
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు బుధవారం మొదలైన ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడ్డాయి. www.mcc.nic.in వెబ్‌సైట్ మొరాయించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ మొదలు కావాల్సి ఉండగా, సాయంత్రం వరకు వెబ్‌సైట్ మొరాయించడంతో ఈ పరిస్థితి నెలకొంది. నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించగా, కౌన్సెలింగ్ ప్రక్రియను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నిర్వహిస్తుంది. వెబ్‌సైట్ మొరాయించడంతో విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. ఈనెల 24 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశముందని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి దాదాపు 36 వేల మంది నీట్ అర్హత సాధించగా, అందులో దాదాపు 3 వేల మంది వరకు అఖిల భారత సీట్లకు కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశముందని పేర్కొన్నారు.
26న సీట్ల కేటాయింపు జాబితా..
వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం మెడికల్ సీట్లకు, డీమ్డ్, కేంద్ర పరిధిలోని మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లకు అఖిల భారత నీట్ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 78 వేల ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 40 వేల సీట్లున్నాయి. వాటిల్లో అఖిల భారత కోటా కౌన్సెలింగ్ ద్వారా 7 వేల ఎంబీబీఎస్ సీట్లను భర్తీ, 1,000 బీడీఎస్ సీట్లను భర్తీ చేస్తారు. అందుకు ప్రస్తుతం కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. నీట్ అఖిల భారత ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో వివిధ దశలున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం, తర్వాత ఆప్షన్ల ఎంపిక, అనంతరం సీట్ల కేటాయింపు, తర్వాత కేటాయించిన కాలేజీల్లో చేరడం.
ఈ నాలుగు దశల్లో కౌన్సెలింగ్ జరుగుతుంది. మొదటి దశ ఈ నెల 24 వరకు నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. పేరు, ర్యాంకు ఇతరత్రా అంశాలతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జరగాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకటిస్తారు. దానిద్వారా లాగిన్ అయి విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలో సీట్లను ఎంపిక చేసుకోవాలి. మొదటి కౌన్సెలింగ్ కోసం విద్యార్థులు తమ సీటును జూన్ 25న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య లాక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు లాక్ చేసుకోలేకపోతే సీటు పోతుంది. అలా లాక్ చేసుకున్నాక మొదటి సీట్ల కేటాయింపు జాబితాను 26న ప్రకటిస్తారు. మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత సీట్లు ఖాళీగా ఉంటేనే రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. జూలై 6 నుంచి 9 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment