకు వచ్చిన సమయంలో గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాడైంది. ఉల్లి గడ్డలు పొలాల్లోనే కుళ్లిపోయాయి. మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. దీంతో 20 రోజుల కిందట ఉన్న ధరలతో పోల్చితే ఉల్లి ధర రెండు రెట్లు పెరిగింది. డిమాండ్, సప్లయిల మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడటంవల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయల ధరలు ఇంకా పెరుగుతాయంటున్నారు. డిమాండ్‌ను, కొరతను సాకుగాచూపి వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచారనే విమర్శలూ ఉన్నాయి.
పట్టించుకోని సర్కార్
సాధారణంగా కూరగాయలు వంటి నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి రాయితీ ధరలకు కూరగాయలను అందించే ఏర్పాట్లు చేయాలి. ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధిని వినియోగించాలి. రైతుల నుంచి మార్కెట్ రేటుకు ప్రభుత్వం కూరగాయలు కొనుగోలు చేసి సబ్సిడీ ధరలతో వినియోగదారులకు అందించే ఏర్పాట్లు చేయాలి అయితే ప్రస్తుతం కూరగాయల ధరలు మండుతున్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై పేద మధ్యతరగతి వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నాయి.
కిలో దొండకాయలు 40 రూపాయలు.. వీటి రేటు ఎక్కువగా ఉంది కదాని వంకాయలు కొందామనుకుంటే దొండకాయని మించిపోయి రూ.60 పలుకుతోంది. ఆకు కూరల ధరలూ అందేలా లేవు. ఉల్లి ధరైతే ఉరుకులు పరుగులు పెడుతోంది. చుక్కలనంటి దిగిరానంటోంది.. నెల కిందట కిలో పట్టుమని పది రూపాయలు కూడా లేని ఉల్లి.. నేడు 40 రూపాయలకు చేరింది. ఇక టమాటాదీ అదే బాట..
Comments
Please login to add a commentAdd a comment