లక్షణాలనుబట్టి చికిత్స | Treatment by symptoms to Corona Victims | Sakshi
Sakshi News home page

లక్షణాలనుబట్టి చికిత్స

Published Sun, Jun 14 2020 3:09 AM | Last Updated on Sun, Jun 14 2020 9:02 AM

Treatment by symptoms to Corona Victims - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కరోనా వ్యాప్తి విస్తృతం అవుతున్న నేపథ్యంలో రోగులకు చికిత్స అందిస్తున్న విధానాలకు సంబంధించి కేంద్రం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇకపై పాజిటివ్‌గా నిర్ధారించిన వారందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లడం కంటే వ్యాధి తీవ్రతను బట్టి ఇంటి వద్దే చికిత్స అందించేలా కొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘క్లినికల్‌ గైడెన్స్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ కరోనా’పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని పాటిస్తూ కరోనా పేషంట్లకు చికిత్స అందించాలని సూచించింది. 

మూడు కేటగిరీలుగా విభజన.. 
కరోనా రోగులను మూడు రకాలుగా విభజిస్తారు. రోగి లక్షణాలు, తీవ్రతను బట్టి మైల్డ్‌ (స్వల్ప లక్షణాలు), మోడరేట్‌ (వ్యాధి తీవ్రత మధ్యస్తంగా ఉంటే జ్వరం, దగ్గు తదితర లక్షణాలు కలిగి ఉండటం), సివియర్‌ (లక్షణాలు తీవ్రంగా ఉండటం) కేటగిరీలుగా గుర్తిస్తారు. స్వల్ప లక్షణాలతో ఉన్న వారికి ఇంట్లోనే క్వారంటైన్‌ చేసి చికిత్స అందించొచ్చు. అయితే వైద్యుల సలహా మేరకు ఇంటి వద్ద చికిత్స అందించే స్థాయి వాళ్లను మాత్రమే ఈ కేటగిరీగా గుర్తిస్తారు. మోడరేట్, సివియర్‌ కేటగిరీల్లోని రోగులను తప్పకుండా ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందించాలి.

తాజా మార్గదర్శకాల ప్రకారం.. మోడరేట్‌ కేటగిరీ రోగులపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. వీరికి లక్షణాలు ఉండటం వల్ల చికిత్సలో నిర్లక్ష్యం జరిగితే సివియర్‌గా మారే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వారి ప్రాణాలు కాపాడేందుకు మోడరేట్‌ స్థాయిలోనే చికిత్స అందించి కోలుకునేలా చేయాలనేది కేంద్రం ప్రధాన ఉద్దేశ్యం. మోడరేట్‌గా గుర్తించిన వారిని జిల్లా ఆస్పత్రి లేదా కరోనా కోసం గుర్తించిన ఆరోగ్య కేంద్రంలోకి తరలించి చికిత్స చేయాలి. కరోనా వైరస్‌ రోగి ఊపిరితిత్తులపైనే కాకుండా రక్తనాళాలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో రక్తం గడ్డకట్టకుండా నిర్దేశించిన మందులను ముందే ఇస్తే మంచి ఫలితం ఉంటుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. 

రోగి నుంచి వైరస్‌ సోకుతుందిలా.. 
కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే విధానంపై కేంద్రం మరింత స్పష్టత ఇచ్చింది. రోగికి వ్యాధి లక్షణాలు ప్రారంభమయ్యే రెండ్రోజుల ముందు నుంచి.. లక్షణాలు మొదలైన 8 రోజుల వరకు ఇతరులకు సోకే వీలుంటుంది. మొత్తంగా 10 రోజుల పాటు వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువని కేంద్రం స్పష్టం చేసింది. అయితే కరోనా వైరస్‌ సోకి, లక్షణాలు లేని వాళ్లు ఎంతమందికి ఈ వైరస్‌ను అంటిస్తారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. 

48 శాతం మందిలో జ్వరం, దగ్గు 
కరోనా వైరస్‌ సోకిన వారిలో ఎక్కువ మంది జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేసిన పరిశోధనలో తేలింది. కరోనా సోకిన వారి దరఖాస్తుల్లోని సమాచారం ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చింది. 15,366 మంది దరఖాస్తులను పరిశీలించి విశ్లేషించగా.. అందులో జ్వరం 27%, దగ్గు 21%, గొంతులో గరగర 10%, దమ్ము 8%, బలహీనత 7%, ముక్కు నుంచి నీరు కారడం 3%, ఇతర లక్షణాలున్న వారు 24% మంది ఉన్నట్లు గుర్తించారు.

వాసన, రుచి తెలియట్లేదా? 
కరోనా లక్షణాల్లో తాజాగా వాసన, రుచి గుర్తించలేకపోవడాన్ని కేంద్రం తాజాగా జతచేసింది. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి జ్వరం, దగ్గు, త్వరగా అలసిపోవడం, దమ్ము రావడం, కీళ్లు, కండరాల నొప్పులు, గొంతులో గరగర, ముక్కు నుంచి నీరు కారడం, విరోచనాలు తదితర లక్షణాలుంటాయి. తాజాగా కేంద్రం కరోనా లక్షణాల్లో వాసన, రుచి గుర్తించకపోవడాన్ని జోడించింది. కరోనా వైరస్‌ సోకిన పిల్లల్లో మాత్రం ఈ లక్షణాలు కనిపించవు. వారికి త్వరగా నయమయ్యే అవకాశం ఉన్నా.. ఎక్కువ వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. మరోవైపు వయసు పైబడ్డ వారిలో, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ లక్షణాలకు బదులుగా చికాకుగా ఉండటం, ఒక్కసారిగా మంచం పైనుంచి లేవలేని పరిస్థితికి వెళ్లడం, సోయి లేకుండా పోవడం, విరోచనాలు ఉంటాయి.

కృత్రిమ శ్వాస చివరి ప్రయత్నం 
కరోనా వైరస్‌ సోకిన రోగికి కృత్రిమ శ్వాస అందించడం చివరి ప్రయత్నంగా ప్రభుత్వం నిర్దేశించింది. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాతే ఈ పద్ధతి ఎంచుకోవాలి. అయితే ఈ ప్రయత్నాన్ని అమలు చేసే ముందు రోగి మూత్రపిండా లు, కాలేయం పని తీరు సంతృప్తికరంగా ఉంటేనే చేయాలి. కృత్రిమ శ్వాసలో భాగంగా ఎక్కువ ఆక్సిజన్‌ను అందిస్తారు. ఎన్‌–95 మాస్కులు ఐసీయూలో ఉండే వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రమే వాడాలి. మిగతా రోగులకు మాత్రం ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులు ఇస్తే సరిపోతుంది. కరోనా రోగుల్లో అరవై ఏళ్లు పైబడిన వాళ్లు, షుగర్, బీపీ, ఊపిరితిత్తులకు సం బంధించిన జబ్బులు, అవయవాలు మార్పిడి చేసుకున్న వాళ్లతో పాటు ఇతర కారణాలతో రోగనిరోధక శక్తి తగ్గించే మందులు వాడే వాళ్లలో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది.  
– కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి,నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement