బెయిల్ ఇప్పించండి.. లేదా చనిపోనివ్వండి!
ప్రణబ్‌కు వ్యాపమ్ నిందితుల లేఖ
భోపాల్: వ్యాపమ్ స్కాంలో అరెస్టయి గ్వాలియర్ జైలులో ఉన్న నిందితుల్లో 70 మంది వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు.. తమను బెయిలుపై విడుదల చేయాలని.. లేదంటే ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. అక్రమ పద్ధతుల్లో వ్యాపమ్ ప్రి-మెడికల్ పరీక్షను రాసి వైద్య సీట్లు పొందారన్న ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేశారు. ‘విచారణ ఖైదీలుగా సుదీర్ఘ కాలంగా జైలులో ఉన్నాం.
తీవ్ర మానసిక, సామాజిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. ఇది మాలో ఆత్మహత్య ఆలోచనలను ప్రేరేపిస్తోంది. మాతో పాటు ఇవే సెక్షన్ల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులు బెయిలు పొందితే.. జూనియర్ వైద్యులమంతా జైలులోనే మగ్గిపోతున్నాం’ అని ఆవేదన వ్యక్తంచేశారు. తమ వైద్య విద్యాభ్యాసానికి సుదీర్ఘంగా అవరోధం కలగకుండా ఉండేలా చూసేందుకు తమకు బెయిల్ ఇప్పించాలని కోరారు.