సీఎం పేరు లేదు | Vyapam scam: CBI Does not name CM Chouhan in Chargesheet | Sakshi
Sakshi News home page

సీఎం పేరు లేదు

Published Wed, Nov 1 2017 9:27 AM | Last Updated on Wed, Nov 1 2017 9:27 AM

Vyapam scam: CBI Does not name CM Chouhan in Chargesheet

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని వ్యాపమ్‌ పరీక్షల కుంభకోణంతో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌కు సీబీఐ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ కేసులో సీబీఐ మంగళవారం అభియోగపత్రం దాఖలు చేసింది. కుంభకోణానికి సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు, కంప్యూటర్‌ ఫైళ్లలో సీఎం పేరును లేదా ఏకంగా ఆ ఫైళ్లనే తొలగించారన్న ఆరోపణలను సీబీఐ కొట్టిపారేసింది. అభియోగపత్రాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సీబీఐ సమర్పించింది. పైళ్లను అన్నింటినీ ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల్లో పరీక్షించామనీ, వాటిపై ఇంతకు ముందెప్పుడూ సీఎం అన్న పదం ఉన్నట్లు కనిపించలేదని సీబీఐ అధికారులు తెలిపారు. మొత్తం 490 మందిని సీబీఐ ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. వారిలో ముగ్గురు వ్యాపమ్‌ అధికారులు ఉన్నారు. 

‘వ్యవసాయిక్ పరీక్షా మండల్(వ్యాపమ్) హిందీలో నిర్వహించిన ప్రీ మెడికల్‌ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇండోర్‌కు చెందిన ప్రజా వేగు డాక్టర్ ఆనంద్ రాయ్, గ్వాలియర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆశిశ్ చతుర్వేది వెల్లడించడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఈ స్కాంలో గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బంధువులు, ఇద్దరు ఆరెస్సెస్ నేతలు, డజన్ల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలువచ్చాయి.

హైకోర్టు ఆదేశాలతో సిట్, ఎస్‌టీఎఫ్ 2013లో దర్యాప్తు చేపట్టాయి. ఇప్పటిదాకా ఈ స్కాంకు సంబంధించి దాదాపు 2 వేల మందిని అరెస్టు చేశారు. అయితే కేసు నిందితుల్లో ఒకరైన గవర్నర్ కుమారుడు శైలేశ్ యాదవ్‌తో సహా కేసుకు సంబంధం ఉన్న 46 మంది అసహజ, అనుమానాస్పద రీతిలో మరణించారు. దీంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement