భోపాల్ : అంతు చిక్కని మరణాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపం (యవసాయిక్ పరీక్షా మండల్) కుంభకోణం కేసులో సీబీఐ మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీటుల్ 490మంది పేర్లను సీబీఐ చేర్చింది. కాగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. సీజ్ చేసిన హార్డ్‌డిస్క్‌ను ట్యాంపర్ చేసినట్లు దిగ్విజయ్ చేసిన ఆరోపణలపై ఎలాంటి ఎవిడెన్స్ లేదని పేర్కొంది. కాగా మధ్యప్రదేశ్ మెడికల్ కాలేజీలతోపాటు వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్న అంశం ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే.
స్కాంతో ప్రమేయం ఉన్న పలువురు అనుమానాస్పదంగా మృతిచెందడంతో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో స్కాం విచారణ బాధ్యతలను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు, పోలీసు, రెవెన్యూ, తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన కేసులన్నింటి నుంచీ సిట్, ఎస్టీఎఫ్లను సుప్రీంకోర్టు తప్పించింది. ఈ కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ... స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
అలాగే వ్యాపం కుంభకోణం దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనూహ్య తీర్పునిచ్చింది. 2008 నుంచి 2012 మధ్య ఎంబీబీఎస్‌లో చేరినవారి అడ్మిషన్లు చెల్లుబాటుకావంటూ సంచలన తీర్పును వెల్లడించింది. దీంతో దాదాపు 600 మంది విద్యార్థులపై ఈ తీర్పు ప్రభావం పడింది. అదే సమయంలో విద్యార్థులు వేసిన పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఇక కొత్తగా పునర్విచారణ పిటిషన్లకు దాదాపు అవకాశం లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment