ఎంబీబీఎస్‌ సీట్లలో రాష్ట్రానికి ఏడో స్థానం | Union Health Family Welfare Department Revealed 5040 MBBS Seats In Telangana | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ సీట్లలో రాష్ట్రానికి ఏడో స్థానం

Published Mon, Jul 25 2022 1:55 AM | Last Updated on Mon, Jul 25 2022 8:16 AM

Union Health Family Welfare Department Revealed 5040 MBBS Seats In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అత్యధికంగా ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో తమిళనాడు 10,725 సీట్లతో తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాత కర్ణాటకలో 10,145 సీట్లు ఉన్నాయి. మహారాష్ట్రలో 9,895 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 9,053 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో 5,040 సీట్లున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

అయితే వచ్చే వైద్య విద్యా సంవత్సరంలో తెలంగాణలో కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. Üసంగారెడ్డి, మంచిర్యాల, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు, రామగుండం జిల్లాల్లో కొత్త కాలేజీలు రానున్న సంగతి తెలిసిందే. తద్వారా మరో 1,200 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా వస్తాయి. అయితే జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఈ సీట్లకు అనుమతి ఇస్తున్నట్లు తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.  

దేశవ్యాప్తంగా 91,927 ఎంబీబీఎస్‌ సీట్లు.. 
ఇటీవల నిర్వహించిన నీట్‌– 2022 పరీక్ష ఫలితాలు త్వరలోనే రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులు ఎక్కడెక్కడ కాలేజీలున్నాయి.. తమకు వచ్చే ర్యాంకు ప్రకారం ఏ కాలేజీలో సీటు వస్తుందనే దానిపై గతేడాది లెక్కల ప్రకారం అంచనాలు వేస్తున్నారు. కాగా, కేంద్ర ఆరోగ్య శాఖ తాజా నివేదిక ప్రకారం ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌ సీట్లు గణనీయంగా పెరిగాయి.

2017–18 లో 67,523 సీట్లుంటే.. ఇప్పుడు ఏకంగా 91,927 సీట్లు అందుబాటు ఉండటం గమనార్హం. జిప్‌మర్, ఎయిమ్స్‌తోపాటు ఈ సీట్ల సంఖ్యను కేంద్రం ప్రకటించింది. మొత్తం 322 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 48,212 సీట్లుంటే, 290 ప్రైవేట్‌ మెడికల్‌ కాలే జీల్లో 43,915 సీట్లున్నాయి. అంటే ప్రైవేట్‌లో కంటే ప్రభుత్వ కాలేజీల్లోనే ఎక్కువ సీట్లున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం 11 ప్రభుత్వ మెడికల్‌ కాలే జీల్లో 1,840 ఎంబీబీఎస్‌ సీట్లుంటే, 23 ప్రైవేట్‌ కాలేజీల్లో 3,200 సీట్లున్నాయని కేంద్రం వెల్లడించింది.  

ఈ సారి కటాఫ్‌ తగ్గే అవకాశం.. 
కేంద్రం ఈ ఏడాది దేశవ్యాప్తంగా కొత్తగా 4,058 పీజీ మెడికల్‌ సీట్లకు అనుమతి ఇవ్వగా, అందులో తెలంగాణలో 279 సీట్లు పెరిగాయి. మరో పక్క ఈసారి నీట్‌ పరీక్ష మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని నిపుణులు అంచనా వేశారు. కాబట్టి గతేడాది కంటే ఈసారి పది మార్కుల వరకు కటాఫ్‌ మార్కులు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. 2020 నీట్‌లో జనరల్‌ కటాఫ్‌ 147, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్‌ 113 మార్కులకు ఉంది.

2021 నీట్‌లో జనరల్‌ కటాఫ్‌ 138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్‌ 108గా ఉంది. ఈసారి జనరల్‌ కటాఫ్‌ 125–130 మధ్య, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్‌ 100 వరకు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్ష ర్యాంకు వరకు వచ్చినా కూడా మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీటు వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement