
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పల్స్ పోలియో నిర్వహణకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి దశలో జనవరి 28న, రెండో దశలో మార్చి 11న పల్స్ పోలియో రోజును నిర్వహించనుంది. ప్రతి ఒక్క చిన్నారికి పోలియో నిర్మూలన వ్యాక్సిన్ వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మొదటి దశలో జనవరి 28 నుంచి జనవరి 30 వరకు, రెండో దశలో మార్చి 11 నుంచి మార్చి 14 వరకు వ్యాక్సిన్ వేస్తారు. రెండు దశల్లో సామూహిక వ్యాక్సిన్ నిర్వహణతోపాటు ఇంటింటికీ వెళ్లడం, స్కూళ్లు, ఇతర జనసమీకరణ కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉండేవారి పిల్లలకు, భిక్షాటన చేసే వారి పిల్లలకు వ్యాక్సిన్ వేయించేలా చర్యలు తీసుకుంటున్నారు.