సీట్లు పెంచితేనే సర్దుబాటు  | Telangana High Court Cancellation Of MBBS Medical Seats | Sakshi
Sakshi News home page

సీట్లు పెంచితేనే సర్దుబాటు 

Jun 26 2022 1:27 AM | Updated on Jun 26 2022 12:10 PM

Telangana High Court Cancellation Of MBBS Medical Seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్‌ సీట్ల రద్దు అంశం జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ) పరిధిలో ఉందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీలు దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఎన్‌ఎంసీ నిర్ణయం వెలువడే వరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరింది. రద్దు చేసిన సీట్లకు ప్రత్యామ్నాయంగా ఎన్‌ఎంసీ సీట్లను పెంచాల్సి ఉందని పేర్కొంది. అనంతరం ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.

టీఆర్‌ఆర్, ఎంఎన్‌ఆర్, మహావీర్‌ మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకులు, వసతులు లేవంటూ 450 ఎంబీబీఎస్‌ సీట్లను, 100 పీజీ సీట్లను జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌(ఎంఎన్‌సీ) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీలో తమ ప్రవేశాలను రద్దు చేసిన ఎన్‌ఎంసీ ఇతర కాలేజీల్లో సర్దుబాటుకు సంబంధించి ఎలాంటి ప్రత్యామ్నాయం చేయలేదంటూ పీజీ మెడికల్‌ విద్యార్థులు డాక్టర్‌ మంగమూరి వర్షిణి సహా మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించింది. ఆ సూచనల మేరకు సర్కార్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ‘రద్దయిన కాలేజీ విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయడానికి ముందు ఎన్‌ఎంసీ సూపర్‌ న్యూమరరీ సీట్లను సృష్టించాలి. నష్టపోయే విద్యార్థులను ఇతర కాలేజీల్లో ఎలా సర్దుబాటు చేస్తారో, సర్దుబాటు చేసే కాలేజీల్లోని వసతులు, ప్రస్తుత సీట్లు, వాటి పెంపు వంటి అంశాలపై ఎన్‌ఎంసీ నిర్ణయం తీసుకోవాలి.

రాష్ట్రంలో 9 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, ఒక ఈఎస్‌ఐసీ కాలేజీ, ఒక మహిళా కాలేజీతో కలిపి 19 ప్రైవేట్‌ నాన్‌–మైనారిటీ మెడికల్‌ కాలేజీలు, ఒక మహిళా కాలేజీతో కలిపి 4 ప్రైవేట్‌ మైనారిటీ కాలేజీలున్నాయి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ ప్రభుత్వ కాలేజీల్లో ఎన్‌ఎంసీ మార్గదర్శకాల మేరకు ఉండాల్సిన 250 సీట్లున్నాయి. వీటిల్లో సీట్లను పెంచే అవకాశం లేదు. మరో 4 ప్రభుత్వ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కోసం ఇప్పటికే సీట్ల సంఖ్య పెంచారు. మహబూబ్‌నగర్‌(గతంలో 150+ కొత్తగా 25), సిద్దిపేట్‌(150+25), ఆదిలాబాద్‌(100+20), నిజామాబాద్‌(100+20) సీట్లు పెరిగాయి.

ఇక మిగిలిన రెండు నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు రెండేళ్ల క్రితమే మంజూరయ్యాయి. వీటిల్లో 150 చొప్పున సీట్లున్నాయి. వీటిల్లో కొత్త సీట్లు మంజూరు చేసినా ఆ మేరకు సరిపడా వసతులు లేవు. ఎన్‌ఎంసీ.. సీట్లను సృష్టించిన తర్వాతే సీట్ల సర్దుబాటుకు వీలుంటుంది. అలాగే అదనపు ప్రవేశాలు చేసేందుకు ప్రైవేట్‌ కాలేజీలకు ఉత్తర్వులు ఇవ్వాలి’అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

ఆ బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే.. 
ఇదే కేసులో ఎన్‌ఎంసీ కూడా హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ‘ఎన్‌ఎంసీ, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) నిబంధనల మేరకు ప్రమాణాలు, సౌకర్యాలు, అధ్యాపకులు లేకపోతే సీట్లను రద్దు చేసే అధికారం మాకుంది. వసతుల లేమి కారణంగా రద్దయిన మెడికల్‌ కాలేజీల్లోని విద్యార్థులను వేరే కాలేజీల్లో సర్దుబాటు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. సీట్ల రద్దు సమయంలో మార్గదర్శకాలను రాష్ట్రానికి, సంబంధిత యూనివర్సిటీకి పంపించాం. రాష్ట్రం అనుమతి ఇచ్చాకే అడ్మిషన్లు జరుగుతాయి.

రద్దయిన కాలేజీల్లోని సీట్ల సర్దుబాటు బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. విద్యార్థుల నీట్‌ ర్యాంక్‌లు, ఇతర కాలేజీల్లో సీట్ల ఖాళీలు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సీట్లు సర్దుబాటు చేయాలి. ఒకవేళ కాలేజీల్లో సరిపడా సీట్లు లేకుంటే ఈసారికి మాత్రమే సీట్లు పెంచాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఎంసీ అనుమతి ఇస్తుంది. ఎంబీబీఎస్‌లో 250 సీట్లు మించకుండా చూడాలి. పీజీ సీట్లనూ రాష్ట్ర సర్కారే సర్దుబాటు చేయాలి’అని పేర్కొంది. కాగా, ఈ పిటిషన్లలో తదుపరి విచారణ జూలై 7న జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement