
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి స్థాయి తగ్గిపోవడంతో జననాల రేటు గణనీయంగా తగ్గనుందని జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అంచనా వేశాయి. 2035 నాటికి దేశంలో జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి, జననాల రేటుపై అంచనా నివేదిక రూపొందించాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందిలో 20.1 జనన రేటు ఉండగా 2031–35 నాటికి 13.1కి తగ్గిపోనుందని అంచనా వేశారు.
బిహార్‌లో మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో జననాల రేటు గణనీయంగా తగ్గనుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, పంజాబ్‌లో అత్యల్పంగా ప్రతి వెయ్యి మందిలో 9.9కి జననాల రేటు పడిపోనుందని నివేదిక అంచనా వేసింది. 1951లో దేశంలో ప్రతి వెయ్యి మందిలో 40.8 జనన రేటు ఉండగా 2001 నాటికి 25.4కు తగ్గిపోయింది. 2005లో 23.8 జనన రేటు ఉండగా 2011 నాటికి 20.1కి క్షీణించింది. సంతానోత్పత్తి స్థాయి గణనీయంగా తగ్గుతుండటంతో జననాల రేటు తగ్గిపోతున్న విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 2021–22 వార్షిక నివేదికలో కూడా ప్రస్తావించింది.