'ఆ నిందితులవి సహజ మరణాలే'
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మధ్యప్రదేశ్ పరీక్షల కుంభకోణంలో నిందితులుగా ఉంటూ మరణించినవారి సంఖ్య 24కు పెరిగింది. తాజాగా ఇండోర్ జైలులో ఉన్న నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం అనుమానాస్సద రీతిలో మరణించారు. ఇదే కేసులో మరో నిందితుడైన మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేశ్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్ గత మార్చిలో చినిపోయారు. నిందితులు, సాక్షులు కలిపి ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధం ఉన్న 40 మంది మృత్యువాతపడ్డారు. అయితే ఈ మరణాలన్నీ సహజమైనవేనని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించేది లేదని మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ సోమవారం తేల్చిచెప్పారు.
2009లో వెలుగులోకి వచ్చిన మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపీపీఈబీ) కుంభకోణంలో అనేక మంది బడా రాజకీయ నేతల హస్తం ఉదని అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో కేసును దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిట్ ను నియమించింది. అయితే కేసుతో సంబంధం ఉన్న 40 మంది మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. దరిమిలా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని విపక్షాలు పట్టుపట్టాయి. కానీ సర్కార్ అందుకు నిరాకరిస్తోంది.