భోపాల్: మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టించిన వ్యాపం (వ్యవసాయక్ పరీక్షా మండల్) కుంభకోణంలో నిజాలు నిగ్గు తేలాలంటే ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. శివరాజ్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేసి స్వచ్ఛందంగా విచారణ కోరాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రందీప్ సుర్జేవాల పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణంలో శివరాజ్ చౌహాన్ కూడా నిందితుడేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
వ్యాపం పరీక్షల్లో చోటుచేసుకున్న కుంభకోణం శివరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిందని.. అందువల్ల ఆ స్కామ్ లో ఆయన్ను కూడా నిందితుడిగా చేర్చాలని కాంగ్రెస్ పేర్కొంది. ఆ అనుమానాస్పద మరణాల వెనుక అసలు విషయాలు బయటకు రావాలంటే శివరాజ్ తక్షణమే రాజీనామా చేయాలని పేర్కొంది.