అర్ధాకలి..
♦ ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు..
♦ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై ప్రభావం
♦ వసతి గృహాల మెనూ భారమే..
♦ కడుపుమాడ్చుకుంటున్న విద్యార్థులు
సత్తెనపల్లి/క్రోసూరు : పప్పుల రేట్లు పైపైకి ఎగబాకుతున్నాయి. ఉల్లి కొనబోతే ఉసూరనిపిస్తోంది. కోడిగుడ్డు ధర అమాంత పెరిగింది. ఈ ధరాభారం పరోక్షంగా విద్యార్థులపై పడుతోంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ కష్టంగా మారుతోంది. మరోవైపు సంక్షేమ హాస్టళ్లలో చాలీచాలని తిండితో పిల్లలు కడుపుమాడ్చుకుంటున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణకు పాఠశాలలో భోజనం చేసే ప్రతి విద్యార్థికి మొత్తాన్ని లెక్క కట్టి నిధులు విడుదల చేస్తారు.
ప్రాథమిక పాఠశాలల విద్యార్థికి రూ.4.60, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.6.38తో పాటు అదనంగా బియ్యం ఇస్తారు. ప్రాథమిక పాఠశాలలో ప్రతి విద్యార్థికి 100 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 150 గ్రాములు బియ్యం అందిస్తారు. పప్పులు రూ.100కుపైగా, ఉల్లిపాయలు కిలో రూ.60 నుంచి రూ.80, కోడిగుడ్డు రూ.5 ధర పలుకుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం ఒక టీకి రూ.6 ధర ఉండగా.. విద్యార్థి భోజనానికి ఇచ్చే రూ.4.60 ఏం సరిపోతుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
హాస్టళ్లలో దారుణం..
నిత్యావసర సరుకులు ధరలు అన్నీ ఆకాశంలో ఉన్నా ప్రభుత్వం సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు చెల్లించే అరకొర భత్యంలోనే భోజనాలు పెడుతున్నారు. హాస్టల్ విద్యార్థుల కోసం 3వ తరగతి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థికి నెలకు రూ.750, ఎనిమిది నుండి పదో తరగతి వరకు రూ.850 ఇస్తారు. అంటే రోజుకు విద్యార్థికి రూ.25, రూ.28 ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంట్లో ఉదయం పూట అల్పాహారం, రాత్రి భోజనం పెడుతున్నారు. మధ్యాహ్న భోజనం పాఠశాలలో ఉంటుంది. ఉదయం పూట రాగిజావ, వారంలో ఐదురోజులుపాటు కోడిగుడ్లు, గుగ్గిళ్లు, వేరుశనగ ముద్దలు, అరటిపండు వారంలో ఒకటి, రెండుసార్లు అందించాలి.
ఈ లెక్కన చూస్తే విదార్థికి కనీసంగా, అత్యల్పంగా రోజుకి రూ.50 తక్కువ ఖర్చుకాదు. హాస్టల్ వార్డెన్లు మాత్రం అన్నీ పెడుతున్నామని చెబుతున్నారు. కోడిగ్రుడ్డు ధర హోల్‌సేల్‌గా రూ.4 పలుకుతుండగా, అరటికాయ 2.50 ఖర్చుఅవుతుంది. ప్రస్తుతం ధరలు నింగినంటుతుంటే ప్రభుత్వం సంక్షేమవసతి గృహవిద్యార్థుల భోజనాల కోసం చాలా తక్కువ చెల్లించి సరిపెడుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సరైన పోషకాలు లేకుంటే విద్యార్థుల ఆరోగ్యాలు పాడవుతాయని వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం పేద, వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.