ఆహార ధరలు క్రాష్: ద్రవ్యోల్బణం మరింత కిందకి
ఆహార ధరలు క్రాష్: ద్రవ్యోల్బణం మరింత కిందకి
Published Wed, Jun 14 2017 2:19 PM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
న్యూఢిల్లీ : టోకుధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) కూడా ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. ఆహార ధరలు భారీగా పడిపోవడంతో మే నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.17 శాతంగా నమోదైంది. గత నెలలో ఈ ద్రవ్యోల్బణం 3.85 శాతంగా ఉంది. పప్పులు, తృణధాన్యాల ధరల్లో వృద్ధి కూడా చాలా తక్కువగా నమోదైందని నేడు ప్రభుత్వం విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) కూడా ఇటీవల రికార్డు కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. అది కూడా 2.18 శాతానికి పడిపోయింది. ఈ రెండు సూచీలు దిగిరావడంతో ఆర్బీఐ రేట్ల కోత అంచనాలు పెరుగుతున్నాయి. ఆగస్టులో కచ్చితంగా ఆర్బీఐ రేట్లలో కోత పెట్టవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటాలో ఆహార ధరల ముఖ్యంగా బంగాళదుంపలు, పప్పులు, ఉల్లిపాయల ధరలు వరుసగా మూడో నెలలో కూడా కిందకి పడిపోయినట్టు తెలిసింది. ఈ సూచీలో ఇవి ప్రైమరీ ఆర్టికల్స్ గా ఉంటాయి. మే నెలలో ఆహారోత్పత్తుల దరలు 2.27 శాతానికి పడిపోయాయి. కూరగాయలు ధరలు -18.51 శాతంగా నమోదయ్యాయి. బంగాళదుంపలు ధరలు కూడా 44.36 శాతం డీప్లేషన్ లో ఉన్నాయి. ఉల్లిపాయల రేట్లు 12.86 శాతం కిందకి పడిపోయినట్టు వెల్లడైంది. అయితే గతేడాది -14.78శాతంగా ఉన్న ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది 11.69 శాతం పైకి ఎగిసింది. కొత్త బేస్ ఇయర్ 2011-12 ఆధారితంగా ఈ ద్రవ్యోల్బణాన్ని గణించారు.
Advertisement