Social Health Center
-
తల్లికి, బిడ్డకు ఆరోగ్యమస్తు
శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతానికి చెందిన శ్రీదేవి తొలి కాన్పు కోసం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరి పండంటి పాపకు జన్మనిచ్చింది. తొలి కాన్పు కావడంతో బిడ్డ సంరక్షణ ఎలాగో ఆమెకు తెలియలేదు. ఇంతలో వైద్యుడు ఎంసీపీ కార్డు ఇచ్చారు. అందులో బిడ్డ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఉన్నాయి. ఆ వివరాలతో శ్రీదేవి తన బిడ్డను చక్కగా చూసుకోగలుగుతోంది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లికి చెందిన ముత్యాల మీనాకుమారి.. గర్భిణి. వైద్యపరీక్షల కోసం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా అక్కడ ఆమెకు ఎంసీపీ కార్డును ఇచ్చారు. అందులో ఇచ్చిన జాగ్రత్తలను పాటిస్తున్నానని.. తల్లీబిడ్డల ఆరోగ్యంపై చాలా వివరాలు పొందుపరిచారని మీనాకుమారి సంతోషం వ్యక్తం చేస్తోంది. సాక్షి, అమరావతి: గర్భిణిగా నిర్ధారణ అయినప్పటి నుంచి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే జాగ్రత్తలు పాటించాలి? ఎప్పుడు ఏయే పరీక్షలు చేయించుకోవాలి? బిడ్డ పుట్టాక ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు ఏ టీకాలు వేయించాలి? ఎలాంటి ఆహారం పెట్టాలి? అనారోగ్యంగా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బిడ్డ ఎదుగుదలకు ఏం చేయాలి?.. ఇలా గర్భిణులకు, బాలింతలకు ఎన్నో సందేహాలు. వీటిని నివృత్తి చేయడానికి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రంగంలోకి దిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గర్భిణుల నుంచి బాలింతలు.. బిడ్డల వరకు వారి సంరక్షణే ధ్యేయంగా ఎంసీపీ (మాతా శిశు సంరక్షణ) కార్డులు రూపొందించింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల్లోని బోధనాస్పత్రుల వరకు పంపిణీ చేస్తోంది. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి.. బిడ్డ పుట్టాక తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంతో అమూల్యమైన సమాచారం ఎంసీపీ కార్డుల్లో పొందుపరిచింది. ఈ కార్డుల ద్వారా లక్షలాది మంది గర్భిణులు, బాలింతలు ప్రయోజనం పొందుతున్నారు. 9 నెలలు ఇలా.. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి తొమ్మిది నెలలు పూర్తయి ప్రసవం అయ్యే వరకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఎంసీపీ కార్డులో పొందుపరిచారు. గర్భిణి.. మొదటి త్రైమాసికంలో ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి.. గర్భస్థ పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి.. సాధారణ పరీక్షలు అంటే.. రక్తపోటు, మూత్ర పరీక్షలు వంటివి ఎప్పుడు చేయించుకోవాలి.. ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి? వంటి వాటిని వివరించారు. కార్డుల్లో ఇచ్చిన సమాచారం ద్వారా 9 నెలల కాలంలో ఉన్న బరువుకు అదనంగా 10 నుంచి 12 కిలోలు బరువు పెరగాలని, కనీసం 180 ఐరన్ ఫోలిక్ మాత్రలు వాడాలని గర్భిణులు తెలుసుకుంటున్నారు. సుఖప్రసవాలు ఎక్కువ చేయడమే లక్ష్యం రాష్ట్రంలో సుమారు 50 శాతం సిజేరియన్ ప్రసవాలే జరుగుతున్నాయి. దీనివల్ల తల్లికి భవిష్యత్‌లో శారీరక సమస్యలు తలెత్తుతాయి. వీటి నుంచి వారిని బయటపడేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. సుఖప్రసవాలు జరగాలంటే ముందు గర్భిణులకు చక్కటి అవగాహన ఉండాలనే లక్ష్యంతో ఎంసీపీ కార్డులను రూపొందించింది. దీనివల్ల మాతా శిశు మరణాల రేటును కూడా తగ్గించవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి వెయ్యి ప్రసవాలకు 34 మంది శిశువులు, ప్రతి లక్ష ప్రసవాలకు 74 మంది తల్లులు ప్రసవ సమయంలో మృతి చెందుతున్నారు. రానున్న రెండేళ్లలో ఈ మరణాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఎంసీపీ కార్డులను ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్యానికి వచ్చే ప్రతి తల్లికీ, గర్భిణికీ అందిస్తోంది. టీకాలే బిడ్డకు రక్షణ కవచం బిడ్డ పుట్టగానే వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది. వీటి బారి నుంచి బిడ్డను రక్షించుకోవాలంటే టీకాలే మార్గం. బిడ్డకు ఏ వయసులో ఏ టీకా వేయించాలో తల్లికి అవగాహన ఉంటే బిడ్డను కాపాడుకోవడం సులువవుతుంది. ప్రభుత్వం అందిస్తున్న ఎంసీపీ కార్డుల్లో బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏయే టీకాలు వేయించాలో తెలుపుతూ కాలనిర్ణయ పట్టికను రూపొందించారు. అంతేకాకుండా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల, అభివృద్ధి దశలతో చిత్రమాలికను రూపొందించడం.. టీకాల సామర్థ్యాలపై వివరణలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు మంచి అవగాహన కల్పిస్తున్నాయి. ఎంసీపీ కార్డులో ఉన్న మరికొన్ని వివరాలు.. - స్థానిక ఏఎన్ఎం (ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫరీ) వద్ద ఏయే సేవలు ఉంటాయో సూచించడం - రొమ్ము సంబంధిత వ్యాధుల లక్షణాలను చెప్పడం - గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ లక్షణాలను వివరించడం - సంచార చికిత్సలో భాగంగా చేసే వైద్య పరీక్షలేవో తెలపడం - మొదటి కాన్పులో తలెత్తిన సమస్యలేవైనా ఉంటే వాటి వివరాలు తీసుకోవడం - గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పౌష్టికాహారం.. జాగ్రత్తలు - రక్తస్రావం, రక్తహీనత, జ్వరం, మూర్ఛ వంటి ఏవైనా లక్షణాలు ఉంటే గర్భిణి తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలు - తల్లిపాలు ఇస్తే శిశువుకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలపడం - పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల గురించి చిత్రాలతో వివరించడం - ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల ప్రాధాన్యత చెప్పడం - ప్రధానమంత్రి మాతృవందన యోజన, జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ వంటి పథకాల ద్వారా ప్రసవం తర్వాత ఇచ్చే నగదు వివరాలు. అవగాహన ఉంటే వైద్యం చేసుకున్నట్టే.. గర్భిణులకు, బాలింతలకు ఆరోగ్యంపై అవగాహన ఉందంటే వైద్యం చేసుకున్నట్టే లెక్క. పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, ప్రసవానంతరం బిడ్డ సంరక్షణకు కావాల్సిన చిట్కాలు.. ఈ మూడూ ప్రధాన అంశాలు. వీటిని తెలుసుకుంటే చాలు తల్లీ, బిడ్డ సురక్షితంగా ఉంటారు. ఈ అంశాలను ఎంసీపీ కార్డులో అర్థమయ్యే విధంగా రూపొందించడం బాగుంది. కార్డులో ఉన్న అంశాలను క్రమం తప్పకుండా పాటిస్తే చాలు. గర్భిణులు జాగ్రత్తలు పాటిస్తే సుఖప్రసవం జరిగి బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. –డా.వై.మాధవి, గైనకాలజిస్ట్, కడప -
ఐసీయూ అలంకారప్రాయం..
ఉట్నూర్(ఖానాపూర్) : ఏజెన్సీ గిరిజనులకు అత్యవసర వైద్యం అంద ని ద్రాక్షగానే మిగిలింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు లక్ష్మారెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి గత నెల 21న ఉట్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అట్ట హాసంగా ప్రారంభిం చిన ఐసీయూ, డయాలసిస్ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని ఆశపడ్డ ఏజెన్సీవాసులకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా ఐసీయూ, డయాలసిస్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిన ఏంబీబీఎస్లను నియమించినట్లు తెలిసింది. గిరిజనులకు వైద్య సౌకర్యాల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వైద్య సేవలు అందించే వైద్యాధికారులపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా అత్యధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నా గిరిజనులకు మెరుగైన వైద్యం అందడం లేదు. ఐసీయూలో ఎంబీబీఎస్‌లే దిక్కు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సదుపాయాలు మరింత చెరువ చేసేందుకు ప్రభుత్వం తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద్వారా ఏప్రిల్‌లో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యునిట్)ను రూ. 22 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసింది. ఐసీయూలో విధులు నిర్వహించేందుకు యూనిట్ హెడ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(అనస్థీషియా), ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (జనరల్ మెడిసిన్), ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (పాల్మనరీ మెడిసిన్)లను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ఆరుగురు స్టాఫ్ నర్సులు, ఒక్కొక్కరి చొప్పున ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలాజీ టెక్నీషీయన్, వెంటిలేటర్ టెక్నీషియన్, ఎనిమిది మంది ఎమ్ఎన్వో, ఏఫ్ఎన్వోలు, మూగ్గురు సెక్యూరిటీ గార్డులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేలా చర్యలు చేపట్టింది. ఐసీయూ కేంద్రంలో సెంట్రలైజ్డ్ ఏసీ సౌకర్యం, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టం ఏర్పాటు చేశారు. పది పడకల సామర్థ్యం గల యూనిట్ ఆస్పత్రి పర్యవేక్షకుడికి సంబంధం లేకుండా పూర్తిగా స్వయం ప్రతిపత్తి యూనిట్లుగా ఇన్చార్జీల పర్యవేక్షణలో ఉండేలా జాతీయ ఆరోగ్య మిషన్ చర్యలు చేపట్టింది. అయితే ఉట్నూర్ ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉన్నతాధికారుల సూచనలతో ఐదుగురు ఏంబీబీఎస్ వైద్యాధికారులను ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేలా నియమించినట్లు ఆస్పత్రి సుపరింటెండెంట్ పేర్కొంటున్నారు. అత్యవసర వైద్య సేవలు ప్రత్యేక వైద్యాధికారుల పర్యవేక్షణలో నిర్వహణ సాగితే మేలు జరుగుతుంది తప్ప ఎంబీబీఎస్ వైద్యులు నిర్వహణ కొనసాగిస్తే ప్రయోజనం ఉండదని గిరిజనులు వాపోతున్నారు. నెప్రాలజీ లేక.. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తశుద్ధి కోసం ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేం ద్రంలో ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేసింది. ఒకేసారి ఐదుగురు బాధితులకు రక్తశుద్ధి చేసేలా ఐదు డయాలసిస్ యునిట్లు ఏర్పాటు చేసి కేంద్రం నిర్వహణ బాధ్యతలను ‘డీమెడ్’ అనే సంస్థకు అప్పగించింది. డయాలసిస్ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ఇద్దరు టెక్నికల్ అధికారులు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు ఉన్నప్పటికీ డయాలసిస్ సమయంలో బాధితులను అన్ని విధాలా పర్యవేక్షించే అతి ముఖ్యమైన వైద్యాధికారి నెప్రాలజిస్ట్ లేక పోవడంతో కేంద్రం అలంకారప్రాయంగా మారింది. కీడ్నీ బాధితులకు డయాలసిస్ చేసేటప్పుడు అత్యవసరంగా రక్తం అవసరం పడుతుంది. కానీ సామాజిక ఆరోగ్య కేం ద్రంలో ఉన్న బ్లడ్ బ్యాంక్ ఎప్పుడో మూలకు పడింది. కొత్తగా నిర్మిస్తున్న భవనంలో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నా అది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బాధితులకు ఎలా డయాలసిస్ నిర్వహిస్తారో అధికారులకే తెలియాలి. ప్రత్యేక వైద్యాధికారులను నియమించి వైద్యం అందించాలని ఏజెన్సీ గిరిజనులు కోరుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో సేవలు.. సీహెచ్‌సీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులు ఎవరూ ముందుకు రాక ఉన్నతాధికారులు ఐదుగురు ఏంబీబీఎస్ వైద్యులను ఐసీయూలో విధులు నిర్వహించేందుకు నియమించింది. అయితే వీరికి త్వరలో విడతల వారీగా ఐసీయూలో విధుల నిర్వహణపై శిక్షణ నిర్వహించనున్నారు. కేంద్రం నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు రాగానే ఐసీయూ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. డయాలసిస్ కేంద్రంలో విధులు నిర్వహణ కోసం త్వరలో నెప్రాలజిస్ట్ను ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. – వేణుగోపాల్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ ఉట్నూర్ -
ముంచుకొచ్చిన మృత్యువు
⇒ కాకతీయ కాల్వలోకి దూసుకెళ్లిన కారు ⇒ ఇద్దరు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగినుల మృతి ⇒ సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్ ⇒ కోనేరుపల్లి శివారులో ప్రమాదం చొప్పదండి: మండలంలోని కోనేరుపల్లి శివారులో గల కాకతీయ కాల్వ వంతెన వద్ద ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లడంతో చొప్పదండిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగినులు మృత్యువాతపడ్డారు. సోమవారం మధ్యాహ్నం బోధకాలు మాత్రలు పంపిణీచేసేందుకు చొప్పదండి ఆరోగ్య కేంద్రం నుంచి కోనేరుపల్లికి బయలుదేరిన హెల్త్ సూపర్వైజర్ అనంతకుమారి(48), రెండో ఏఎన్ఎం బాలసరస్వతి(35) కాట్నపల్లి, కోనేరుపల్లి మధ్య కాల్వపై గల వంతెనను దాటి కొద్దిదూరం వెళ్లగానే కారు కాల్వలోకి దూసుకుపోయింది. కారు నీటిలో బోల్తాపడటంతో అనంతకుమారి, బాలసరస్వతి మృతి చెందారు. డ్రైవింగ్ నేర్చుకుంటూ మృత్యువాత ఇటీవలే స్విఫ్ట్ కారును కొనుగోలు చేసిన అనంతకుమారి దానికి ఓ డ్రైవర్‌ను నియమించుకున్నారు. బోదకాలు మాత్రలు పంపిణీ చేసేందుకు కాట్నపల్లి వెళ్లి అక్కడ విధులు పూర్తి చేసుకున్నారు. కాట్నపల్లి క్టస్టర్‌కు సూపర్వైజర్ కావడంతో అనంతకుమారి కోనేరుపల్లికి బయల్దేరారు. అక్కడినుంచి కరీంనగర్ వెళ్లే అవకాశం ఉండటంతో కాట్నపల్లి ఏఎన్ఎం బాలసరస్వతి కూడా కారులో ఎక్కారు. దారిలో అనంతకుమారి కారు డ్రైవింగ్ నేర్చుకుంటుండగా, డ్రైవర్ హరీష్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఇంతలో కాకతీయ కాల్వపై మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే కారులోంచి తప్పించకున్న హరీష్ నీటి ప్రవాహంలో ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడగా, అనంతకుమారి, బాలసరస్వతి అందులోనే చి క్కుకుని మృతి చెందారు. హరీష్ ద్వారా విష యం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యు లు, బంధువులు, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానికులు, పోలీసులు, హెల్త్ సిబ్బంది మృతదేహాల కోసం కాల్వలో గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు క్రేన్ సాయంతో గాలించగా ప్రమాద స్థలంలోనే కారును, డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అనంతకుమారిని ఒడ్డుకు చేర్చారు. బాలసరస్వతి మృతదేహాన్ని కరీంనగర్ మండలం కొత్తపల్లి శివారులో వెలికితీశారు. మృతదేహాలను చూసి వారి కుటుంబసభ్యులు బోరున విలపించారు. బాలసరస్వతి కుమారుడు సృ్పహ కోల్పోవడంతో వైద్యసిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డీఎంహెచ్‌వో అలీం, కరీంనగర్ డీఎస్పీ మల్లారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. మూడేళ్ల క్రితం చొప్పదండిలో ఉద్యోగంలో చేరిన అనంతకుమారి కరీంనగర్లో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త ఆర్టీసీ వర్క్‌షాపులో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, ఇద్దరికి వివాహమైంది. మరో కుమార్తె ఎంబీబీఎస్ చదువుతోంది. ఆరు నెలల క్రితం చొప్పదండిలో విధుల్లో చేరిన బాలసరస్వతి భర్త ఎలిగేడు ఎస్బీహెచ్లో రికార్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. డెప్యూటీ సీఎం సంతాపం మంకమ్మతోట : అనంతకుమారి, బాలసర్వతి మృతిపై డెప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య, డెరైక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ సాంబశివరావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్‌చంద్ర, డీఎంహెచ్ఓ ఎండీ.అలీమ్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. విధి నిర్వహణలో మరణించినందున వారి కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు.