లబ్బీపేట(విజయవాడతూర్పు)/మచిలీపట్నంసబర్బన్: ‘ప్రైవేటు బ్యాంకులో పనిచేసే 35 ఏళ్ల యువకుడు ఇటీవల నీరసంగా ఉంటుండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రక్తపోటు అధికంగా ఉండటంతో పాటు, మూత్రపిండాల్లో ఫిల్టర్స్ పదిశాతం వరకూ దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పారు. ఐదేళ్ల నుంచి రక్తపోటు ఉన్నా గుర్తించక పోవడంతో ఆ ప్రభావం మూత్రపిండాలపై చూపినట్లు పేర్కొన్నారు.’‘ఇరిగేషన్‌శాఖలో పనిచేసే ఓ ఉద్యోగికి 28 ఏళ్లు. తరచూ కళ్లు తిరిగినట్లు ఉండటంతో ఇటీవల వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అతని శరీరంలో చక్కెర స్థాయి 160 ఉండటంతో పాటు, హెచ్‌బీఏ1సీ 10కి చేరింది. మరికొంతకాలం ఇదే పరిస్థితి ఉంటే గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండేదని వైద్యులు తెలిపారు.’
ఇలా వీరిద్దరే కాదు..రాజధానిలో అనేక మంది రెండు పదుల వయస్సులోనే రక్తపోటు, మధుమేహం అనే జంటభూతాల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నగరంలోని ఆస్పత్రిల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని నిర్థారణ అవుతుంది. చిన్నవయస్సులోనే సోకుతున్న వ్యాధుల పట్ల అప్రమత్తం కాకుంటే రానున్న రోజుల్లో మనిషి జీవిత కాలంలో పది నుంచి పదిహేనేళ్లు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ నిర్వహించిన సర్వేలో సైతం రాజధాని జిల్లాలో మధుమేహం, రక్తపోటు కారణంగా గుండెజబ్బులు పెరుగుతున్నట్లు తేలింది. 25 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 12 శాతం మంది సుగర్‌తోనూ.. 14 శాతం మంది బీపీతోనూ బాధపడుతున్నట్లు సర్వేలో తేటతెల్లమైంది.
జంట వ్యాధులకు కారణాలివే..
జీవనశైలిలో మార్పులు చోటుచేసుకోవడం, మాంసాహారం, కార్పోహైడ్రేడ్స్ ఎక్కువుగా ఉంటే జంక్‌ఫుడ్స్ తీసుకోవడం, శారీరక శ్రమ లేక పోవడం కారణంగా తేలింది. అంతేకాకుండా ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా రక్తపోటు పెరగడానికి కారణంగా సర్వేలో తేలింది. రాజధాని ప్రాంత ఉద్యోగుల్లో 70 శాతం మంది ఒత్తిడికి గురవడం కూడా చిన్నవయస్సులోనే రక్తపోటు, బీపీకి కారణాలుగా చెపుతున్నారు.
ఏమి చేయాలి..
♦ జంట వ్యాధులను అరికట్టేందుకు ప్రతిరోజూ 45 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం, వాకింగ్ లాంటివి తప్పక చేయాలి.
♦ విధి నిర్వహణలో, జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా చేయడం మంచిది.
♦ ఆహారంలో కార్బోహైడ్రేడ్స్ తక్కువుగా ఉండేలా చూసుకోవాలి, మాంసాహారం, జంక్‌ఫుడ్స్‌ను తగ్గిస్తే మంచిది.
♦ పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తాజా పళ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువుగా తినాలి.
♦ శరీరంలో బీపీ, చక్కెర స్థాయిలు, కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకునేలా తరచూ పరీక్షలు చేయించుకోవాలి.
♦ ప్రతి మనిషి నెలకు 500 గ్రాములకు మించి వంట నూనెలు వాడరాదు. అధికంగా నూనెలు వినియోగించడం చాలా ప్రమాదకరం.
♦ ఒకే నూనె కాకుండా మార్చి మార్చి వాడటం మంచిది.
ప్రమాదకర స్థాయిలో ‘చక్కెర’
కృష్ణా జిల్లాలో మధుమేహం(సుగర్) వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రతి పది మందిలో నలుగురు వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో హైరిస్క్ సుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో స్పష్టమైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారు 4.50 లక్షల మంది జనాభా ఉండగా సుమారు 1.50 లక్షల మంది సుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో లక్ష మందికి పైగా హైరిస్క్ సుగర్‌తో పోరాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment