తల్లికి, బిడ్డకు ఆరోగ్యమస్తు | Benefits with MCP cards | Sakshi
Sakshi News home page

తల్లికి, బిడ్డకు ఆరోగ్యమస్తు

Published Thu, Oct 31 2019 5:25 AM | Last Updated on Thu, Oct 31 2019 8:21 AM

Benefits with MCP cards - Sakshi

శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతానికి చెందిన శ్రీదేవి తొలి కాన్పు కోసం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరి పండంటి పాపకు జన్మనిచ్చింది. తొలి కాన్పు కావడంతో బిడ్డ సంరక్షణ ఎలాగో ఆమెకు తెలియలేదు. ఇంతలో వైద్యుడు ఎంసీపీ కార్డు ఇచ్చారు. అందులో బిడ్డ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఉన్నాయి. ఆ వివరాలతో శ్రీదేవి తన బిడ్డను చక్కగా చూసుకోగలుగుతోంది. 

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లికి చెందిన ముత్యాల మీనాకుమారి.. గర్భిణి. వైద్యపరీక్షల కోసం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా అక్కడ ఆమెకు ఎంసీపీ కార్డును ఇచ్చారు. అందులో ఇచ్చిన జాగ్రత్తలను పాటిస్తున్నానని.. తల్లీబిడ్డల ఆరోగ్యంపై చాలా వివరాలు పొందుపరిచారని మీనాకుమారి సంతోషం వ్యక్తం చేస్తోంది. 

సాక్షి, అమరావతి: గర్భిణిగా నిర్ధారణ అయినప్పటి నుంచి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే జాగ్రత్తలు పాటించాలి? ఎప్పుడు ఏయే పరీక్షలు చేయించుకోవాలి? బిడ్డ పుట్టాక ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు ఏ టీకాలు వేయించాలి? ఎలాంటి ఆహారం పెట్టాలి? అనారోగ్యంగా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బిడ్డ ఎదుగుదలకు ఏం చేయాలి?.. ఇలా గర్భిణులకు, బాలింతలకు ఎన్నో సందేహాలు. వీటిని నివృత్తి చేయడానికి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రంగంలోకి దిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గర్భిణుల నుంచి బాలింతలు.. బిడ్డల వరకు వారి సంరక్షణే ధ్యేయంగా ఎంసీపీ (మాతా శిశు సంరక్షణ) కార్డులు రూపొందించింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లోని బోధనాస్పత్రుల వరకు పంపిణీ చేస్తోంది. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి.. బిడ్డ పుట్టాక తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంతో అమూల్యమైన సమాచారం ఎంసీపీ కార్డుల్లో పొందుపరిచింది. ఈ కార్డుల ద్వారా లక్షలాది మంది గర్భిణులు, బాలింతలు ప్రయోజనం పొందుతున్నారు. 

9  నెలలు ఇలా..
మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి తొమ్మిది నెలలు పూర్తయి ప్రసవం అయ్యే వరకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఎంసీపీ కార్డులో పొందుపరిచారు. గర్భిణి.. మొదటి త్రైమాసికంలో ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి.. గర్భస్థ పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి.. సాధారణ పరీక్షలు అంటే.. రక్తపోటు, మూత్ర పరీక్షలు వంటివి ఎప్పుడు చేయించుకోవాలి.. ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి? వంటి వాటిని వివరించారు. కార్డుల్లో ఇచ్చిన సమాచారం ద్వారా 9 నెలల కాలంలో ఉన్న బరువుకు అదనంగా 10 నుంచి 12 కిలోలు బరువు పెరగాలని, కనీసం 180 ఐరన్‌ ఫోలిక్‌ మాత్రలు వాడాలని గర్భిణులు తెలుసుకుంటున్నారు. 

సుఖప్రసవాలు ఎక్కువ చేయడమే లక్ష్యం
రాష్ట్రంలో సుమారు 50 శాతం సిజేరియన్‌ ప్రసవాలే జరుగుతున్నాయి. దీనివల్ల తల్లికి భవిష్యత్‌లో శారీరక సమస్యలు తలెత్తుతాయి. వీటి నుంచి వారిని బయటపడేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. సుఖప్రసవాలు జరగాలంటే ముందు గర్భిణులకు చక్కటి అవగాహన ఉండాలనే లక్ష్యంతో ఎంసీపీ కార్డులను రూపొందించింది. దీనివల్ల మాతా శిశు మరణాల రేటును కూడా తగ్గించవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి వెయ్యి ప్రసవాలకు 34 మంది శిశువులు, ప్రతి లక్ష ప్రసవాలకు 74 మంది తల్లులు ప్రసవ సమయంలో మృతి చెందుతున్నారు. రానున్న రెండేళ్లలో ఈ మరణాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఎంసీపీ కార్డులను ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్యానికి వచ్చే ప్రతి తల్లికీ, గర్భిణికీ అందిస్తోంది.

టీకాలే బిడ్డకు రక్షణ కవచం
బిడ్డ పుట్టగానే వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది. వీటి బారి నుంచి బిడ్డను రక్షించుకోవాలంటే టీకాలే మార్గం. బిడ్డకు ఏ వయసులో ఏ టీకా వేయించాలో తల్లికి అవగాహన ఉంటే బిడ్డను కాపాడుకోవడం సులువవుతుంది. ప్రభుత్వం అందిస్తున్న ఎంసీపీ కార్డుల్లో బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏయే టీకాలు వేయించాలో తెలుపుతూ కాలనిర్ణయ పట్టికను రూపొందించారు. అంతేకాకుండా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల, అభివృద్ధి దశలతో చిత్రమాలికను రూపొందించడం.. టీకాల సామర్థ్యాలపై వివరణలు  ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు మంచి అవగాహన కల్పిస్తున్నాయి.

ఎంసీపీ కార్డులో ఉన్న మరికొన్ని వివరాలు.. 
- స్థానిక ఏఎన్‌ఎం (ఆక్సిలరీ నర్స్‌ మిడ్‌వైఫరీ) వద్ద ఏయే సేవలు ఉంటాయో సూచించడం
రొమ్ము సంబంధిత వ్యాధుల లక్షణాలను చెప్పడం
గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్‌ లక్షణాలను వివరించడం
సంచార చికిత్సలో భాగంగా చేసే వైద్య పరీక్షలేవో తెలపడం
మొదటి కాన్పులో తలెత్తిన సమస్యలేవైనా ఉంటే వాటి వివరాలు తీసుకోవడం
గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పౌష్టికాహారం.. జాగ్రత్తలు
రక్తస్రావం, రక్తహీనత, జ్వరం, మూర్ఛ వంటి ఏవైనా లక్షణాలు ఉంటే గర్భిణి తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తల్లిపాలు ఇస్తే శిశువుకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలపడం
పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల గురించి చిత్రాలతో వివరించడం
ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రల ప్రాధాన్యత చెప్పడం
ప్రధానమంత్రి మాతృవందన యోజన, జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌ వంటి పథకాల ద్వారా ప్రసవం తర్వాత ఇచ్చే నగదు వివరాలు.

అవగాహన ఉంటే వైద్యం చేసుకున్నట్టే..
గర్భిణులకు, బాలింతలకు ఆరోగ్యంపై అవగాహన ఉందంటే వైద్యం చేసుకున్నట్టే లెక్క. పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, ప్రసవానంతరం బిడ్డ సంరక్షణకు కావాల్సిన చిట్కాలు.. ఈ మూడూ ప్రధాన అంశాలు. వీటిని తెలుసుకుంటే చాలు తల్లీ, బిడ్డ సురక్షితంగా ఉంటారు. ఈ అంశాలను ఎంసీపీ కార్డులో అర్థమయ్యే విధంగా రూపొందించడం బాగుంది. కార్డులో ఉన్న అంశాలను క్రమం తప్పకుండా పాటిస్తే చాలు. గర్భిణులు జాగ్రత్తలు పాటిస్తే సుఖప్రసవం జరిగి బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది.    
–డా.వై.మాధవి, గైనకాలజిస్ట్, కడప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement