నర్సింగ్‌లో ఏపీ టాప్‌  | Andhra Pradesh Tops In Narsing says Central Health and Family Welfare | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌లో ఏపీ టాప్‌ 

Published Mon, Feb 13 2023 3:49 AM | Last Updated on Mon, Feb 13 2023 3:50 AM

Andhra Pradesh Tops In Narsing says Central Health and Family Welfare - Sakshi

సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో రోగులకు నిరంతరం సేవలందించేది నర్సులే. వైద్యుల సూచనలకు అనుగుణంగా రోగికి కాన్యులా అమర్చడం నుంచి సమయానికి మందులివ్వడం, వైద్య పరికరాలను అమర్చడం, వాటిని నిరంతరం పర్యవేక్షించి రోగి ఆరో­గ్య పరిస్థితిని వైద్యులకు తెలియజేస్తుండటం వంటి ఎన్నో రకాల సేవలు అందిస్తుంటారు. ఆస్పత్రుల్లో వీరి సేవలు అత్యంత కీలకం.

అందుకే ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు­త్వం ఆస్పత్రుల్లో వైద్యులతోపాటు నర్సుల నియామకానికీ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. దేశంలో శిక్షణ పొందిన నర్సులు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంటులో వెల్లడించింది. దేశంలో మొత్తం 35.14 లక్షల నర్సు­లు నమోదైతే అందులో అత్యధికంగా ఆంధ్ర­ప్రదేశ్‌లో 1,39 లక్షల మంది ఉన్నారు.

అలాగే డాక్టర్ల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతోందని ఆ శాఖ తెలిపింది. దేశంలో డాక్టర్ల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో ఉందని తెలిపింది. శిక్షణ పొందిన నర్సుల సంఖ్యలో రెండో స్థానంలో రాజస్థాన్, మహారాష్ట్ర మూడో స్థానంలోఉన్నాయి. దేశంలో 13,08,009 మంది వైద్యులు నమోదైనట్లు ఆ శాఖ తెలిపింది. వైద్యుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు రెండో స్థానంలో ఉన్నాయి.

దేశంలో ప్రస్తుతం డాక్టర్ల నిష్పత్తి 1:834­గా ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. అలా­గే నర్సుల సంఖ్య ప్రతి వెయ్యి జనాభాకు 2.06గా ఉందని పేర్కొంది. మెడికల్‌ కాలేజీల సంఖ్యను పెంచడం ద్వారా ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్యను పెంచినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. 2014కు ముందు దేశంలో వైద్య కళాశాలలు 387 ఉండగా ఇప్పుడు 654కు పెరిగినట్లు పేర్కొంది.

దేశంలో 2014కు ముందు 51,348 ఎంబీబీఎస్‌ సీ­ట్లు ఉండ­గా ఇప్పుడు 99,763కు పెరిగినట్లు తెలిపిం­ది. దే­శం­లో నర్సింగ్‌ సీట్లను పెంచేందుకు చర్య­లు తీసుకు­న్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా నర్సింగ్‌ విద్యలో విద్యార్థి, రోగి నిష్పత్తిలో మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపింది. వి­ద్యార్ధి, రోగి నిష్పత్తి­ని 1:5 నుంచి 1:3కు తగ్గించినట్లు పేర్కొంది.  

రాష్ట్రంలో మరింతగా పెరగనున్న వైద్యులు, నర్సులు 
ప్రభుత్వ రంగంలో వైద్య విద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలతో కలిపి ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటునకు రాఫ్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

ఇవన్నీ కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో డాక్టర్లు, నర్సుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. మరో పక్క దేశంలో వైద్య సిబ్బంది కొరత నివారించడానికి కేంద్ర ప్రభుత్వమూ పలు చర్యలు చేపట్టిందని, తద్వారా డాక్టర్లు, నర్సుల సంఖ్య బాగా పెరిగినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement