
సాక్షి, అమరావతి: వైద్య విద్య కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్–2022) ప్రశాంతంగా ముగిసింది. ఏపీలో.. 29 కేంద్రాల్లో మ.2 గంటల నుంచి సా.5.20 వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 60వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, దేశవ్యాప్తంగా 95 శాతం మంది హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈసారి ప్రశ్నపత్రం గత రెండేళ్లతో పోలిస్తే కాస్త కఠినంగా ఉందని నిపుణులతోపాటు చాలామంది విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా బోటనీ, జువాలజీల్లో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టడంతో చాలావరకు సమయం అక్కడే వృథా అయిందన్న భావన విద్యార్థుల్లో నెలకొంది.
ఆ 20నిమిషాలపై భిన్నాభిప్రాయాలు
మరోవైపు.. 20 నిమిషాల అదనపు సమయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు తమకు అదనపు సమయం కలిసొచ్చిందని చెబితే.. మరికొందరు దానివల్ల ఎటువంటి లాభం చేకూరలేదన్నారు. కెమిస్ట్రీలో 4–5 ప్రశ్నలు తార్కికంగా ఆలోచించి సమాధానాలు రాసేవిగా ఉన్నాయని, ఫిజిక్స్‌లో ప్రశ్నలు కొంత సులువుగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు.
ఈసారి కటాఫ్ తగ్గొచ్చు..
గతేడాది ఎక్కువ మంది విద్యార్థులు 700కు పైగా మార్కులు సాధించగా ఈసారి ఆ సంఖ్య తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనా ప్రకారం ఈ సంవత్సరం ప్రశ్నపత్రంలో కొత్తగా మ్యాచింగ్ ప్రశ్నలు, స్టేట్‌మెంట్ ప్రశ్నలు, అసెర్షన్ అండ్ రీజన్ ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారు. ఇలాంటి ప్రశ్నలు 10–12 వరకు ఉన్నాయి.
ఇలా ఇస్తారన్న సమాచారం కూడా విద్యార్థులకు లేకపోవడంతో వారు ఇబ్బందిపడ్డారు. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు సరైన సమాధానమేలేదు. బోటనీలో ఒక ప్రశ్నకు మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చే విధంగా ఉంది. ప్రశ్నలన్నీ కూడా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ పరిధి నుంచే వచ్చాయి. అయితే, ఈసారి నీట్ ప్రశ్నపత్రం మధ్యస్థం నుంచి కఠినంగా ఉండటంతో గతం కంటే 10 మార్కుల వరకు కటాఫ్ మార్కులు తగ్గే అవకాశముంది. జనరల్ కటాఫ్ 130 మధ్య, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్ 100 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment