
ఈ అన్నదమ్ములను అంబానీ బ్రదర్స్ అనొచ్చా? ఇంత చిన్న వయసులో వ్యాపారంలో ఢమఢమలాడిస్తుంటే అనక తప్పదు మరి. ఈ అన్నదమ్ముల్లో పెద్దవాడి వయసు 17. మిగిలినవారికి 15, 13, 11. వీళ్లను అందరూ ‘బిల్లింగ్‌స్లియా బాయ్స్’ అనీ ‘యమ్మీ బ్రదర్స్’ అనీ అంటుంటారు.
అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన జాషువా, ఇషయా, కాలెబ్, మైకా అన్నదమ్ములు. చిన్న వయసులోనే చాలా ఫేమస్ అయ్యారు. అందుకు వారు చేసే వ్యాపారమే కారణం. వారు కుకీలు(బిస్కెట్లు) తయారు చేసి అమ్ముతుంటారు. అలా స్థానికంగా వారు పేరు తెచ్చుకున్నారు.
వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వారికి ఎలా వచ్చింది? ఒకరోజు కుకీలు ఎలా తయారు చేయాలో వారికి వారి తాతమ్మ సరదాగా నేర్పింది. దాంతో ఆ నలుగురు అప్పుడప్పుడూ ఆ కుకీలు చేసి వీధిలో పంచేవారు. అవి చాలా కొత్తగా, రుచికరంగా ఉన్నాయని అందరూ మెచ్చుకునేవారు. దీంతో దాన్నే వ్యాపారంగా మార్చుకోవచ్చని వారికి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే వెళ్లి వాళ్ల నాన్నకు చెప్పారు. ఆయన అంగీకరించడంతో వెంటనే పని మొదలుపెట్టారు.
కుటుంబమంతా వారికి సహకరించింది. అలా ‘యమ్మీ బ్రదర్స్’ సంస్థ ప్రారంభమైంది. సుమారు 36 రకాల కుకీలు వారు తయారు చేసి మార్కెట్‌లో పెట్టగా, జనం వాటిని ఎగబడి కొన్నారు. అలా వారి కుకీలకు డిమాండ్ పెరిగింది. సంస్థలో మైకా ఆర్థిక అధికారి అయితే, ఇషయా మార్కెటింగ్ ఆఫీసర్, కాలెబ్ ఆపరేటింగ్ అధికారి, జాషువా ఎగ్జిక్యూటివ్ అధికారి.
నలుగురూ ఒక్కొక్క పనిని పంచుకుని క్రమపద్ధతిలో చేస్తారు. తమ పనిలో చిన్న తేడా కూడా రాకుండా చూసుకుంటారు. మొదట స్థానికంగా మొదలైన వారి కార్యకలాపాలు ఆ తర్వాత దేశమంతా వ్యాపించాయి. దేశంలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా వారు కుకీలను పంపిస్తారు.
రుచి, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడరు. ప్రారంభించిన రెండేళ్లలోనే దాదాపు నాలుగు లక్షలను కుకీలను అమ్మేశారు. ప్రస్తుతం వారి వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఒక్క పక్క వ్యాపారం చేస్తూనే, చదువును నిర్లక్ష్యం చేయకుండా కాలేజీకి, స్కూల్‌కి వెళ్లి చదువుకుంటున్నారు.
(చదవండి: అందాల భామలకు ఆతిథ్యం! యాదగిరిగుట్టకు ప్రపంచ సుందరీమణులు..!)
Comments
Please login to add a commentAdd a comment