
వ్యాపమ్ స్కాంలో మూడు ఎఫ్‌ఐఆర్‌లు
దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ
భోపాల్: మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపమ్ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తును ప్రారంభించింది. బుధవారం ఈ స్కాంకు సంబంధించి మూడు ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ నమోదు చేసింది. మధ్యప్రదేశ్‌లో 2010 నాటి ప్రీ-మెడికల్ టెస్ట్ అక్రమాలకు సంబంధించి ఆ రాష్ట్ర వెనుకబడిన తరగతులు, మైనార్టీల కమిషన్ సభ్యుడు గులాబ్ సింగ్ కిరార్, ఆయన కుమారుడితో సహా మొత్తం 21 మందిని సీబీఐ నిందితులుగా చేర్చింది.
అలాగే, 2011 నాటి ప్రీ-పీజీ ఎగ్జామినేషన్స్‌కు సంబంధించి మరో 8 మందిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. తాజా ఎఫ్‌ఐఆర్‌లలో చేరినవారిలో వ్యాపమ్ మాజీ కంట్రోలర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుధీర్ భాదౌరియా, పంకజ్ త్రివేదీలు కూడా ఉన్నారు.
పెరిగిన రాజకీయ వేడి..: వ్యాపమ్ స్కాంలో ప్రధాన నిందితుడు సుధీర్ శర్మ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు పలువురు బీజేపీ ఆరెస్సెస్ నేతలు లబ్ధిపొందారంటూ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు పలు పత్రాలను విడుదల చేశారు. నిందితుడు గనుల వ్యాపారి సుధీర్ శర్మ నుంచి ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్ ద్వారా, ప్రధాన్‌తో పాటు పలువురు నేతల ప్రయాణపు ఖర్చులను శర్మ భరించినట్లు తేలిందని వారు ఆరోపించారు.