=చుక్కలనంటుతున్న ధరలు
=కొండెక్కిన టమాట, ఉల్లి ధరలు
=లబోదిబోమంటున్న వినియోగదారులు
సాక్షి, తిరుపతి: కూరగాయలను ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయి. వాటి ధరలు చుక్కలనంటుతుండడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా టమాట, ఉల్లిపాయల ధరలు కన్నీరు తెప్పిస్తున్నాయి. కూర చేయాలంటే అవి తప్పనిసరి కావడంతో గతంలో కిలో కొనేవారు ప్రస్తుతం పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. జిల్లాలో కూరగాయల ధరలు వినియోగదారులు భయపడే స్థాయికి చేరుకున్నాయి.
ఒక పూట కూర చేయాలంటే కనీసం రూ.100 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, నగరి ప్రాంతాల్లో వాటి ధరలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. కిలో ఉల్లిపాయలు రూ.60 పలుకుతున్నాయి. కిలో టమాటాలు కొనాలంటే రూ.60 నుంచి 65 వరకు వెచ్చించాల్సి వస్తోంది.
క్యారెట్ రూ.55, బీన్స్ రూ.60, వంకాయలు రూ.40, బీరకాయ రూ.40, బెండకాయలు రూ.35 నుంచి రూ.40కు అమ్ముతున్నారు. కొత్తిమీర, కరివేపాకు కట్ట రూ.20 పలుకుతోంది. గతంలో రూపాయి ఇస్తే కొత్తిమీర కరివేపాకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఐదు రూపాయలు ఇస్తేగానీ రావడం లేదు. అల్లందీ అదే పరిస్థితి. మధ్య తరగతి, పేద ప్రజలు ఇంత మ్తొతంలో కూరగాయలకు డబ్బు కేటాయించలేక రసం, మజ్జిగతో సరిపెట్టుకుంటున్నారు.
పై-లీన్, సమైక్య సమ్మే కారణమంటున్న వ్యాపారులు
కూరగాయల ధరలు పెరగడానికి సమైక్య సమ్మె, పై-లీన్ తుపానే కారణమని వ్యాపారులు అంటున్నారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలో కూరగాయల పంటలు ఎక్కువగా ఉంటాయని, పై-లీన్ తుపాను కారణంగా అక్కడ దెబ్బతినడంతో దిగుమతి తగ్గిందని తెలిపారు. రైతు బజార్‌లోని ఉల్లిపాయల వ్యాపారి గణేష్ మాట్లాడుతూ ఉల్లిపాయలు గతనెల కిలో రూ.30 నుంచి రూ.40 వరకు వచ్చిందన్నారు.
గడిచిన వారం రోజుల్లో రూ.60కు చేరుకుందని పేర్కొన్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పంట తక్కువగా ఉండడంతో ధరలు పెరిగాయని అన్నారు. తమిళనాడు నుంచి కూడా దిగుమతి తగ్గిందని తెలిపారు. టమాట వ్యాపారి శంకర్ మాట్లాడుతూ కర్ణాటకలో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల బెంగళూరు నుంచి రావాల్సిన టమాటాలు ఆగిపోయాయన్నారు. అందువల్లే రేట్లు పెరిగాయని చెప్పారు. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో సాధారణంగానే కూరగాయల ధరలు పెరుగుతాయని, దీపావళి వరకు ధరలు తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు.