ముంచుకొచ్చిన మృత్యువు
⇒ కాకతీయ కాల్వలోకి దూసుకెళ్లిన కారు
⇒ ఇద్దరు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగినుల మృతి
⇒ సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్
⇒ కోనేరుపల్లి శివారులో ప్రమాదం
చొప్పదండి: మండలంలోని కోనేరుపల్లి శివారులో గల కాకతీయ కాల్వ వంతెన వద్ద ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లడంతో చొప్పదండిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగినులు మృత్యువాతపడ్డారు. సోమవారం మధ్యాహ్నం బోధకాలు మాత్రలు పంపిణీచేసేందుకు చొప్పదండి ఆరోగ్య కేంద్రం నుంచి కోనేరుపల్లికి బయలుదేరిన హెల్త్ సూపర్‌వైజర్ అనంతకుమారి(48), రెండో ఏఎన్‌ఎం బాలసరస్వతి(35) కాట్నపల్లి, కోనేరుపల్లి మధ్య కాల్వపై గల వంతెనను దాటి కొద్దిదూరం వెళ్లగానే కారు కాల్వలోకి దూసుకుపోయింది. కారు నీటిలో బోల్తాపడటంతో అనంతకుమారి, బాలసరస్వతి మృతి చెందారు.
డ్రైవింగ్ నేర్చుకుంటూ మృత్యువాత
ఇటీవలే స్విఫ్ట్ కారును కొనుగోలు చేసిన అనంతకుమారి దానికి ఓ డ్రైవర్‌ను నియమించుకున్నారు. బోదకాలు మాత్రలు పంపిణీ చేసేందుకు కాట్నపల్లి వెళ్లి అక్కడ విధులు పూర్తి చేసుకున్నారు. కాట్నపల్లి క్టస్టర్‌కు సూపర్‌వైజర్ కావడంతో అనంతకుమారి కోనేరుపల్లికి బయల్దేరారు. అక్కడినుంచి కరీంనగర్ వెళ్లే అవకాశం ఉండటంతో కాట్నపల్లి ఏఎన్‌ఎం బాలసరస్వతి కూడా కారులో ఎక్కారు. దారిలో అనంతకుమారి కారు డ్రైవింగ్ నేర్చుకుంటుండగా, డ్రైవర్ హరీష్ పక్క సీట్లో కూర్చున్నాడు.
ఇంతలో కాకతీయ కాల్వపై మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే కారులోంచి తప్పించకున్న హరీష్ నీటి ప్రవాహంలో ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడగా, అనంతకుమారి, బాలసరస్వతి అందులోనే చి క్కుకుని మృతి చెందారు. హరీష్ ద్వారా విష యం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యు లు, బంధువులు, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
స్థానికులు, పోలీసులు, హెల్త్ సిబ్బంది మృతదేహాల కోసం కాల్వలో గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు క్రేన్ సాయంతో గాలించగా ప్రమాద స్థలంలోనే కారును, డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అనంతకుమారిని ఒడ్డుకు చేర్చారు. బాలసరస్వతి మృతదేహాన్ని కరీంనగర్ మండలం కొత్తపల్లి శివారులో వెలికితీశారు. మృతదేహాలను చూసి వారి కుటుంబసభ్యులు బోరున విలపించారు. బాలసరస్వతి కుమారుడు సృ్పహ కోల్పోవడంతో వైద్యసిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
డీఎంహెచ్‌వో అలీం, కరీంనగర్ డీఎస్పీ మల్లారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. మూడేళ్ల క్రితం చొప్పదండిలో ఉద్యోగంలో చేరిన అనంతకుమారి కరీంనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త ఆర్టీసీ వర్క్‌షాపులో మెకానికల్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, ఇద్దరికి వివాహమైంది. మరో కుమార్తె ఎంబీబీఎస్ చదువుతోంది. ఆరు నెలల క్రితం చొప్పదండిలో విధుల్లో చేరిన బాలసరస్వతి భర్త ఎలిగేడు ఎస్‌బీహెచ్‌లో రికార్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
డెప్యూటీ సీఎం సంతాపం
మంకమ్మతోట : అనంతకుమారి, బాలసర్వతి మృతిపై డెప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య, డెరైక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ సాంబశివరావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్‌చంద్ర, డీఎంహెచ్‌ఓ ఎండీ.అలీమ్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. విధి నిర్వహణలో మరణించినందున వారి కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు.