సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీపీ, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. అయితే, గ్రామాల్లో అనేకమందికి తమకు బీపీగానీ, షుగర్‌గానీ ఉన్నట్లు తెలియకపోవడంతో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో జీవనశైలి వ్యాధిగ్రస్తులను ముందే గుర్తించి ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ కేన్సర్, డయాబెటీస్, కార్డియోవస్కులర్ డిసీజ్ అండ్ స్ట్రోక్ (ఎన్‌పీసీడీసీఎస్)’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సమాచారాన్ని తక్షణమే ట్యాబ్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారు. వేగంగా సర్వే నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమస్థానంలో ఉంది. జీవనశైలి వ్యాధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ నెల మూడో తేదీ వరకు చేపట్టిన సర్వే అంశాల్లోని నివేదికను విడుదల చేసింది.
12 జిల్లాలు 32 లక్షల మంది
బీపీ, షుగర్ బాధితుల వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో 12 జిల్లాల్లో వైద్య పరీక్షలు ప్రారంభించారు. జనగాం, సిద్ధిపేట, కరీంనగర్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, వరంగల్ రూరల్, మెదక్, సంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 1.04 కోట్ల జనాభా ఉంది. అందులో 30 ఏళ్లకుపైబడిన వయస్సుగలవారు 38.73 లక్షలమంది ఉన్నారు. 32.02 లక్షల(83%) మందికి స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. వారిలో 3.86 లక్షలమందిని గుర్తించి ఆసుపత్రులకు రిఫర్ చేశారు. పాతవారితో కలిపి మొత్తంగా 2.73 లక్షల మందికి బీపీ, 1.69 లక్షల మందికి డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారించారు. అంటే 4.42 లక్షల మందికి బీపీ, షుగర్ ఉన్నట్లు తేలింది. వారిలో కొందరికి బీపీ, షుగర్ రెండూ ఉండటం గమనార్హం. అంటే 30 ఏళ్లకుపైబడిన వారిలో ఈ 12 జిల్లాల్లో 13 శాతం మంది బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నట్లు నిర్ధారణ జరిగింది.
అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో బీపీ, షుగర్
ఈ 12 జిల్లాల్లో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాల్లో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ జిల్లాలో 5.12 లక్షలమందికి స్క్రీనింగ్ చేయగా, 65 వేలమందికి బీపీ, 34 వేల మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారణ చేశారు. అత్యంత తక్కువగా భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లాల్లో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులున్నట్లు తేలింది. భూపాలపల్లి జిల్లాలో 2.38 లక్షల మందికి స్క్రీనింగ్ చేయగా, అందులో 3,453 మందికి బీపీ, 3112 మందికి షుగర్ ఉన్నట్లు నిర్దారించారు. వరంగల్ రూరల్ జిల్లాలో 2.14 లక్షల మందికి స్క్రీనింగ్ చేయగా, అందులో 4,531 మందికి బీపీ, 4 వేల మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారించారు. జూన్ ఒకటి నుంచి మిగిలిన జిల్లాల్లోనూ జీవనశైలి వ్యాధులపై సర్వే చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment