సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం
ఉట్నూర్(ఖానాపూర్) : ఏజెన్సీ గిరిజనులకు అత్యవసర వైద్యం అంద ని ద్రాక్షగానే మిగిలింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు లక్ష్మారెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి గత నెల 21న ఉట్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అట్ట హాసంగా ప్రారంభిం చిన ఐసీయూ, డయాలసిస్ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని ఆశపడ్డ ఏజెన్సీవాసులకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా ఐసీయూ, డయాలసిస్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిన ఏంబీబీఎస్‌లను నియమించినట్లు తెలిసింది. గిరిజనులకు వైద్య సౌకర్యాల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వైద్య సేవలు అందించే వైద్యాధికారులపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా అత్యధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నా గిరిజనులకు మెరుగైన వైద్యం అందడం లేదు.
ఐసీయూలో ఎంబీబీఎస్‌లే దిక్కు
ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సదుపాయాలు మరింత చెరువ చేసేందుకు ప్రభుత్వం తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద్వారా ఏప్రిల్‌లో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యునిట్)ను రూ. 22 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసింది. ఐసీయూలో విధులు నిర్వహించేందుకు యూనిట్ హెడ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(అనస్థీషియా), ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (జనరల్ మెడిసిన్), ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (పాల్మనరీ మెడిసిన్)లను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ఆరుగురు స్టాఫ్ నర్సులు, ఒక్కొక్కరి చొప్పున ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలాజీ టెక్నీషీయన్, వెంటిలేటర్ టెక్నీషియన్, ఎనిమిది మంది ఎమ్‌ఎన్‌వో, ఏఫ్‌ఎన్‌వోలు, మూగ్గురు సెక్యూరిటీ గార్డులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేలా చర్యలు చేపట్టింది. ఐసీయూ కేంద్రంలో సెంట్రలైజ్డ్ ఏసీ సౌకర్యం, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టం ఏర్పాటు చేశారు.
పది పడకల సామర్థ్యం గల యూనిట్ ఆస్పత్రి పర్యవేక్షకుడికి సంబంధం లేకుండా పూర్తిగా స్వయం ప్రతిపత్తి యూనిట్లుగా ఇన్‌చార్జీల పర్యవేక్షణలో ఉండేలా జాతీయ ఆరోగ్య మిషన్ చర్యలు చేపట్టింది. అయితే ఉట్నూర్ ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉన్నతాధికారుల సూచనలతో ఐదుగురు ఏంబీబీఎస్ వైద్యాధికారులను ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేలా నియమించినట్లు ఆస్పత్రి సుపరింటెండెంట్ పేర్కొంటున్నారు. అత్యవసర వైద్య సేవలు ప్రత్యేక వైద్యాధికారుల పర్యవేక్షణలో నిర్వహణ సాగితే మేలు జరుగుతుంది తప్ప ఎంబీబీఎస్ వైద్యులు నిర్వహణ కొనసాగిస్తే ప్రయోజనం ఉండదని గిరిజనులు వాపోతున్నారు.
నెప్రాలజీ లేక..
కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తశుద్ధి కోసం ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేం ద్రంలో ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేసింది. ఒకేసారి ఐదుగురు బాధితులకు రక్తశుద్ధి చేసేలా ఐదు డయాలసిస్ యునిట్లు ఏర్పాటు చేసి కేంద్రం నిర్వహణ బాధ్యతలను ‘డీమెడ్’ అనే సంస్థకు అప్పగించింది. డయాలసిస్ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ఇద్దరు టెక్నికల్ అధికారులు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు ఉన్నప్పటికీ డయాలసిస్ సమయంలో బాధితులను అన్ని విధాలా పర్యవేక్షించే అతి ముఖ్యమైన వైద్యాధికారి నెప్రాలజిస్ట్ లేక పోవడంతో కేంద్రం అలంకారప్రాయంగా మారింది. కీడ్నీ బాధితులకు డయాలసిస్ చేసేటప్పుడు అత్యవసరంగా రక్తం అవసరం పడుతుంది. కానీ సామాజిక ఆరోగ్య కేం ద్రంలో ఉన్న బ్లడ్ బ్యాంక్ ఎప్పుడో మూలకు పడింది. కొత్తగా నిర్మిస్తున్న భవనంలో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నా అది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బాధితులకు ఎలా డయాలసిస్ నిర్వహిస్తారో అధికారులకే తెలియాలి. ప్రత్యేక వైద్యాధికారులను నియమించి వైద్యం అందించాలని ఏజెన్సీ గిరిజనులు కోరుతున్నారు.
కలెక్టర్ ఆదేశాలతో సేవలు..
సీహెచ్‌సీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులు ఎవరూ ముందుకు రాక ఉన్నతాధికారులు ఐదుగురు ఏంబీబీఎస్ వైద్యులను ఐసీయూలో విధులు నిర్వహించేందుకు నియమించింది. అయితే వీరికి త్వరలో విడతల వారీగా ఐసీయూలో విధుల నిర్వహణపై శిక్షణ నిర్వహించనున్నారు. కేంద్రం నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు రాగానే ఐసీయూ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. డయాలసిస్ కేంద్రంలో విధులు నిర్వహణ కోసం త్వరలో నెప్రాలజిస్ట్‌ను ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది.
– వేణుగోపాల్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ ఉట్నూర్
Comments
Please login to add a commentAdd a comment